మా ఇంటికి రాని మహాలక్ష్మి!

మా ఇంటికి రాని మహాలక్ష్మి!


తెలుగింట ఆడబిడ్డల పథకం అటకెక్కింది... గత ప్రభుత్వం పెట్టిన పేరు మార్చి ఆడంబరంగా అమలు చేస్తామని తాజా సర్కారు ఆర్భాటంగా చెప్పింది. ఆడపిల్ల భారం కాదు.. పుట్టిన వెంటనే ప్రభుత్వమే కొంతమొత్తం ఆ పిల్ల పేరుమీద డిపాజిట్ చేస్తుంది. ఆమెను కన్న తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు. అని ఎంతో భరోసా ఇచ్చింది. కానీ అమలుకు వచ్చేసరికి ముఖం చాటేసింది. పాత పథకం కొనసాగించక... కొత్త పథకాన్ని ప్రారంభించక ఆడబిడ్డలకు అన్యాయం చేసింది.

 

* అటకెక్కిన బాలికల సంక్షేమ పథకం

* రెండేళ్లుగా విడుదల కాని నిధులు

* ఆందోళనలో లబ్ధిదారులు

* పేరుకు పోయిన వేలాది దరఖాస్తులు


బొబ్బిలి/నెల్లిమర్ల : ఆడపిల్ల ఎవరికి బరువు కాకూడదు... బడుగు, బలహీన వర్గాల్లో పుట్టిన ఆడపిల్లకు చదువుకొనే వరకూ అండగా ఉంటామని నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బంగారుతల్లి పథకాన్ని అమలు చేశారు. 2013 మే ఒకటో తేదీ తరువాత పుట్టిన ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.



ఆడపిల్ల పుట్టిన 21 రోజుల తరువాత పథకానికి దరఖాస్తు చేసుకుంటే... బిడ్డ పేరుతో బ్యాంకులో రూ. 2500 డిపాజిట్ చేస్తారు. తరువాత వరుసగా రెండేళ్లపాటు ఏడాదికి వెయ్యి చొప్పున ఇమ్యూనైజేషన్ అయిన వెంటనే జమ చేస్తారు. ఆ తరువాత మూడు నుంచి అయిదేళ్ల వయసు వరకూ అంగన్వాడీ కేంద్రాలకు పంపితే ఏడాదికి రూ. 15 వందలు బ్యాంకులో జమ చేస్తారు. స్కూలులో వేసిన తరువాత అయిదో తరగతి వరకూ ఏడాదికి రూ. రెండు వేలు చొప్పున ఆడపిల్ల ఖాతాలో వేస్తారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రూ. 2500లు, 9, 10 తరగతులు చదువుతున్నప్పుడు ఏడాదికి రూ. 3 వేలు వేస్తారు. ఇంటర్‌లో రూ. 3500లు, డిగ్రీ చదువుతున్నప్పుడు రూ. 4 వేలు వేస్తారు.

 

పేరు మార్చినా...

బంగారుతల్లి స్థానంలో మాఇంటి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం 2014లోనే ప్రకటించింది. పథకం నిర్వహణ బాధ్యతను వెలుగు(ఇందిరాక్రాంతి పథం)నుంచి ఐసీడీఎస్‌కు మార్చుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ళు దాటినా పథకం ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో ఈ పథకం ప్రారంభమప్పుడు 1650 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 350 మందికి మాత్రమే దీనిని వర్తింపజేశారు.



మిగిలిన వారంతా ఎప్పుడు మంజూరు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. విజయనగరం పురపాలక సంఘంలో 550, సాలూరులో 270, పార్వతీపురంలో 230, బొబ్బిలిలో 260 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినా రెండేళ్లుగా మంజూరు కాలేదు. అయితే ఇప్పుడు ఆ దరఖాస్తులు కూడా తీసుకోవడంలేదు. దీనికోసం నిర్దేశించిన వెబ్‌సైట్ కూడా ఓపెన్ కాకపోవడంతో ఇటు అధికారులు, అటు లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాలకు చెందిన 10వేల మంది చిన్నారులు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా లక్షమందికి పైగా ఎదురు చూస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

 

మొదటి జమతోనే సరి

ఇదిలా ఉంటే బంగారుతల్లి పథకానికి సంబంధించి మొదటి విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2500లు చొప్పున ఖాతాల్లో జమచేసింది. రెండు, మూడో సంవత్సరంలో ఇవ్వాల్సిన రూ. వెయ్యి ఇవ్వలేదు. అసలు ఈ పథకం ఉందో లేదో కూడా ప్రస్తుతం తెలియని పరిస్థితి నెలకొంది.

 

ఏడాదిగా ఎదురు చూస్తున్నాం

మాకు పాప పుట్టి ఏడాది దాటింది. పెద్ద పాపకు బంగారుతల్లి పథకం ఉంది. చిన్నపాపకు కూడా పథకంలో చేర్పిద్దామని వెళితే ఆన్‌లైన్ అవ్వడం లేదని చెప్పారు. కొత్త పథకం వస్తుందన్నారు. అప్పటినుంచి తిరుగుతూనే ఉన్నాం.

- బొద్దాన రాధ, నెల్లిమర్ల.

 

రెండేళ్ళ క్రితమే ఆన్‌లైన్ నిలిచిపోయింది

బంగారుతల్లి పథకానికి సంబంధించి రెండేళ్ళ క్రితమే ఆన్‌లైన్ నిలిచిపోయింది. పథకాన్ని ఐసీడీఎస్‌కు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ కూడా ఆన్‌లైన్ చేయడంలేదు.

- జగదీష్, వెలుగు ఏపీఎం, నెల్లిమర్ల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top