అధికారానికి అండగా..


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సాంకేతిక కారణాలతో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు ఊరట లభించింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన కారంచేడు, కొత్తపట్నం, కంభం జెడ్పీటీసీ సభ్యులను చిన్న సాంకేతిక అంశం వేటు నుంచి తప్పించింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసినా పార్టీ తరఫున అభ్యర్థి పోటీ చేయలేదు కాబట్టి విప్ చెల్లదన్న సభ్యుల వాదనను కలెక్టర్ విజయకుమార్ పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్‌లో ఇదే పద్ధతిలో వెళ్తే వేటు తప్పదని నెల్లూరు, చీరాల ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.



జూలై ఐదున జరిగిన జెడ్పీ తొలి సమావేశానికి వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని వచ్చారు. ఏ పార్టీకి కేటాయించిన ప్రాంతంలో వారు కూర్చోవాల్సి ఉండగా, దీనికి భిన్నంగా వారు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. కారంచేడు జెడ్పీటీసీ విప్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. దీనిపై అప్పుడే ప్రిసైడింగ్ అధికారికి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది. మళ్లీ 13న జరిగిన సమావేశంలో కూడా వారు తెలుగుదేశంకు కేటాయించిన చోటే కూర్చున్నారు. తర్వాత కలెక్టర్ గట్టిగా చెప్పడంతో వారు వారికి కేటాయించిన సీట్లలో కాకుండా వెనుక కుర్చీలు వేయించుకుని కూర్చున్నారు.



కో ఆప్షన్ సభ్యుల ఎంపిక విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఓటు వేశారు. ఆ తర్వాత కూడా పార్టీ మొత్తం ఒక నిర్ణయం తీసుకుని స్వతంత్ర అభ్యర్ధిని బలపరిస్తే ఈ ముగ్గురు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు. ఈ పరిణామాలన్నింటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వీటిని ప్రిసైడింగ్ అధికారి పరిగణనలోకి తీసుకోలే దు. అయితే జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరిగిన ప్రతి అంశంలోనూ అధికార పార్టీ ఒత్తిళ్లు అధికారులపై పనిచేశాయి.



జూలై ఐదో తేదీన జరగాల్సిన ఎన్నికను వాయిదా వేయడంలోనూ, 13వ తేదీ ఎన్నికకు కొన్ని గంటల ముందు మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు చేయడం వెనుక అధికార పార్టీ ముద్ర స్పష్టంగా కనపడింది. మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డిని జెడ్పీ ఎన్నికకు కొన్ని గంటల ముందు అరెస్టు చేయగానే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి ఎన్నికల కమిషనర్ నవీన్‌మిట్టల్ స్పందించి ఆదేశాలు జారీ చేశారు. సభ్యుడికి ఉన్న ఓటు హక్కును హరించడం సరికాదని, అతనిని ఓటింగ్‌కు అనుమతించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.



ఇంకా న్యాయమూర్తి ముందు హాజరుపరచనందున సభ్యుని ఓటు హక్కును నిరాకరించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే ఓటింగ్‌కు తీసుకువచ్చేందుకు అనుమతి తీసుకోవాలని, అప్పటికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనట్లయితే పోలీసు బందోబస్తు నడుమ ఓటింగ్‌కు తీసుకువచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని అప్పటి ఎస్పీకి, కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే రాజధాని నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆ సభ్యుడికి ఓటు వేసే అవకాశం లేకుండా చేశారు.



మధ్యాహ్నం  ఒంటిగంట వరకూ తర్జనభర్జన పడి అప్పుడు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. మూడు గంటలకు మార్కాపురం నుంచి తీసుకురావడం సాధ్యం కాదనే సాకు చూపించి ఎన్నికను జరిపించేశారు. చట్టపరంగా ఉన్న హక్కును హరించడమే కాకుండా ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా అధికారులు ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేశారన్న కారణంగా జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుపై వేటు పడింది. అయితే అసలు విప్ చెల్లదన్న అంశంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు స్థానిక నేతకు విప్ అధికారం కట్టబెడితే దాన్ని విప్‌గా వ్యవహరించే జెడ్పీటీసీ తమ పార్టీ సభ్యులకు ఇవ్వవలసి ఉంటుంది.



అయితే తెలుగుదేశంలో దీనికి భిన్నంగా జరిగింది. విప్‌ను పార్టీ అధ్యక్షుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఇస్తే ఆయన జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌కు, జనార్దన్ పార్టీ సభ్యునికి విప్ అధికారం ఇచ్చారు. ఈ విధంగా చేయడం చట్టరీత్యా చెల్లదు. అయితే అధికార పార్టీ నిర్ణయం కావడంతో అధికారులు కూడా ఏం మాట్లాడలేదు. దీనిపై కోర్టు తీర్పు దీపావళి తర్వాత వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఆధారంగా మళ్లీ జెడ్పీచైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో పార్టీ గీత దాటితే వేటు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పార్టీ మారిన జెడ్పీటీసీలు కూడా ప్రస్తుతానికి గట్టెక్కినా, తర్వాత ఏం చేయాలనే అంశంపై పునరాలోచనలో పడినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top