నీటిసంఘాలకు పచ్చరంగు


టీడీపీ నేతల ఉపాధికి రాచబాట

 నాయకులు చెప్పిన వారికే పెత్తనం

 రైతు వ్యతిరేకత ఎదుర్కోలేక ఎన్నికలకు దూరం

 అందుకే ఏకగ్రీవ మంత్రమంటున్న పరిశీలకులు

 

 రైతుల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన నీటి సంఘాలకు రాజకీయ రంగు అంటుకొంటోంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు మరోమారు ఉపాధి దొరకనుంది. రుణ మాఫీ మడత నేపథ్యంలో రైతుల వ్యతిరేకత ఎదుర్కోలేక ఏకగ్రీవ ఎన్నికలకు సర్కారు తెరలేపింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో

 ఏకగ్రీవ తంతు నడిపేయడానికి పన్నాగం పన్నింది.

 

 ఏలూరు (మెట్రో) :

 జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్న విషయం విదితమే. అయితే ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో కాకుండా ఏకగ్రీవం గా సాగనున్నాయి. చెరువులు, కాలువల పరిధిలోని ఆయకట్టును ఎన్నికల పరిధిలోకి తీసుకుని తద్వారా ఆయా ఆయకట్టు పరిధిలో కమిటీలను ఎన్నుకుంటారు. జిల్లాలో పశ్చిమడెల్టాలో 131, కృష్ణాడెల్టాలో 16, మీడియం ఇరి గేషన్ ప్రాజెక్టులు 8, మిగిలిన సంఘా లు 223, ప్రాజెక్టు కమిటీలు 3 (ఎర్రకాలువ, తమ్మిలేరు, పశ్చిమడెల్టా), పంపిణీ కమిటీలు 22 ఉన్నాయి. అయితే వీటిలో సభ్యులను గ్రామాల పరిధిలో సమావేశ పరిచి ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికలు మాత్రం పూర్తిగా ఏకగ్రీవంగా సాగనున్నాయి.

 

 కమిటీల వల్ల ఉపయోగాలు

 ఎన్నికల వల్ల పదవులు పొందిన నీటి సంఘాల చైర్మన్‌లు, సభ్యులు సాగునీటి పంపిణీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై దృష్టి కేంద్రీకరించి ఆయా ఆయకట్టుల పరిధిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటారు. నిధులను సమీకరించేందుకూ ఈ కమిటీలు ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాయి.

 

 గతమెంతో ఘనం..

 1997 సంవత్సరంలో నీటి సంఘాలను చంద్రబాబు ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. అయితే ఈ సంఘాల ఏర్పా టు వల్ల నీటి కొరత అనేది లేకుండా చూస్తాం, చెరువులు, కాలువలు వంటివి మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సంఘాల ప్రారంభంలో నిధులు కేటాయించినా తర్వాత పట్టించుకోలేదు. అంతేకాకుండా రైతులే నీటి సంఘాల నిధులు సమీకరించుకోవాలంటూ చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది.

 

 టీడీపీ నేతల

 ఉపాధికే ఏకగ్రీవ ఎన్నిక

 నీటి సంఘాల ఊసే గత మూడు సంవత్సరాలుగా లేదు. ప్రస్తుతం తెలుగుదేశం నాయకుల రాజకీయ ఉపాధి కోసమే నీటి సంఘాలను ఏర్పాటు చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్ర రైతుల సంక్షేమ చట్టం 1997 ప్రకారం ఈ నీటి సంఘాల ఎన్నికలను బ్యాలెట్ ఓటింగ్ ద్వారా నిర్వహించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈ చట్టం తెలుపుతోంది. అయితే 13.08.15 తేదీన సెక్షన్ 34ను మార్పులు చేస్తూ నూతనంగా జీవో ఆర్‌ఐ నెంబర్ 528ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులను సమావేశపరిచి నచ్చిన వ్యక్తినే నామినేట్ చేసేయవచ్చు. ఇది కేవలం ఎమ్మెల్యే, మంత్రుల కనుసన్నల్లో వారికి సంబంధించిన నాయకులకు పదవులు అందించేందుకనేది స్పష్టం అవుతోంది.

 

 రైతుల్లో వ్యతిరేకత వస్తుందనే

 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ విషయంలో ఇప్పటికే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే టీడీపీ నేతలు గెలిచే అవకాశం ఉండదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి పక్ష నాయకులు ఈ ఎన్నికల్లో లేకుండా చేయడానికే ఈ ఏకగ్రీవ నిర్వహణను తెరపైకి తెచ్చారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

 కీలకం కానున్న అధ్యక్ష పదవి

 రెండు జిల్లాల్లో ఏర్పడనున్న ప్రాజెక్టు అధ్యక్షుని పదవి ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. జిల్లాలోని ప్రాజెక్టుల నిర్ణయాల్లో అధ్యక్షుడు నిర్ణయాలే శిరోధార్యం. ఈ అధ్యక్ష పదవిని సొంతం చేసుకునేందుకు టీడీపీ కీలక నేతలు ఇప్పటికే అధిష్టానం చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారని సమాచారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top