తుళ్లూరుకూ మెట్రో!

తుళ్లూరుకూ మెట్రో! - Sakshi


* కొత్త రాజధానికి విజయవాడ మెట్రోను విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు

* రెండో దశలో దీన్ని అమలు చేయాలనే యోచనలో అధికారులు

* రాజధాని మాస్టర్ ప్లాన్ ఖరారయ్యాక మెట్రో విస్తరణపై స్పష్టత


 

 సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును రెండో దశలో నూతన రాజధాని తుళ్లూరు ప్రాంతానికి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో చేపట్టే రెండు కారిడార్లు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచే రాజధాని ప్రాంతానికి లింకు కలపాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులోభాగంగా బస్టాండ్ ప్రాంతం నుంచి తాడేపల్లి వరకూ కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించనున్నారు. అక్కడి నుంచి సీతానగరం కొండ చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించి తుళ్లూరు ప్రాంతానికి ఆ కారిడార్‌ను విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్ కంపెనీలు రాజధాని మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తున్న నేపథ్యంలో అది వచ్చిన తర్వాత ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చేపట్టిన తొలి దశ మెట్రో ప్రాజెక్టు సవివర నివేదికను మార్చి నాటికి పూర్తిచేసిన అనంతరం మాస్టర్‌ప్లాన్‌ను బట్టి రాజధాని మెట్రో సవివర నివేదిక తయారీని ప్రారంభించాలని యోచిస్తున్నారు.

 

 ఏలూరు రోడ్డు కారిడార్ పొడిగింపు

 విజయవాడ నగరంలోని తొలివిడతలో ప్రతిపాదించిన 13 కిలోమీటర్ల ఏలూరు రోడ్డు కారిడార్‌ను రెండో దశలో ఏడు కిలోమీటర్లు పెంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ విస్తరించనున్నారు. రెండో దశలో బెస్ట్‌ప్రైస్ షోరూమ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ దీన్ని విస్తరిస్తారు. మెట్రో రైలు ద్వారా విజయవాడను రాజధానికి అనుసంధానించినా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాలను కలుపుతూ రాజధాని ప్రాంతానికంతటికీ ఈ నెట్‌వర్క్ ఉపయోగపడేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 త్వరలో విజయవాడ మెట్రో స్టేషన్ల సర్వే

 విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు సంబంధిం చిన సవివర  నివేదికలో భాగంగా నిర్వహిస్తున్న టోపోగ్రాఫికల్ సర్వే దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో రెండు కారిడార్లలో నిర్మించే మెట్రో రైల్వే స్టేషన్ల టోపోగ్రఫీ సర్వేను ప్రారంభించడానికి ఈ పనులు చేపట్టిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన కన్సల్టెన్సీ ప్రతిపాదనలను పంపింది. మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ వీటికి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతి రాగానే సర్వే ప్రారంభించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో భూసార పరీక్షలను కూడా ప్రారంభించనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top