మంత్రి వర్సెస్‌ ఎంపీ..!

మంత్రి వర్సెస్‌ ఎంపీ..! - Sakshi


కడప: అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకొని రాజకీయంగా పైచేయి సాధించాలనే లక్ష్యం ఆ ఇద్దరు నేతల్లో దాగి ఉంది. ఈక్రమంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల కత్తులు దూస్తున్నారు. అధిష్టాన పెద్దలకు నిజాయతీగా పార్టీ ఉన్నతి కోసం కష్టపడుతున్నామని భ్రమ కల్పిస్తున్నారు. ఈక్రమంలో ఎవరికి వారు వ్యక్తిగత పరపతి కోసం తాపత్రయం చూపుతున్నారు. వారే జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.



 జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి అనూహ్యంగా మంత్రి పదవి వరించింది. ఇకపై జిల్లాలో టీడీపీ మెరుగవుతుందని  భావించిన అధిష్టానానికి అనతికాలంలోనే ‘కొరివితో తలగోక్కున్నామనే’ విషయం తేటతెల్లమైందని పరిశీలకుల భావన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక అక్రమాల ఫలితం, ఎంపీ రమేష్‌ తోడ్పాటు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి వరించిందని విశ్లేషకుల అభిప్రాయం.



ఆపై జిల్లాలో రాజకీయ పెత్తనం తన ద్వారానే ఉండాలనే తాపత్రయం మంత్రి ఆదికి మొదలైందని పలువురు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్పీ పీహెచ్‌డి రామకృష్ణ అవినీతికి పాల్పడుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. జిల్లాలో టీడీపీకి దశ–దిశ తానేనని  చెప్పుకోవడం ఆరంభించారు.  అధికారులపై, పార్టీపై పట్టు సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.



ఎంపీపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు....

ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాక చతురత ప్రదర్శించే ఎత్తుగడ చాపకింద నీరులా వ్యవహరించసాగారని పలువురు పేర్కొంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో తన కంటే కాస్తా పైచేయిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను కట్టడి చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎంపీ రమేష్‌ చర్యల వల్ల టీడీపీ అప్రతిష్టపాలు అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం ‘గాలేరు–నగరి సుజల స్రవంతి’ పథకం పనులేనని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం రమేష్‌ కాంట్రాక్టు సంస్థ పనులు తీసుకొని వాటిని పూర్తి చేయడం లేదని, రెండేళ్లుగా పురోగతి లేదని, తద్వారా జిల్లాలో జీఎన్‌ఎస్‌ఎస్‌ పెండింగ్‌లో ఉండిపోయిందని వివరించినట్లు సమాచారం.



ప్రభుత్వం ప్రాజెక్టు పట్ల శ్రద్దతో ఉన్న విషయం ఉత్తుత్తిదేనని ఎంపీ రమేష్‌ చర్యల వల్ల ప్రజలు భావిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది ఫిర్యాదుతో వెంటనే ముఖ్య మంత్రి చంద్రబాబు స్పందించి ఎంపీ రమేష్‌కు ఫోన్‌ చేసి జీఎన్‌ఎస్‌ఎస్‌ కాంట్రాక్టు పనులు గురించి ఆరా తీసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్‌ జిల్లాకు చెందిన మంత్రి ఫిర్యాదు చేశారని తెలుసుకొని తనపైనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకే స్వయంగా చెప్పిఉండొచ్చు కదా అని ప్రశ్నించినట్లు టీడీపీ వర్గాలు ద్వారా తెలుస్తోంది.



ఎంపీ ఇఫ్తార్‌కు మంత్రి గైర్హాజర్‌...

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ముస్లిం మైనార్టీలకు ప్రొద్దుటూరులో మంగళవారం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు హాజరయ్యారు. కాగా జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి ఆ కార్యక్రమానికి గైర్హాజర్‌ అయ్యారు. మంత్రి, ఎంపీ  మధ్య విభేదాలు పొడచూపడంతోనే ఇఫ్తార్‌కు రాలేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీ రమేష్‌ సైతం వ్యక్తిగత పరపతి కోసమే కేంద్ర మంత్రి పాల్గోనేలా వ్యవహరించారని పలువురు వివరిస్తున్నారు.



ముఖ్యమంత్రికి ఎంపీ రమేష్‌పై మంత్రి ఆది ఫిర్యాదు చేసిన  నేపథ్యంలో ఎంపీ వర్గీయులు మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు సన్నహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆధారాలతో సహా నిరూపించేందుకు తెరవెనుక కసరత్తు ఆరంభించినట్లు సమాచారం. ఇటీవల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీపై ఆరోపణలు చేశారని, అలాగే జిల్లాలో మార్కెఫెడ్‌ యంత్రాంగంపై ఆరోపణలొస్తే మధ్య దళారుల ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని పలు ఆరోపణలు సన్నద్ధం చేశారు. వీటన్నిటికి ఆధారాలు సమకూర్చి నేరుగా ముఖ్యమంత్రికి చేర్చాలనే దిశగా పావులు కదుపుతోన్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలకే మంత్రి ఆది ప్రాధాన్యత ఇస్తున్నారని రుజువు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top