ఐటీ హబ్ దిశగా..

ఐటీ హబ్ దిశగా.. - Sakshi


త్వరలో ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం తరలింపు

జేడీ స్థాయి అధికారి నేతృత్వంలో కార్యకలాపాలు

ఐటీ అనుమతులు ఇక్కడి నుంచే!

నగరంలోనే ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీ ఏర్పాటు


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాష్ట్రంలో ఐటీ ప్రధాన కేంద్రంగా విశాఖ రూపాంతరం చెందుతోంది. రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యాలాయాన్ని విశాఖపట్నంలోనే నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఐటీ ప్రధాన కార్యాలయాన్ని దశలవారీగా విశాఖపట్నానికి తరలింపు ప్రక్రియ రెండు నెలల్లో ప్రారంభమవుతుంది. ఇక ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీ ఏర్పాటు కూడా పూర్తయితే రాష్ట్ర ఐటీ రంగానికి విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఆవిర్భవిస్తుంది.

 

దశలవారీగా ప్రధాన కార్యాలయం తరలింపు

హైదరాబాద్‌లో ఉన్న అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలను రాష్ట్రానికి తరలించాలని నిర్ణయించారు. వాటిలో అత్యధిక శాఖల కార్యాల యాలు విజయవాడకు తరలించనుండగా.. ఐటీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని మాత్రం నగరంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా ఐటీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని  విశాఖపట్నం తరలించాలని భావిస్తున్నారు.  మొదటి దశలో జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాయింట్ డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్‌లతోపాటు కొంతమంది సిబ్బందిని కేటాయిస్తారు. రెండుమూడు నెలల్లో అధికారులు, సిబ్బంది తరలింపుతో ఐటీ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అనంతరం రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, ఇతరత్రా అన్ని ఐటీ వ్యవహారాలకు సంబంధించిన అనుమతులను విశాఖపట్నం కార్యాలయం నుంచే ఇవ్వాలని నిర్ణయించారు.

 

ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజన్సీ

రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పాలని నిర్ణయించిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీని  విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయనున్నారు. సొసైటీ చట్టం ప్రకారం ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నారు. సీఎం నేతృత్వంలో పనిచేసే ఈ ఏజెన్సీకి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈవోగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ఐటీ శాఖకు అనుబంధంగా పనిచేసే ఈ ఏజెన్సీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ విధాన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలులో కీలకపాత్ర పోషిస్తుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శిక్షణ, విస్తరణ తదితర కార్యకలాపాలను ఈ ఏజెన్సీ చేపడుతుంది. ఐటీ ప్రధాన కార్యాలయం తరలింపు, ఐటీ-ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీల ఏర్పాటుతో విశాఖ నగరంలో ఐటీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ఊపందుకుంటాయని అధికారులు భావిస్తున్నారు.

 

ఐటీ హిల్స్ మీద ప్రధాన కార్యాలయం

ఐటీ శాఖ ప్రధాన కార్యాలయాన్ని  విశాఖపట్నం శివారులోని మధురవాడ ఐటీ ఎస్‌ఈజెడ్‌లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం ఎస్‌ఈజెడ్‌లోని ఐటీహిల్స్ మీద అర ఎకరా స్థలాన్ని కేటాయించాలని ఏపీఐఐసీని కోరనున్నారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన స్థలాన్ని కేటాయిస్తే ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే పూర్తిస్థాయిలో ఐటీ ప్రధాన కార్యాలయాన్ని విశాఖ తరలిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top