కబ్జాదారుల భరతం పడదాం

కబ్జాదారుల  భరతం పడదాం - Sakshi


పేదలపై రౌడీయుజం చెలాయిస్తే సహించబోం

టీడీపీ పాలనలో పది మంది నవ్వుతుంటే... వంద మంది ఏడుస్తున్నారు

ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తా

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా నియోజకవర్గంలో పర్యటన


 

పలనాడు పౌరుషాల అడ్డా.. మాచర్ల గడ్డ. అలనాటి బ్రహ్మనాయుడి కాలం నుంచి నేటి వరకు ఇక్కడ పగలు, సెగలే రాజ్యమేలుతుంటాయి. అందుకే ఆ చెన్నకేశవుడి సాక్షిగా బోలెడు సమస్యలిక్కడ తిష్ట వేశాయి. దాపులనే సాగర్ ఉన్నా దక్కని సాగునీరు.. కోరలు చాస్తున్న కబ్జాదారులు.. అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు ప్రగతి నిరోధకాలుగా మారాయి. ఇంతటి వెనుకబాటుకు గురైన మాచర్లను ప్రగతి పథంలో  పరుగులు పెట్టించాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాక్షి వీఐపీ రిపోర్టరుగా మారారు. శనివారం నియోజకవర్గంలోని మాచర్ల పట్టణం, సమీప ప్రాంతాలకు వెళ్లి ప్రజల ఇబ్బందులేమిటో స్వయంగా అడిగి  తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారుల అండతో పేదల గుడిసెలు కూల్చిన కబ్జాదారుల భరతం పడతానని బాధితులకు భరోసా ఇచ్చారు.  

 

జిల్లాలో రాజకీయంగా చైతన్యవంతమైనప్పటికీ అభివృద్ధి పరంగా నేటికీ వెనకబడి ఉన్న ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మాచర్ల వాసులంతా తమకు మంచిరోజులొచ్చాయని సంతోషించారు. ఆయన అకాల మరణం తర్వాత ఇక్కడి ప్రగతి మళ్లీ కుంటుపడింది. ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం తన నియోజకవర్గంలో పర్యటించి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నారు.

 

మాచర్ల రోప్‌వే కాలనీ...

 ఎమ్మెల్యే :  ఏమ్మా నీ పేరేమిటి? ఏం చేస్తుంటావ్..!

 సునీత:  నా పేరు సునీత సార్.. నేను మా ఆయన కూలి పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నాం.

 ఎమ్మెల్యే : నీ జీవనం బాగానే ఉందా?

 సునీత : ఏం బాగు సారూ... అన్నీ సమస్యలే. ఎన్ని సమస్యలున్నా ఒక గూడు ఉంటే తినో తినకో అందులో కాళ్ళు ముడుచుకోవచ్చని ప్రభుత్వ ఖాళీ స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నాం సార్. ఓర్వలేనోళ్లు అది కూడా కూల్చేసి ఆ జాగా దర్జాగా కబ్జా చేసేసారు.

 సత్యవతి : మా వద్ద అన్యాయంగా స్థలం లాక్కుని వేరే వారికి అప్పనంగా అమ్ముకుంటున్నారు సార్.

 కృష్ణవేణి : కట్టిన ఇళ్లను కూడా నిర్దయగా కూల్చేస్తే మాబోటివాళ్లం ఇంకెక్కడ తలదాచుకోవాలి సార్?

 ఎమ్మెల్యే :  జనారణ్యంలో ఇంత అన్యాయం జరుగుతున్నా మీరెలా చూస్తూ ఊరుకున్నారు? ఇంత మంది ఉన్నారు కదా అడ్డుకోలేకపోయారా? అసలు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు?

 కృష్ణవేణి : యాభై అరవై మంది కలసి వచ్చి మూకుమ్మడిగా దౌర్జన్యం చేస్తుంటే మేమేం చేయగలం సారూ. అధికారులను కలిశాం. కనీసం స్పందించ లేదు.

 సంతోషరావు : ఊహ తెలిసిన నాటి నుంచి 250 కుటుంబాల వరకు ఇదే రోప్‌లైన్ కాలనీలో జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు గొట్టిపాళ్ళ నుంచి కొందరొచ్చి మాైపై దౌర్జన్యం చేస్తున్నారు. ఒక మహిళ గూండాలను వెంటేసుకుని తిరుగుతూ మమ్మల్ని ఇళ్ల నుంచి తరిమేసింది. ఎమ్మార్వోకి చెబితే హేళనగా మాట్లాడుతున్నారు. వారి దౌర్జన్యాన్ని అడ్డుకునే వారే లేరా?  

