రెండు ప్రభుత్వ శాఖల మధ్య లేఖల యుద్ధం!

రెండు ప్రభుత్వ శాఖల మధ్య లేఖల యుద్ధం!


హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాల తొలగింపు వ్యవహారం ఆబ్కారీ, రవాణా శాఖల మధ్య లేఖల యుద్ధానికి దారితీసింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వీటిని తొలగించాలని రవాణా శాఖ పట్టుపడుతోంది. వీటిని తొలగిస్తే తప్ప ప్రమాదాలను కట్టడి చేయలేమని స్పష్టం చేస్తోంది. అయితే హైవేల పక్కనున్న మద్యం దుకాణాలను తొలగించలేమని ఆబ్కారీ శాఖ స్పష్టం చేస్తోంది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని తేల్చి చెబుతోంది. మొత్తంమీద ఈ వ్యవహారం ఆబ్కారీ, రవాణా శాఖల మధ్య రచ్చకు దారితీసింది. దీనిపై రెండు శాఖల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది.



రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 500కుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో అధికంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరిగాయని రవాణాశాఖ విశ్లేషిస్తోంది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశాల్లో రవాణాశాఖ మినిట్స్ నమోదు చేసి కచ్చితంగా హైవేల పక్కనున్న మద్యం దుకాణాలను తొలగించాలంటూ అబ్కారీ శాఖకు లేఖ రాసింది. దీనిపై అబ్కారీ శాఖ ప్రతిస్పందిస్తూ,  ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆదేశాలిస్తే తప్ప తామేం చేయలేమంటూ బదులిచ్చింది. హైవేలకు కొద్దిగా దూరంగానైనా మద్యం షాపుల్ని మార్చాలని, లేకుంటే ప్రమాదాలను నివారించలేమని పేర్కొంటూ రవాణాశాఖ లేఖల పర్వాన్ని కొనసాగించింది.



రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారుల సమావేశంలోనూ మద్యం షాపులను హైవేల పక్కనుంచి తొలగించాలని గతంలోనే నిర్ణయించారు. అయినప్పటికీ  ఇంతవరకు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు. ఈ విషయమై విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు.  ఈ అంశంపై పలువురు సామాజిక కార్యకర్తలు తప్పుపడుతున్నారు. బార్ల నిర్వాహకులకు, మద్యం వ్యాపారులకు ఓ వైపు అనుకూలంగా వ్యవహరిస్తూ, మరోవైపు రోడ్డు ప్రమాదాలపై సీరియస్‌గా ఉన్నామనడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top