2019లో జగన్‌ ముఖ్యమంత్రి : బంగారి

ఆక్రమణలపై అఖిల పక్షం కన్నెర్ర - Sakshi


విశాఖపట్నం : భూ నేరగాళ్ల అసలు మజిలీలా మారిన విశాఖపట్నాన్ని కాపాడేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మహాధర్నాలో అఖిల పక్షం నినదించింది. వైఎస్‌ఆర్‌ సీపీ నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు గురువారం మహాధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కబ్జాకోరుల బారి నుంచి భూబాధితులను కాపాడేందుకు వైఎస్‌ జగన్‌తో కలిసి పోరాటం సాగిస్తామని తెలిపారు.


భవిష్యత్తులో జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పగా.. అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబు సహా.. టీడీపీ నేతలంతా జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా కబ్జాదారుల పరం కాకుండా పోరాటం సాగిస్తామని సేవ్‌ విశాఖ వేదిక సాక్షిగా స్పష్టం చేశారు.



చంద్రబాబే ప్రథమ ముద్దాయి : గుడివాడ అమర్‌నాథ్ (వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు)

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో ఉన్న పేద రైతుల భూములతో పాటు ప్రభుత్వ, అసైన్డ్, దేవుడి భూములు ఇలా కన్ను పడిన ప్రతి భూమిని కూడా ఆక్రమించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మూడేళ్లుగా టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలు పెరిగిపోయాయి. పేద రైతాంగానికి చెందిన భూములు, దేవుడు మాన్యాల్ని, చెట్టుని, పుట్టని గట్టుని మాయం చేసేస్తున్నారు. లక్ష ఎకరాల భూ కుంభకోణంలో సీఎం చంద్రబాబు ప్రథమ ముద్దాయిగా మారారు. సీఎంతో పాటు ప్రభుత్వంలో ఉన్న వారంతా కుమ్మక్కై భూ దోపిడీకి పాల్పడ్డారు. ప్రజలకు అండగా వైఎస్సార్‌ సీపీ నిలబడి పోరాడుతుంది. మహాధర్నాకు పోటీగా మహాసంకల్పం చేస్తామని టీడీపీ ప్రకటించింది. అది మహా సంకల్పం కాదు.. మహా సంకల్ప దీక్ష. చంద్రబాబు నుంచి టిడీపీ కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి.



భూ కబ్జాదారుల్ని బేడీలేసి నడిపించాలి : సీహెచ్‌ నరసింగరావు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు)

రాష్ట్రంలో ఇదో ప్రధాన సమస్యగా మారింది. హెల్త్‌ హబ్, ఎడ్యుకేషన్‌ హబ్, ఐటీ హబ్‌గా విశాఖను మారుస్తానని ప్రతిసారీ చెప్పిన చంద్రబాబు.. చివరికి భూకబ్జాల హబ్‌గా మార్చేశారు. కాపాడాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలే భూ కబ్జాలకు పాల్పడుతుంటే.. ప్రజలకు అండగా నిలబడాల్సిన సీఎం సిట్‌ వేసి చేతులు దులిపేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


మిర్చి రైతులు ధర అడిగితే బేడీలు వేసుకొని తీసుకెళ్లారు. మరి ప్రభుత్వ, పేదల భూమలు దోచుకుంటున్న వారిని ఏం చెయ్యాలి. ఈ భూకబ్జాదారులందర్నీ బేడీలేసి నడిపించుకుంటూ తీసుకెళ్లాలి. ప్రజలు ఇంతలా ఉద్యమిస్తుంటే.. స్థానిక ఎంపీ నోరుమెదపకపోవడం గర్హనీయం. దీనిపై జగన్‌ నేతృత్వంలో ప్రజా ఉద్యమం నిర్మించాలి. అఖిలపక్షమంతా కలిసి పోరాడితేనే.. ప్రజలకు న్యాయం జరుగుతుంది.



రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేనట్లుంది : స్టాలిన్ (సీపీఐ జిల్లా కార్యదర్శి)

వందల ఎకరాల భూముల్ని అధికారం అడ్డం పెట్టుకొని వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాజేశారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌తో ధర్నా నిర్వహించిన వైఎస్‌ జగన్‌కు అభినందనలు. మూడేళ్ల నుంచి విశాఖలో ఏరకమైన రక్షణ భూములకు లేదు. కొమ్మాది, భీమిలి, మధురవాడలో ఎక్కడా ప్రభుత్వ భూమిని వదల్లేదు.


రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసిన టీడీపీ రాష్ట్ర మాజీ సైనికోద్యోగ సంఘ అధ్యక్షుడు ఎం.రామకృష్ణ జైలుకి వెళ్లాడు. వేల కోట్ల రూపాయల విలువైన దసపల్లా భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లినా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదు. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన జరుగుతుందా లేదా అన్నది అర్థం కావడం లేదు. కబ్జా కాండలో దోషులు సిట్‌ ద్వారా వెలుగులోకిరారు కాబట్టి సీబీఐ విచారణ చేపట్టాలని సీపీఐ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం.



భూములు ఆక్రమించిన వారికి పుట్టగతులుండవ్‌ : కరణం ధర్మశ్రీ, (చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే)

విశాఖలో జరుగుతున్న భూ దందాలో సీఎంకు చందాలు వెళ్తున్నాయి. చాపకింద నీరులా.. రికార్డులు ట్యాంపరింగ్‌ చేస్తూ.. భూములు దోచుకుంటున్నారు. ఒక మంత్రికి హామీ.. మరో మంత్రికి లేమి. వారిద్దరి మధ్య వచ్చింది సునామీ. ఈ సునామీలో పేదల భూములు గల్లంతయ్యాయి. కానీ ఈ పనంతా చేసింది టీడీపీ మంత్రులే. ముదపాక, అచ్యుతాపురం, కొమ్మాది, మధురవాడ.. భూములు ఎక్కడ ఉంటే అక్కడ స్కాములు జరుగుతున్నాయి. టీడీపీ నేతల అక్రమాల వెన్ను విరిచే కార్యక్రమానికి మహ«ధర్నా శ్రీకారం చుట్టాం. పేదల భూముల్ని ఆక్రమించిన వారికి పుట్టగతులుండవు.

టీడీపీ నేతలు ఊచలు లెక్కపెడతారు.



2019లో జగన్‌ ముఖ్యమంత్రి : బంగారి (బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు)

చంద్రబాబుకి ఏ జిల్లా ప్రజలు ఇవ్వని మెజారిటీని విశాఖ పట్నం కట్టబెడితే.. చంద్రబాబు మాత్రం తన అవినీతి మార్కుని చూపిస్తున్నారు. విశాఖను టీడీపీ విలాసాలకు వాడుకుంటోంది. రైతులు, ప్రభుత్వం, మాజీ సైనికులు తేడా లేకుండా.. భూమలు దోచుకుంటున్నారు. ఇలాంటి నీతిమాలిన కార్యక్రమాలు ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ జగన్‌తో పోరాడతాం. 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబుకి ప్రజల ఉసురు తగులుతుంది.



అలుసిస్తే ఇంటిని కూడా లాక్కుంటారు : అన్నంరెడ్డి అదీప్‌రాజు (పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త)

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీ జాగా కనిపిస్తే చాలు దాన్ని ఎలా కబ్జా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ భూ కబ్జాల నుంచి విశాఖను కాపాడేందుకు వైఎస్సార్‌ సీపీ పోరాటం సాగిస్తుంది. పెందుర్తి నియోజకవర్గంలో ముదపాక భూముల్ని ఎలా దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారో.. రాష్ట్రమంతటా తెలుసు. కానీ.. సదరు టీడీపీ నేతలు మాత్రం కర్జా కాండ కొనసాగిస్తున్నారు. ఇలా కొనసాగితే.. మన ఇంటిని కూడా లాక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే.. లక్షల ఎకరాలను దోచుకున్న టీడీపీకి బుద్ధి చెబుదాం. భూ దందాలకు అడ్డు చెప్పేందుకు ఏకతాటిపై ఉద్యమిద్దాం.ప్రభుత్వం బారినుంచి భూముల్ని కాపాడుదాం



