గ్రామాల్లో ఆస్తి పన్ను వడ్డనకు రంగం సిద్ధం

గ్రామాల్లో ఆస్తి పన్ను వడ్డనకు రంగం సిద్ధం


 చింతలపూడి : జిల్లాలో ఆస్తి పన్ను బాదుడుకు రంగం సిద్ధమైంది. సుమారు 80 శాతం మేర  పన్ను పెరగనుంది. మరో 15 రోజుల్లో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టినట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ చెప్పారు. బుధవారం చింతలపూడి ఎంపీడీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆస్తి పన్ను పెంపుకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆస్తి పన్ను ద్వారా జిల్లాలో పంచాయతీలకు రూ.60 కోట్ల ఆదాయం వస్తోందని, ప్రస్తుతం పన్ను పెంపు ద్వారా మరో రూ.40 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. దీంతో జిల్లాలో పంచాయతీల ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంటుందన్నారు.

 

 ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ధరల ప్రకారమే ఆస్తి పన్ను నిర్ధారణ చేస్తామన్నారు. వాణిజ్య భవనాలకు నూటికి 50 పైసలు, వాణిజ్యేతర భవనాలకు నూటికి 25 పైసలు చొప్పున పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీలు తీర్మానాలు చేశాయన్నారు. అలాగే పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ భార ంగా ఉందని, దీనిని అధిగమించేందుకు అన్ని పంచాయతీల్లో సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బులను వీధిలైట్లకు వినియోగించాలని ఆదేశాలిచ్చామన్నారు. దీని వల్ల పంచాయతీల్లో విద్యుత్ ఆదా అవుతుందన్నారు. గ్రామ పంచాయతీల్లో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులకే అనుమతి ఉంటుందని, ఆపైన కావాలంటే టౌన్ ప్లానింగ్ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.

 

 అనుమతులు లేకుండ జి+2కి మించి నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లకు విద్యుత్ సర్వీసులు ఇవ్వొద్దని విద్యుత్ శాఖాధికారులకు సూచించామన్నారు. అటువంటి అనుమతులు లేని కట్టడాలు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సెల్లార్‌లో ఎటువంటి షాపులు, కట్టడాలు ఉండకూడదన్నారు. జిల్లాలో 200 పంచాయతీలకు సొంత భవనాలు లేవన్నారు. ఇటీవలే 158 పంచాయతీలకు భవన నిర్మాణాలు మంజూరు అయ్యాయని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభిస్తామని వివరించారు. సమావేశంలో ఎంపీపీ దాసరి రామక్క, ఎంపీడీవో పరదేశికుమార్ పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top