 ఎమ్మెల్యే : ఆందోళన చెందకండి. అలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు. ఎక్కడి వాళ్ళో వచ్చి స్థానికులను తన్ని తరిమేస్తుంటే చూస్తూ కూర్చోం. అధికారుల అండతో రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజల అండతో వారి కోరలు పీకేస్తాం. ఈ విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాను. మాచర్లలో భూ కబ్జాదారుల భరతం పడతాను.

 ఎమ్మెల్యే : ఇక్కడ యార్డు ఉంటే సౌకర్యంగా ఉంటుందా?

 మోహన్‌రెడ్డి : ఆసియాలోనే అతి పెద్దదని చెప్పుకునే గుంటూరు మిర్చియార్డుకు మా ప్రాంతం నుండే అధికంగా మిర్చి వెళుతుంది సార్.  మిర్చిని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక్కడ యార్డ ఏర్పాటు చేస్తేనే మా జీవనం మెరుగవుతుంది.

 ఎమ్మెల్యే : గుంటూరు వెళ్లడానికి ఇబ్బందులేమిటి?

 మోహన్‌రెడ్డి : లారీ మిర్చికి రూ. 35వేల వరకు నష్టం వస్తుంది సార్. అదే యార్డు ఇక్కడే ఉంటే అదంతా మాకు మిగులే కదా? ఇక సరైన భోజనం, వసతి లేక మా పాట్లు అన్నీ ఇన్నీ కావు.

 ఎమ్మెల్యే :  ఎమ్.పి.గారు ఇక్కడే యార్డు పెడతామని చెబుతున్నారు కదా?

 కొప్పుల జానయ్య : అవన్నీ ఎన్నికల వాగ్దానాలే సార్.

 కొత్తపల్లిలో అనుపు-కొప్పునూరు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద..

 ఎమ్మెల్యే :  మీరు ఇక్కడి రైతులేనా?

  పోతిరెడ్డి కోటిరెడ్డి : అవునండీ.

 ఎమ్మెల్యే :  ఇదేమిటి, దీన్ని సగం తవ్వి వదిలేశారు?

 కోటిరెడ్డి :  వైఎస్సార్ హయాంలో చింతల తండా వద్ద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పధకానికి శంకుస్థాఫన జరిగింది సార్. అప్పటి నుండి తొలుత పనులు వేగంగానే జరిగినప్పటికీ ఆయన మరణానంతరం మందగించాయి. ఇప్పుడిక పూర్తిగా నిలిచిపోయాయి.

 ఎమ్మెల్యే :  (అక్కడే ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ కన్వీనర్‌తో..)  ఏమంటారు సుధాకర్‌రెడ్డిగారు?

 సుధాకర్‌రెడ్డి : దాదాపు 90శాతం పని పూర్తయింది సార్. ఇక జాక్‌వెల్ పాయింట్ దగ్గర 200మీటర్ల పని మాత్రం మిగిలి ఉంది. అయితే దీనికి అటవీ అనుమతులు లేవన్న కారణంగా పని ఆగిపోయింది.

 మాచర్ల పట్టణంలోని 7, 8 వార్డుల్లోని మురికివాడల్లో..

 ఎమ్మెల్యే :  ఏమ్మా పింఛను సరిగా వస్తుందా?

 చల్లా పిచ్చమ్మ, జ్ఞానసుందరి : వైఎస్ ఉన్నప్పుడు వచ్చేదయ్యా. ఇప్పుడు రావడం లేదు.

 మంగమ్మ : వైఎస్సార్ హయాంలో మూగవాడైనా నా బాబుకు వికలాంగ పింఛను దక్కింది సార్. చంద్రబాబు వచ్చిన తర్వాత రూ.1500కు   పెరిగిందన్నారు కానీ మాకు ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇచ్చిన పాపాన పోలేదు.

 ఎమ్మెల్యే :  చూడండమ్మా. మీలాగే మాచర్ల పట్టణంలోని చాలా మంది అర్హులకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు నిలిచిపోయాయి. మీరేమీ ఆందోళన చెందకండి. మీరు మళ్లీ దరఖాస్తు చేయండి. ఈ సారి ఫించన్లు ఎందుకు రావో నేను చూస్తాను. పూడిక తీయని కాల్వలు, అధ్వానంగా ఉన్న రోడ్లు  ఇలా మీ సమస్యల్ని స్వయంగా పరిశీలించాను. మరోసారి ఎమ్మెల్యేగా కమిషనర్‌ను ఇతర అధికారులను వెంటబెట్టుకుని వచ్చి  పరిష్కారమయ్యేలా నూటికి నూరు శాతం కృషి చేస్తాను.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top