ఇటు కోత..అటు మేట!

ఇటు కోత..అటు మేట! - Sakshi


పరుపులను తలపించే ఇసుకతిన్నెలు లేవు.. తీరం వెంబడి సరదాగా కూర్చునేందుకు చదునైన చోటూ లేదు. తెల్లని ఇసుకంతా నల్లని బొగ్గుపొడిలా దర్శనమిస్తోంది. ఎగుడు దిగుడు గట్లను తలపిస్తోంది. ఆవేశంతో వస్తున్న కెరటాలు ముందుకెళ్లడం మా వల్లకాదంటూ వెనక్కి తగ్గుతున్నాయి. హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు మునుపటి విశాఖ సాగరతీరం అందాలు చెల్లాచెదురయ్యాయి. నిత్యం వేలాదిమందికి ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో ఇప్పుడు వేల టన్నుల ఇసుక కోతకు గురైంది. మరికొన్ని చోట్ల భారీగా ఇసుక మేటలు వేసింది. మళ్లీ అక్కడ పూర్వ స్థితి రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి!

 

సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖ తీరం అతలాకుతమైంది. ఎగసిపడ్డ అలలు బీచ్‌రోడ్డును సైతం తాకడంతో సహజసిద్ధంగా పరచుకున్న ఇసుక రూపురేఖల్ని మార్చేసింది. ప్రధానంగా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాల్లో భారీగా ఇసుక కోరుకుపోయింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) విభాగం అంచనాల ప్రకారం ఐదు వేల టన్నుల ఇసుక కోతకు గురై మాయమైంది. మరోవైపు రుషికొండ, ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. దీంతో అక్కడా సహజ సౌందర్యానికి గండి పడింది.



కోతకు గురైన ఇసుకలో కొంత ఆయా చోట్ల మేటలు వేసినట్టు, చాలావరకు సముద్రంలోకి లాక్కుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చెన్నై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది. వీరు బీచ్ నుంచి సముద్రంలోకి బోటులో వెళ్లి ఎక్కడెంత ఇసుక పేరుకుపోయిందో, ఎక్కడ నుంచి వెళ్లిందో అధ్యయనం చేస్తారు. భారీగా ఇసుక మాయమవ్వడంతో తిరిగి దానంతట అది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విశాఖ సాగరతీరంలో ఇదివరకటిలా సహజ సుందరమైన ఇసుక తిన్నెలు ఏర్పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఇసుకను తెచ్చి కోతకు గురైన చోట ఫిల్లింగ్ చేయడమే సరైన మార్గంగా భావిస్తున్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ల సాయంతో ఆ పనిని పూర్తి చేయనున్నట్టు తెలిసింది.

 

బీచ్‌లో తగ్గిన సందడి

హుద్‌హుద్ బీభత్సం అనంతరం రూపుమారిన బీచ్‌లో హాయిగా పిల్లాపాపలతో గడపడానికి వీలు లేకుండా పోయింది. దీంతో గతంకంటే సంద ర్శకుల తాకిడి తగ్గింది. విశాఖవాసులు గాని, ఇక్కడకు వచ్చే పర్యాటకులు గాని, సందర్శకులు గాని ఆర్కేబీచ్, కురుసుర మ్యూజియంలు చూడకుండా వెళ్లరు. విశాఖ బ్రాండ్ ఇమేజిని పెంచిన వాటిలో వీటిదే అగ్రస్థానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడకు వెళ్లేందుకు వీరు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇదివరకటిలా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడేందుకు... ఇసుక ఫిల్లింగ్‌ను వేగవంతం చేసి, మునుపటి రూపురేఖలు సంతరించుకునేలా చేయాలన్న యోచనలో అధికారులున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top