పల్లె గొంతు తడారింది!

పల్లె గొంతు తడారింది!


 తడారిన సీమ... వర్షం కురిస్తే పెనంపై పడిన చినుకుల్లా జాడ కనపడని స్థితి. పాతాళగంగ జాడ రోజురోజుకూ లోలోపలికి చేరుతోంది. మంచినీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. ఫ్లోరైడ్ కోరల్లోని గ్రామాలు ఎన్నేళ్లయినా అలాగే ఉన్నాయి. మంచినీరు కాదుకదా ఉప్పునీరు కూడా లభించని గ్రామాలు నేటికీ కనిపిస్తున్నాయి.  ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడంలో అధికారులు,ప్రజాప్రతినిధులు నిర్లిప్తతగా ఉన్నారు. పర్యవసానంగా

 నీటిసమస్య జిల్లాను వెంటాడుతోంది.

 

 సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని 50 మండలాల్లో 4,453 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు నీటిని అందించేందుకు 13,016 చేతిపంపులు, 3,984 పీడబ్ల్యూసీ (బోరునుంచి సరఫరా చేసే నీరు) 14 సీడబ్ల్యూసీ పథకాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే 11,743 చేతిబోర్లు పూర్తిగా పని చేయడం లేదు. తక్కిన పథకాల ద్వారా అరకొర మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 138 గ్రామాల్లో తాగునీరు సరఫరా జటిలంగా మారిందని అధికారుల రికార్డులు వివరిస్తున్నాయి.

 

 తగ్గుతున్న సరఫరా:

 గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి రోజుకు 40 లీటర్లకు తక్కువ లేకుండా నీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి. మన జిల్లాలో కేవలం 1431 గ్రామాల్లో మాత్రమే ఈ లెక్కన నీటిని అందిస్తున్నట్లు సర్కారు గణాంకాలు చెబుతున్నాయి. తక్కిన గ్రామాల్లో 40 లీటర్ల కంటే తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు. పైగా ఈ నీరు కూడా రోజుమార్చి రోజు, రెండు, మూడు రోజులకోసారి అందిస్తున్నారు. దీంతో మంచినీటి కోసం వ్యవసాయమోటర్లను ఆశ్రయించేవారే నేటికీ అధికంగానే ఉన్నారు.

 

 ఫ్లో ‘రైడ్’ తో విలవిల:

 జిల్లాలో 47 గ్రామాలు ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్నాయి. వీరబల్లి, రామాపురం, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు ప్రాంతాల్లోని గ్రామాలు ఫ్లోరైడ్ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇలాంటి నీటిని తాగిన వారు రోగాలబారిన పడుతున్నారు. దంతాలు పచ్చగా మారడం, కీళ్లనొప్పులు, కాళ్లు వంకర, చిన్నవయస్సులోనే పెద్దవయస్సు ఉన్నవారిలా కనిపించడం, కడపులో గడ్డలు...ఇలా అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో తాగునీటితో పాటు ఇంటి అవసరాలకు ఉపయోగపడే నీటిని కూడా డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రాయచోటి పట్టణంలో పది రూపాయలకు 4-5 బిందెలు(ప్రాంతాన్ని బట్టి) విక్రయిస్తున్నారు. ఇలా నెలకు 70-80 లక్షల రూపాయలు ఇలా నీటి కోసం ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది. వీటితో పాటు ఎర్రగుంట్ల, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు కూడా ఫ్లోరైడ్ బారిన పడ్డాయి. నీటి సమస్యకు తోడు భూర్భజలాలు కూడా ముప్పు తెచ్చిపెడుతున్నాయి. గతేడాదితో పోల్చితే 2.97 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. ప్రస్తుత నీటి మట్టం 15.78 మీటర్ల లోతులో ఉంది. దీంతో చేతిబోర్లు కూడా మొండి గా దర్శనమిస్తాయి. బోరు బావులు కూడా కనుమరుగవుతున్నాయి. మోటర్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి.

 

 మినరల్ వాటరే దిక్కు:

 పట్టణాలతో పాటు చాలాపల్లెల్లో తాగునీటికి మినరల్ వాటర్‌నే వినియోగస్తున్నారు. ఒక్కో క్యాన్‌కు 5-10 రూపాయల వరకూ చెల్లిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా అందే నీటిని తాగలేక మినరల్ వాటర్ కొనాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాసులుగా జోరుగా నడుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయని, ఈ కారణంగా నాణ్యత ప్రమాణాలు సైతం కొరవడుతున్నట్లు విమర్శలున్నాయి.

 

 అన్ని జాగ్రత్తలు

 తీసుకుంటాం

 తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 89 గ్రామాల్లో ట్రాన్సుపోర్టు ద్వారా నీటిని అందిస్తున్నాం. మరో 49 గ్రామాల్లో బోర్లను బాడుగకు తీసుకొని నీటి సరఫరా చేస్తున్నాం. వర్షాలు వస్తే భూగర్భజలాలు పెరుగుతాయనే ఆశాభావంతో ఉన్నాం. వాస్తవపరిస్థితుల ఆధారంగా నివేదికలను రూపొందించాం. ఆమేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నాం.

 బిఎన్ శ్రీనివాసులు

 ఎస్‌ఈ (ఎస్‌ఈ ఇన్‌ఛార్జి),

 ఆర్‌డబ్ల్యూఎస్.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top