వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలేవి?


 కేసులు పెట్టి శిక్షించాలి

 వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి శిక్షించాలి. అప్పుడే కబ్జాదారుల్లో భయం వస్తుంది. మసీదుల నిర్వాహణ కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకొని అనుభవించడం తగదు.

 - ఎస్‌ఎ అమీర్, జమాతే ఇస్లామియా రాష్ట్ర సభ్యుడు (93970 09577)

 

 కర్నూలు(రాజ్‌విహార్):

 జిల్లాలో వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు కరువయ్యాయి. వేల ఎకరాలు కబ్జాకు గురైనా పట్టించుకునే నాథుడు లేడు. అధికారుల అలసత్వం, వైఫల్యాలను ఆసరా చేసుకున్న అక్రమార్కులుమాన్యాలను యథేచ్ఛగా ఆక్రమించుకొని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రక్షించేందుకు చట్టాలు, జీవోలున్నా చర్యలు లేవు. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. అయితే, ప్రతినెలా సమావేశమై పురోగతి చూపాల్సిన కమిటికీ తీరిక లేకుండా పోయింది. వక్ఫ్ భూముల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 అక్టోబరు 13న జీవో నంబర్ 18ని జారీ చేసింది. ఈటాస్క్‌ఫోర్స్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్‌ఓ/ జిల్లా వక్ఫ్ ఆఫీసర్ సభ్యులు, కన్వీనర్‌గా నియమించారు. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌అండ్‌బీ ఈఈ, మైనార్టీ సంక్షేమాధికారి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, ఫారెస్టు ఆఫీసర్లను సభ్యులుగా చేర్చి ఉత్వర్వులు జారీ చేశారు. టాస్క్‌ఫోర్టు కమిటీకి పలు బాధ్యతలు అప్పగించారు.

 

 కబ్జాకు గురైన భూముల వివరాలను మైనార్టీ సంక్షేమాధికారి కమిటీకి ఇవ్వాలి. దీనిపై కలెక్టర్ అధ్యక్షతన ప్రతినెలా సమావేశమై భూముల వివరాలు, సర్వే నంబర్లు, ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, గతంలో వీరిపై తీసుకున్న చర్యలు, తిరిగి స్వాధీనానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలి. కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యల వివరాలను ప్రతినెల 3న మైనార్టీ కమిషనర్‌కు పంపితే వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. కమిటీ ఏర్పడి తొమ్మిది నెలలైనా ఒక్కసారే సమావేశమైనా ఆ సమావేశానికి కలెక్టర్ హాజరు కాకపోవడంతో జేసీ నిర్వహించారు. 32,599 ఎకరాల్లో 8,100 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. వీటి విలువ రూ.500కోట్లకు పైగా ఉంటుంది. అయిన అధికారుల్లో చలనం లేదు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top