స్వేచ్ఛగా ఓటు వేయండి

స్వేచ్ఛగా ఓటు వేయండి - Sakshi

  •     విధుల్లో 24 వేలమంది ఉద్యోగులు

  •      ఎన్నికల నిర్వహణకు     నిధుల కొరత లేదు

  •      అభ్యర్థుల తీరు వీడియోల ద్వారా చిత్రీకరణ

  •      ‘సాక్షి’తో  కలెక్టర్ రాంగోపాల్

  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కే. రాం గోపాల్ చెప్పారు. చిత్తూరులోని కలెక్టర్ చాంబ ర్‌లో గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ఈనెల 19తో నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని, 23న పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారవుతారన్నారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేస్తున్నారని చెప్పారు.



    ఓటర్ల నమోదులో జిల్లా ముందంజలో ఉంద ని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కొత్తగా నమోదైన యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారన్నారు. మీడియా సెంటర్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

     

    స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా మంచి వాతావరణంలో జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చ ర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో సహకరిస్తారని చెప్పారు. ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామన్నారు.



    ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అభ్యర్థులతో పాటు ఉద్యోగులు పాటించాలని, తప్పులు చేస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొని తిరిగి సొంత విధులకు హాజరయ్యే సమయంలో వారికి అక్కడికక్కడే రెమ్యునరేషన్ అందజేస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల కొరత లేదన్నారు.



    ఉద్యోగుల విధి నిర్వహణకు రాజకీయ నాయకులు ఎటువంటి ఆటంకాలు కలుగజేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, వివిధ పార్టీల అభ్యర్థుల తీరును ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా రికార్డు చేస్తారన్నారు. ఎక్కడైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే హక్కు ఎన్నికల పరిశీలకులకు ఉందన్నారు.

     

    కిటకిటలాడిన చిత్తూరు నగరం

     

    నామినేషన్ల సందర్భంగా చిత్తూరు నగరం కిటకిటలాడింది. వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటు అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్, వైఎస్‌ఆర్ సీపీ చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ఇంకా పలువురు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని వీధులన్నీ వైఎస్‌ఆర్ సీపీ జెండాలతో నిండిపోయాయి. వేలాది సంఖ్యలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.  రాజంపేట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సాయిప్రతాప్ కొద్దిమందితో వచ్చి నామినేషన్ దాఖలు చేసి వెళ్లిపోయారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top