గోదారి తీరాన.. గుబాళిస్తున్న ‘మానవత’

గోదారి తీరాన.. గుబాళిస్తున్న ‘మానవత’


 కంబాలచెరువు (రాజమండ్రి) :ఎన్నో వాగువంకలూ, చెలమలూ, సెలయేళ్లూ కలిస్తేనే అఖండ గోదావరి అవుతుంది. జాలులుగా, ప్రవాహాలుగా ఆ నదిలో చేరిన జలసిరికి.. దప్పిక గొన్న నోళ్లకు, నెర్రెలు తీసిన బీళ్లకు చేరితేనే నిజమైన సార్థకత. అదిగో.. ఆ స్ఫూర్తితోనే ఆ నదీతీరాన ఉన్న రాజమండ్రి నుంచి విలక్షణ సేవలు  అందిస్తోంది ‘మానవత’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ. ‘సమాజం నుంచి స్వీకరించడమే కాదు.. సమాజానికి సమర్పించడమూ మన కర్తవ్యం. అవసరమైన వారికి సేవ చేయడమే మానవత్వం’ అన్న లక్ష్యంతో నగరానికి చెం దిన కొందరు ప్రముఖులు 2012లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం సేవలను విస్తరించే సంకల్పంతో ఉంది. 2002 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్.రామచంద్రారెడ్డి అనే సేవాతత్పరుడు చేస్తున్న సేవలతో పొందిన స్ఫూర్తే ఈ తీరంలో ఆ తరహా సేవలకు అంకురార్పణ చేయించిందని నిర్వాహకులు అంటున్నారు.

 

 పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోయి, దూరాన ఉన్న ఆత్మీయులు రావలసిన సందర్భాల్లో భౌతికకాయాలను చెడిపోకుండా భద్రపరచడం భరించలేని వ్యయంతో కూడిన పని. దాంతో చాలామంది రావలసిన వారు రాకుండానే అంత్యక్రియలు నిర్వహిస్తుం టా రు. అలాంటి సందర్భాల్లో  మృతదేహాలను చెడిపోకుండా పదిలపరిచే ‘ఫ్రీజర్ బాక్స్’లను పేదకుటుంబాలకు ఉచితంగా అందిస్తోంది ‘మానవత’. ప్రస్తుతం రాజమండ్రి, పరిసర ప్రాంతాల వరకు ఈ బాక్స్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. జిల్లాలోని దూరప్రాంతాలకైతే కేవలం రవాణా చార్జీలు తీసుకుంటున్నారు.

 

 అలాగే రాజమండ్రి, పరిసరాల్లో చనిపోయిన వారిని రాజమండ్రిలోని కైలాసభూమికి తరలించేందుకు ఉచితంగా శాంతిరథాన్ని సమకూరుస్తున్నారు. ఈ వాహనాన్ని పద్మసాయి ఫైనాన్స్ సంస్థ సమకూర్చింది. కాగా స్కూళ్లలో చదువుతున్న పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో చేతులు అపరిశుభ్రంగా ఉండడం చూసిన సంస్థ సభ్యుల్లో ఒకరైన మెహర్ మధు ఆ స్థితికి విరుగుడుగా ఏదైనా చేయాలనుకున్నారు. ప్రస్తుతం ఆయన నగరంలోని స్కూళ్లన్నింటికి లిక్విడ్ సోప్‌ను నిరంతరాయంగా ఉచితంగా అందిస్తున్నారు. తమ సంస్థ సేవలు వినియోగించుకోవాలంటే కేవలం ఒక్క ఫోన్ చేస్తే సరిపోతుందని మానవత నిర్వాహకులు చెపుతున్నారు. అవసరమైన వారు 93979 16060, 94913 86972, 92466 52620లో సంప్రదించవచ్చంటున్నారు.

 

 త్వరలో అంబులెన్స్, రక్తదాన శిబిరాలు

 ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 108 అందుబాటులేక కొందరికి ప్రాణాంతకమవుతోంది. అలాంటి స్థితిలో ఆపన్నులను ఆదుకునేందు కు అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది మానవత. త్వరలోనే ఈ సదు పాయం నగరవాసులకు కల్పించనుంది. అ లాగే సమయానికి రక్తం దొరకక చాలామంది రోగులకు విషమ పరిస్థితి ఎదురవుతోంది. ఆ దిశగా వారి కోసం ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ నిర్వాహుకులు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారులు మెహర్‌మధు, రత్నాజీ (పద్మసాయి), బాబి, చింతా ప్రభాకరరడ్డి(సీపీ రెడ్డి), బలేష్ గుప్త, చక్కా త్రినాథ్, మద్దుల మురళీకృష్ణ, మన్యం బాబ్జి, గౌతమీ నేత్రాలయం మధు, పి.రామచంద్రయ్య, విక్రమ్‌జైన్‌లు సారథులుగా ముందుకు నడిపిస్తున్న ‘మానవత’ మరింత మందిలో మానవీయతను తట్టి లేపి, ఇతోధిక సేవలకు ప్రేరణ కావాలని ఆశిద్దాం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top