లెసైన్స్ పొందాలనుకుంటున్నారా?


ఒంగోలు:  ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, లారీల వంటి ఫోర్‌వీలర్లు నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లెసైన్స్ ఉండాల్సిందే. దీనికి 18 ఏళ్లు నిండినవారే అర్హులు. అయితే 16 సంవత్సరాలు నిండినవారు గేర్లు లేని (55సీసీ లోపు సామర్థ్యం కలిగిన) మోపెడ్‌లు నడిపేందుకు అర్హత ఉంటుంది.. అయితే వీరికి తల్లిదండ్రులు లేదా సంరక్షుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.



 ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవచ్చిలా..

 లెర్నింగ్ లెసైన్స్ కావాలనుకొనేవారు  ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి.



పొందగోరువారికి తమ చిరునామాకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయంలో మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ పొందే అనుమతి లభిస్తుంది. లేదంటే దాని పరిధిలోని యూనిట్ కార్యాలయాల్లో తీసుకోవచ్చు.

 

స్లాట్ నమోదుచేసుకున్న 24 గంటల్లోపుగా సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో లేదా ఈ- సేవా కేంద్రంలో ఫీజు చెల్లించాలి.



టూవీలర్, ఫోర్ వీలర్లలో ఏదైనా ఒక దానికోసమైతే రూ. 60, రెండూ కావాలనుకుంటే రూ. 90 చెల్లించాల్సి ఉంటుంది.



స్లాట్ తీసుకున్న 24 గంటల్లోగా ఫీజు చెల్లించకపోతే అది రద్దయిపోతుంది.



స్లాట్ బుక్ చేసుకున్న గడువు, సమయాన్ని అనుసరించి ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించే పరీక్షకు హాజరుకావాలి.



ఇదే సమయంలో అభ్యర్థులు బర్త్, అడ్రెస్ ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకెళ్లాలి.



 లెర్నింగ్ లెసైన్స్ టెస్టులో ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలతో ఇతర అంశాలపై 20 ప్రశ్నలుంటాయి. వాటిలో కనీసం 16 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన సమాధానాలు గుర్తించాలి.



పరీక్షలో పాస్ అయినవారికి మాత్రమే లెర్నింగ్ లెసైన్స్ ఇస్తారు. అయితే ఇది కేవలం ఆరు నెలలవరకే చెల్లుబాటు అవుతుంది.



ఎల్‌ఎల్‌ఆర్ పొందిన 30 రోజుల తరువాత.. దాని గడువు ముగిసేలోగా శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందవచ్చు.



నాన్ ట్రాన్స్‌పోర్టు వెహికల్ లెసైన్స్ పొందిన వారు ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టు లెసైన్స్ పొందేందుకుకనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి.



ఒంగోలు , చీరాల, మార్కాపురం, కందుకూరు, దర్శిలోని ఆర్టీఏ కార్యాలయాల ద్వారా లెర్నింగ్ లెసైన్స్ పొందవచ్చు.

 

శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్

 శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకొనేవారు కూడా ఆర్టీఏ వెబ్‌సైట్‌లో స్లాట్ నమోదుచేసుకోవాలి. 24 గంటల్లోగా ఈ- సేవలో కానీ, సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో కానీ రూ.475 నుంచి రూ. 525లు ఫీజు చెల్లించాలి. ఆర్టీఏ కార్యాలయాల టెస్టు ట్రాక్‌లలో పరీక్ష నిర్వహిస్తారు. మోటారు వాహనాల నిబంధనల ప్రకారం వాహనాలు నడపాలి. తనిఖీ అధికారి పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలో వాహనదారుడు నైపుణ్యంతో వ్యవహరిస్తేనే శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ మంజూరవుతుంది. పోస్టు ద్వారా  లెసైన్స్ మీ చిరునామాకు చేరుతుంది. పూర్తి వివరాల కోసం జిల్లాలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కార్యాలయం లేదా ఇతర మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top