గంటా, అయ్యన్నల మధ్య ‘ల్యాండ్‌’మైన్‌

గంటా, అయ్యన్నల మధ్య ‘ల్యాండ్‌’మైన్‌ - Sakshi

- సీఎంకు గంటా లేఖాస్త్రం!

- అయ్యన్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు

- విశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు

- భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలి

 

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ భూ కుంభకోణం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రగిలిస్తోంది. వీరిద్దరి మధ్య కొనసాగుతున్న వైరం చినికి చినికి గాలివానగా మారుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు చాన్నాళ్లుగా ఉప్పు, నిప్పులా ఉంటున్నారు. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణంలో గంటా పాత్ర ఉందంటూ అయ్యన్నపాత్రుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నారంటూ గంటాను ఉద్దేశించి పత్రికా సమావేశాల్లోనూ చెప్పారు. ఈ నేపథ్యంలో గంటా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. అయ్యన్న వ్యాఖ్యల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి, విశాఖ ప్రతిష్ట దిగజారుతుందని అందులో స్పష్టం చేశారు. అయ్యన్న ఆరోపణలతో ప్రతిపక్షాలు టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీపై అపనమ్మకం కలుగజేస్తున్నారని పేర్కొన్నారు.



ఈ భూ కుంభకోణంపై సీబీఐ గాని, సీబీసీఐడీ, లేదా సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఇన్నాళ్లూ అయ్యన్న వ్యాఖ్యలపై బహిరంగంగా మాట్లాడని, లేఖల సంస్కృతికి దూరంగా ఉండే గంటా ఒక్కసారిగా సీఎంకు లేఖ రాయడం తెలుగుదేశం పార్టీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గంటా ముఖ్యమంత్రికి రాసిన ఈ లేఖ బుధవారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. గంటా ఈ లేఖను ఈనెల 4న సీఎంకు రాసినా ఆలస్యంగా బుధవారం బయటకు వచ్చింది.  మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో తెలియదని అంటున్నాయి. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top