విజయవాడకు సీపీఎం కార్యాలయం


బరువెక్కిన హృదయాలు, భారంగా వీడ్కోలు



హైదరాబాద్: బరువెక్కిన హృదయాలు, ఆత్మీయ ఆలింగనాల మధ్య సీపీఎం ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, పార్టీ కార్యాలయం శుక్రవారం నూతన రాష్ట్ర రాజధాని విజయవాడకు తరలింది. రాష్ట్ర విభజనతో అన్ని పార్టీల కన్నా ముందే వేర్వేరు శాఖల్ని ఏర్పాటు చేసుకున్న సీపీఎం కార్యాలయ తరలింపులోనూ ముందే నిలిచింది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.



జాతీయోద్యమ సమయంలో విజయవాడ నుంచే కమ్యూనిస్టు ఉద్యమ కార్యక్రమాలు సాగేవి. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మద్దుకూరి చంద్రం వంటివారు అనేక పోరాటాలకు ఊపిరిలూదింది విజయవాడలోనే. ప్రస్తుత ఏపీ కార్యదర్శి పి.మధు, పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్మించిన మాకినేని బసవ పున్నయ్య భవన్ 1992 నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా మారింది. కార్యాలయం తరలింపు సందర్భంగా తెలంగాణ  నాయకత్వం ఆత్మీయ వీడ్కోలు సభను ఏర్పాటు చేసినప్పటికీ పార్టీ సీనియర్ నేత పర్సా సత్యనారాయణ మరణంతో దాన్ని సంతాప సభగా మార్చారు.  రాఘవులు, వై.వెంకటేశ్వరరావు, కృష్ణయ్య, వంగల సుబ్బారావు, జయరాంతో పాటు తెలంగాణ నేతలు తమ్మినేని వీరభద్రం,  తదితరులు పాల్గొన్నారు.

 

ఆ అనుబంధం తెగింది: మధు

అనివార్య కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాలేక పోయిన ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ తెలంగాణ, పాతబస్తీ, హైదరాబాద్ ప్రజలతో తన అనుబంధం తెగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి వారితో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందన్నారు. తన చేతులతో కట్టిన భవనాన్ని ఖాళీ చేసి వస్తున్నామన్న బాధ లేదని, అన్యాయంపై పోరాడే తమ సోదరుల ఉద్యమాలకు కేంద్రంగా భాసిల్లుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top