సంచలనం

సంచలనం - Sakshi


నాతవరం మండలంలో జంట హత్యలు

సహచరిపై అనుమానంతో గునపంతో దాడి

మహిళ, ఆమె ప్రియుడు హతం




విశాఖపట్నం : తెలతెలవారుతుండగానే కలకలం రేగింది.. జంట హత్యలతో గ్రామమంతా విస్తుబోయింది.. ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం సహించలేకపోయాడు.. మద్యం మత్తులో ఉన్నట్టు నటించి సహచరి, ఆమె ప్రియుడు ఒక్కచోటకు చేరేక కిరాతకంగా హతమార్చాడు. నాతవరం మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి.



 కె.వి.శరభవరం పంచాయతీ శివారు కృష్ణాపురం గ్రామానికి చెందిన వంజరి రాము అనుమానంతో తనతో సహజీవనం చేస్తున్న సంధ్యారాణి (26)ని, ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్న కాళ్ల రాంబాబు (46)ను కిరాతకంగా గునపంతో కొట్టి చంపేశాడు. నిందితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాముకు గతంలో వివాహం జరిగింది.



మొదటి భార్యకు దూరంగా ఉంటూ ఆరేళ్ల నుంచి సంధ్యారాణితో కలిసి ఉంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వెదురుపల్లి గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబుకు సంధ్యారాణికి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం గమనించిన రాము.. పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో కొన్నాళ్లుగా కోపంగా ఉన్నాడు.



పథకం ప్రకారం..

శుక్రవారం రాత్రి కృష్ణాపురం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు రాము, సంధ్యారాణి కలిసివెళ్లారు. ఆ పెళ్లికి రాంబాబుకు కూడా వచ్చాడు. దీంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాడు. పెళ్లి సమయంలో వారిద్దరి కనుసైగలను గమనించి మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. మత్తుగా పడుకున్నాడని భావించిన ఆమె పెరట్లో వేచివున్న రాంబాబు వద్దకు మెల్లగా జారుకుంది.



రాము పథకం ప్రకారం గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్లు, ముఖాలపై కసి తీరా కొట్టి ప్రాణాలు తీశాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఏం జరిగిందని వెళ్లి చూడగా రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో పడివున్నారు. రాము వెంటనే నాతవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటనపై వీఆర్వో సత్తిబాబు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం రూరల్‌ సీఐ రేవతమ్మ, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ సంఘటన స్థలంలో ఉన్న జంట మృతదేహాలను పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top