బాబు హయాంలో భూదందాలు : బొడ్డేటి ప్రసాదరావు (యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త)

వైఎస్సార్‌ పాలనలో విశాఖపట్నం ఎలా ఉంది.. చంద్రబాబు పాలనలో జిల్లా ఎలా భ్రష్టుపట్టిందో ప్రజలంతా గమనిస్తున్నారు. భూదందాలు సాగిస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ మూకుమ్మడిగా భూబకాసురుల అవతారమెత్తి దోచుకుతింటున్నారు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారు. అందుకే.. విశాఖ జిల్లాను కాపాడేందుకు నడుంబిగిద్దాం.



దోచుకోడానికే అధికారం : గొల్ల బాబూరావు (మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి)

విశాఖలో గజం స్థలం కూడా పేదల పేరున ఉండకుండా చేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల ఈ దోపిడికి పాల్పడుతున్నారు. నారా లోకేష్‌ నాయకత్వంలోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. అందరూ దోచుకుతినండంటూ అధికారాలు జారీ చేసినట్లు సాగుతోంది ఈ భూదందా. ఎవ్వర్నీ ఉపేక్షించం. అధికారం లోకి వచ్చిన వెంటనే.. తిన్నదంతా కక్కిస్తాం.. జైలు ఊచలు లెక్కెట్టిస్తాం.



వైఎస్సార్‌లా జగన్‌ పోరాడాలి : బీశెట్టి బాబ్జి (లోక్‌ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు)

విశాఖ పట్నంలో జరిగిన అవినీతిపై ఇంత పెద్ద రంకె వేస్తుంటే.. చంద్రబాబుకి వినిపించడం లేదా.? మహానాడులో ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటూ చంద్రబాబు ఏ సబ్జెక్టుపైనైనా అనర్గళంగా మాట్లాడతారని అంటే.. మరో ఆటో డ్రైవర్‌ మా ఆవిడ సబ్జెక్ట్‌ లేకపోయినా.. ఏకధాటిగా మాట్లాడగలదు అని అన్నారు. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంది. నిజంగా మనస్సాక్షి ఉంటే.. జరుగుతున్న అక్రమాల్లో చంద్రబాబు, మంత్రుల హస్తం లేదని కనకమహాలక్ష్మి సాక్షిగా ప్రమాణం చెయ్యాలి.


టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు పూర్తిగా నష్టపోయాడు. ఆముదాలవలస, తుమ్మపాల చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. మార్కెట్‌లో పరిస్థితి సైతం బాలేదు. రాష్ట్రం కబ్జాదారులు, కుంభకోణాలతో అట్టుడికిపోతోంది. దీనికి ప్రధాన కారణమైన టీడీపీ ప్రభుత్వంపై అఖిలపక్షం పోరాడుతుంది. మడమతిప్పని నాయకుడు వైఎస్సార్‌. ఆయనలా మడం తిప్పకుండా జగన్‌ పోరాటం సాగించాలి.



జైలుకెళ్లక తప్పదు : మళ్ల విజయప్రసాద్ (వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త)

లక్షల ఎకరాల భూముల్ని దోచుకున్నారు. అధికారులతో కుమ్మక్కై.. మంత్రులు, ఎమ్మెల్యేలు దందాలకు పాల్పడుతున్నారు. సిగ్గూ ఎగ్గూ లేకుండా.. నిరుపేద భూముల్ని సైతం లాక్కుంటూ రోడ్డున పడేస్తున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే నిరుపేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దొంగలు, దోపిడీదారులంతా జైలుకి వెళ్లి ఊచలు లెక్కపెట్టుకునే రోజులు మరెంతో దూరంలో లేవు.



బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి : కోలా గురువులు (వైజాగ్‌ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త)

విశాఖలో జరుగుతున్న భూదందాలో ప్రతి ఎమ్మెల్యే, మంత్రులతో పాటు పసుపు చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరి హస్తం ఉంది. 21వ వార్డులో పార్కు పేరుతో ఉన్న భూమిని తన బినామీకి కట్టబెట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి చేసిన ఘనకార్యాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సైకోలా ప్రవర్తిస్తున్న వాసుపల్లి వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదే తరహాలో ప్రతి ఒక్క టీడీపీ నేత దందాలు సాగిస్తున్నాను. త్వరలోనే వీరందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. రానున్నది జగనన్న పాలన.



సిట్‌ తో సాక్ష్యాలకు చెల్లు చీటీ : తైనాల విజయ్‌కుమార్ (వైస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్‌)

ప్రభుత్వాన్ని కదిలించేలా ధర్నా జరిగింది. హామీలు నెరవేర్చకుండా, ఓటుకు నోటు కేసుకోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే సాధ్యం. లక్ష ఎకరాల భూమి కబ్జా అయ్యిందంటూ స్వయానా కలెక్టర్‌ వెల్లడించినా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటి. మళ్లీ.. కొద్ది రోజులు పోయాక అదే కలెక్టర్‌ 270 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురయ్యాయని చెప్పడం చూస్తుంటే.. సిట్‌ వేసినా ఫలితం లేదని స్పష్టమవుతోంది. గోదావరి పుష్కరాల్లో 29 మంది ఎందుకు చనిపోయారో ఇంతవరకు చెప్పలేకపోయిన సిట్‌.. ఈలక్షల ఎకరాల్లో దోషులుగా ఉన్న టీడీపీ నేతల గురించి ఇంకే బయటపెడుతుంది.



చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు : తిప్పల నాగిరెడ్డి (గాజువాక నియోజకవర్గ సమన్వయ కర్త)

భూముల్ని కాపాడుకోకపోతే.. మనం తలదాచుకుంటున్న ఇంటిని కూడా ఆక్రమించేసి రోడ్డున పడేసే ఘనులు టీడీపీలో ఉన్నారు. మూడేళ్లుగా ఇదే పనిలో నిమగ్నమయ్యారే తప్ప పాలన విషయంలో మాత్రం అడుగు కూడా వెయ్యిలేకపోయారు. దోచుకోవడం దాచుకోవడమే పని అయ్యింది. కోట్లాది రూపాయలు దోచుకొని ఓటుకి 5 వేలు ఇచ్చి నోరూ వాయిలేని లోకేష్‌ని సీఎంగా చెయ్యాలని చూస్తున్నారు. నేను తింటున్నాను.. మీరు కూడా తినండంటూ చంద్రబాబు అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది.



కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం : వంశీకృష్ణ శ్రీనివాస్ (తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త)

ఎన్నికల ముందు రాబందుల రాజ్యమా.. ప్రశాంత వాతావరణమా అంటూ టిడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వారే భూరాంబదుల్లా మారి విశాఖను ప్రశాంతవాతావరణానికి దూరం చేసేశారు. మూడేళ్ల నుంచీ అదే పనిలో సిద్ధహస్తులుగా మారిపోయారు. చంద్రబాబు, లోకేష్‌ సహా.. అందరూ ఇందులో పాత్రధారులే. లోకేష్‌ని సీఎం ను చేసేందుకు విశాఖను దోచుకుతింటున్నారు. ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా చేస్తున్న వారంతా జైలుకు వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు. అందరం నడుం బిగించి.. కబ్జాదారుల్ని తరిమి తరిమి కొడదాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top