గూడెంలో విజిలెన్స్ దాడులు


తాడేపల్లిగూడెం : పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా అపరాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సుమారు 11 గంటలపాటు సాగిన ఈ దాడులలో నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. రికార్డులలో పేర్కొన్నదానికంటే సరుకులు ఎక్కువుగా ఉండటంతో సీజ్ చేశారు. రికార్డులకు , వాస్తవ స్టాకునకు అదనంగా ఉన్న సుమారు రూ.కోటి మూడు లక్షల విలువైన పప్పులు, నూనెలు స్వాధీనం చేసుకొన్నారు. దుకాణదారులపై నిత్యావసరాల చట్టంలోని 6ఏ ప్రకారం కేసు నమోదు చేశారు.

 

 విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ సురేష్‌బాబు ఆదేశాల మేరకు పట్టణంలో ఈ దాడులు గురువారం ఉదయం డీఎస్పీ కె.అనిల్‌కుమార్ పర్యవేక్షణలో మొదలయ్యాయి. తొలుత భీమవరం రోడ్డులోని వెంకటేశ్వర డిపార్డుమెంటల్ స్టోర్సులో సోదాలు సాగాయి. ఈ సంస్థకు సంబంధించి రెండో దుకాణంలో కొన్ని సరుకులు రికార్డులకు అనుగుణంగా ఉన్నాయి. పెసలు  వంటి వాటిలో వ్యత్యాసాలు ఉండటంతో సుమారు 23 లక్షల63 వేల 625  రూపాయల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్‌ఆర్ అండ్‌కో లో సోదాలు చేసి రెండు లక్షల 36 వేల , 547 రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు.

 

  మహాలక్ష్మి అండ్‌కోలో చేసిన సోదాలలో కందిపప్పు, శనగపప్పు, వేరుశనగ పప్పు, మినపగుళ్లు, పెసర పప్పులలో తేడాలు ఉండటంతో 42 లక్షల 10 వేల 620 రూపాయల సరుకును సీజ్ చేశారు. అప్పిరెడ్డి అండ్ కంపెనీలో  వ్యత్యాసాలు  ఉన్న నేపథ్యంలో 34 లక్షల రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. ఈ దాడులలో సీఐ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ శైలజ, ఏజీపీఓ .ఆర్.సత్యనారాయణరాజు, ఏఓ ఎం.శ్రీనివాసకుమార్‌లు పాల్గొన్నారు. మధ్యవర్తి రిపోర్టులను వీఆర్వోలు కృష్ణస్వామి, వినోద్‌లు రాశారు. రాత్రి 9.30 గంటల వరకు సోదాలు ముగిశాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top