విజయనగరం కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌

విజయనగరం కలెక్టర్‌గా వివేక్‌ యాదవ్‌

కలెక్టర్‌ నాయక్‌కు బదిలీ

ఏపీఈపీడీసీఎల్‌ వీసీఎండీగా అవకాశం

 

విజయనగరం: జిల్లా కలెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌కు బదిలీ అయింది. ఈయన్ను విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీగా నియమించారు. జిల్లాకు కొత్త కలెక్టరుగా వివేక్‌ యాదవ్‌ను నియమించారు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళం సంయుక్త కలెక్టరుగా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడి కలెక్టర్‌గా పని చేస్తున్న ఎం.ఎం.నాయక్‌ 2014 జూలై 14వ తేదీన జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల 14రోజులుపాటు పని చేసి విజయవంతంగా పని చేసిన కలెక్టర్ల జాబితాలో స్థానం సంపాందించారు. ఐటీ ఈడీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన కొంత కాలం ఇబ్బంది పడినా తర్వాత విజయవంతమయ్యారు. కొంతమంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నా మరికొంతమంది దష్టిలో మంచి కలెక్టర్‌గానే గుర్తింపు పొందారు. ఆయన విధుల్లో చేరిన మూడు నెలలకు వచ్చిన హుద్‌హుద్‌ తుఫాన్‌ పునరావాస పనుల్లో అరంభంలో అనేక విమర్శలు ఎదుర్కొని బదిలీ తప్పదన్న చర్చసాగింది.



అనూహ్యంగా సర్దుకున్న ఆయన సుధీర్ఘకాలంపాటు పని చేయడం విశేషం. తోటపల్లి ప్రాజెక్టు చివరిదశ పనులు చురుగ్గా చేపట్టి నీరు విడుదల చేయడం, భోగాపురం భూసేకరణ అంశాల్లో బాగా పని చేశారన్న ప్రశంసలు ప్రభుత్వ పెద్దల నుంచి పొందారు. ప్రధమంలో నాయకుల మాటలను పెద్దగా పట్టించుకోకపోయినా.. తరువాత కాస్త వారితో సఖ్యత కుదిరినట్టు తెలిసింది. అధికారుల్లో కూడా మిశ్రమ స్పందన ఉంది. బాగా పని చేసినా తాను చెప్పింది వినకుంటే ఇబ్బంది పెడతారన్న విమర్శ ఉంది. కొంతమంది అధికారులు మాత్రం ఆయన పనితీరును మెచ్చుకున్నారు. పని చేసిన వారిని ప్రోత్సహిస్తానని, పని చేయని వారిని దూరంగా పెట్టక తప్పదని ఆయన పదేపదే చెప్పే మాట. ఆయన వచ్చిన తర్వాత కలెక్టరేట్‌ భవనం కొంత మెరుగుపడ్డం ఆయన పనితీరుకు నిదర్శనం. నిజాయితీ పరుడన్న పేరు కూడా ఉంది.

 

 

బీహార్‌నుంచి... ఏపీకి...

జిల్లా కలెక్టరుగా నియమితులైన వివేక్‌ యాదవ్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 1981 ఆగస్టు 13వతేదీన జన్మించారు. తండ్రి మోతీలాల్‌ యాదవ్‌. తల్లి కాంతియాదవ్‌. 1997లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదో తరగతి, 1999లో సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో 12వతరగతి చదివారు. 1999 నుంచి 2003వరకు సుల్తాన్‌పూర్‌ కెఎన్‌ఐటీలో బీటెక్‌ చదువు పూర్తి చేసి, సి–డాట్లో నాలుగన్నరేళ్లు పని చేశారు. 2008లో ఐఏఎస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ ప్రస్తానం ప్రారంభించారు.

 

ఉద్యోగ ప్రస్థానమిలా...

శిక్షణ ముగించుకున్న తర్వాత వరంగల్‌ జిల్లాలో సబ్‌ కలెక్టరుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పని చేశారు. అక్కడ నుంచి గుంటూరు సంయుక్త కలెక్టరుగా పదోన్నతిపై వచ్చిన ఆయన ఆరు నెలల క్రితం శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. తాజా బదిలీల్లో జిల్లాకు కలెక్టరుగా నియమితులయ్యారు. ఇప్పటివరకు పని చేసిన స్థానాల్లో మంచి అధికారిగా గుర్తింపు పొందిన ఆయనకు సౌమ్యుడన్న పేరుంది. జిల్లాకు వస్తున్న ఆయనపై గురతర బాధ్యతలున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి, గిరిజన విశ్వవిద్యాలయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టుల పూర్తి, ఏన్‌ఏడీ స్థల సేకరణ వంటివి ముందున్న సవాళ్లు. వీటితోపాటు పరిపాలనాపరంగా అనేక అంశాలపై ఆయన ముద్ర చూపాల్సి ఉంది.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top