వోల్వో బస్సు దగ్ధం.. మరో బస్సులో మంటలు

వోల్వో బస్సు దగ్ధం.. మరో బస్సులో మంటలు - Sakshi


హైదరాబాద్‌/ విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల పెను ప్రమాదాలు తప్పాయి. ఒకేరోజు కొన్ని గంటల తేడాతో రెండు ప్రైవేట్‌ బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఓ బస్సు పూర్తిగా దగ్ధం కాగా, మరో బస్సులో మంటలను అదుపు చేశారు. ఈ రెండు ఘటనల్లో ప్రయాణకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.



కావేరి ట్రావెల్స్‌ బస్సు దగ్ధం: విశాఖపట‍్టణం జిల్లా కశింకోట మండలం పరవాడపాలెం వద్ద శనివారం వేకువజామున కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి అనకాపల్లికి పెళ్లి బృందంతో వెళుతున‍్న ఈ బస్సులో పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు నుంచి పొగలు వస్తున్నాయని పక్కనే కారులో వెళ్తున్నవారు చెప్పడంతో  డ్రైవర్‌ బస్సును ఆపాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. ప్రయాణుకులు కిందకు దిగారో లేదో బస్సులోకి మంటలు వ్యాపించాయి. బస్సు చాలావరకు దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెళ్ళి బృందాన్ని మరో బస్సులో తరలించారు.



బస్సులో మంటలు: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్‌ ట్రావెల్స్‌ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగినవారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు.



అందుబాటులో ఉన్న నీళ్లను మంటలపై చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్‌ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top