సూపర్ ఫాస్ట్‌గా..

సూపర్ ఫాస్ట్‌గా..


విజయవాడ రైల్వేస్టేషన్  రాజధాని హంగులను సమకూర్చుకుంటోంది. రూ.4.5 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తికావస్తున్నాయి. క్లోక్‌రూమ్, ఏసీ వెయిటింగ్ హాళ్లను  విస్తరించనున్నారు. తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మూడు ప్లాట్‌ఫాంలపైనా మరిన్ని సౌకర్యాలు కల్పిచేందుకు రైల్వే  అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

 

 విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యూరుు. నవ్యాంధ్ర రాజధానిగా  తుళ్లూరును ప్రకటించిన నేపథ్యంలో మార్చి నాటికి పనులు పూర్తిచేసేందుకు చూస్తున్నారు. నవ్యాంధ్రలో విజయవాడ  రైల్వేస్టేషన్ కీలకం కావడంతో ఏడాది కిందటే అభివృద్ధి పనులు ప్రారంభించారు. ముఖ్యంగా స్టేషన్ ముందుభాగాన్ని అందంగా రాచనగరిని తలపించేలా తీర్చిదిద్దడంతో పాటు ప్రయాణికులకు ఉపయోగపడేలా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తిచేసిన తరువాత మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించే  అవకాశం ఉంది.

 

దాహార్తి తీర్చేందుకు రిజర్వాయర్లు

 

ఇటీవల కాలంలో రైల్వేస్టేషన్‌లో నీటి అవసరాలు బాగా పెరిగాయి. సకాలంలో నీరు అందుబాటులో లేకపోవడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో నీటిని నింపడం సాధ్యపడటం లేదు. రైల్వేస్టేషన్, పరిసరాల్లో ఉన్న రైల్వే క్వార్టర్స్, ఎలక్ట్రికల్ లోకోషెడ్ అన్నింటికీ కలిపి రోజుకు 1.25 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతోంది.  ఇప్పటికే 10 వరకు రిజర్వాయర్లు ఉండగా, తాజాగా తారాపేట వైపు  ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.  ఈ రెండు రిజర్వాయర్ల నీరు స్టేషన్‌కు ఉపయోగిస్తారు. దీంతో నీటి కొరత తీర్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

 రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు



 రైల్వేస్టేషన్‌లో ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా స్టేషన్ ముందు భాగాన్ని బాగా విస్తరిస్తున్నారు. గతంలో స్టేషన్ ముందు భాగం కేవలం 50 మీటర్లే ఉండేది. ఇప్పుడు దీన్ని మరో 150 మీటర్లు పెంచి 200 మీటర్ల పొడవనా రాజప్రాకారం తరహాలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రయూణికుల రద్దీ ఎక్కువగా ఉండే రెండో ప్రవేశ ద్వారం వద్ద అంతా కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి ప్లాట్‌ఫాంపైనే సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మిస్తున్నారు. సుమారు 250 మంది విశ్రమించేందుకు వీలుగా వెయిటింగ్ హాల్ నిర్మాణం జరుగుతోంది. ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపైనే 50 మంది కూర్చునేందుకు వీలుగా ఏసీ వెయిటింగ్ హాల్ ఉండేది. ఇటీవల ఏసీ బోగీల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరగటంతో ఈ హాల్ చాలడం లేదు. ఇప్పుడు ఉన్న ఏసీ హాలును వందమంది వేచి ఉండేలా విస్తరిస్తున్నారు. సామాన్లు భద్రపరుచుకునే గది                (క్లోక్‌రూమ్)కు కూడా అభివృద్ధి పరుస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.

 

 8, 9, 10 ప్లాట్‌ఫాంలపై ప్రత్యేక దృష్టి



 ప్రస్తుతం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై చేపట్టిన పనులు పూర్తికావస్తుండటంతో 8, 9, 10వ నంబరు ప్లాట్‌ఫాంలపై చేపట్టాల్సిన పనులపై అధికారులు దృష్టిసారించనున్నారు. ఈ మూడు ప్లాట్‌ఫాంలలో ప్రయాణికులకు అవసరమైన మేర వసతులు లేవు. ప్లాట్‌ఫాంల పొడవునా షెడ్లు లేకపోవడంతో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో మూడు ప్లాట్‌ఫాంలకు మూడు కోట్లతో షెడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top