‘పశ్చిమ’లో ప్రభవించారు

‘పశ్చిమ’లో ప్రభవించారు - Sakshi


 ఏది తూరుపు.. ఏది వెలుతురు.. ఎవరు బాపు.. పొద్దు పొడవగానే తూరుపు తెలుస్తుంది.. చీకటి పడగానే వెలుతురు తెలుస్తుంది.. మరి బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్లు తొక్కగానే.. గీతలు అందాలు దిద్దుకోగానే.. మాటలు బిడియం ఒలికించగానే.. రాతలు వినయం తొణికించగానే.. బుడుగు అల్లరి స్ఫురించగానే.. రాముని దయ స్మరణకు రాగానే.. బాపు తెలుస్తారు. ఆయన గీత, రాత తెలుగు సంస్కృతిలో భాగమైపోయాయి. బాపు బొమ్మ అందానికే నిలువెత్తు నిర్వచనంలా నిలిచింది. పశ్చిమ మెడలో పచ్చల హారంలా బాపు నిలిచిపోయారు.

 

 జిల్లాలోని నరసాపురంలో సత్తిరాజు వెంకట వేణుగోపాలరావు, సూర్యకాంతం దంపతులకు 1933 డిసెంబర్ 15న బాపు జన్మించారు. తండ్రి వెంకట వేణుగోపాలరావు మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తల్లి సూర్యకాంతమ్మ సోదరుడు నిడుమోలు వెంకటశివరావు నివాస ప్రాంతమైన నరసాపురంలో బాపు జన్మించారు.  తర్వాత మద్రాస్ వెళ్లిన బాపు తల్లిదండ్రులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అక్కడ బాంబింగ్ జరిగే ప్రమాదం ఉందని తెలుసుకుని 1937లో బాపును నరసాపురంలోని ఆయనను నరసాపురంలోని మేనమామ ఇంటికి పంపిం చారు. టేలర్ హైస్కూలో మూడేళ్లపాటు విద్యాభ్యాసం చేసిన బాపు తిరిగి మద్రాస్ వెళ్లారు. అక్కడే న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. మద్రాస్ హైకోర్టులో రెండేళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ సాహితీవేత్త ముళ్లపూడి రమణ పరిచయంతో సినీ రంగంలో అడుగుపెట్టారు.

 

 అసలు పేరు వెంకట లక్ష్మీనారాయణ

 బాపు అసలు పేరు వెంకట లక్ష్మీనారాయణ. జిల్లా నుంచి కుంచె, కలం పట్టుకుని జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా, దర్శకుడిగా తన ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై చాటి పశ్చిమ సిగలో పచ్చల హారమై మెరిశారు. తొలినాళ్లలో ఆంధ్రపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా పనిచేసిన బాపు అంచెలంచెలుగా ఎదిగారు.   

 

 బహుముఖ ప్రజ్ఞాశాలి

 బాపు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బొమ్మలే కాదు చేతి అక్షరాలు సైతం హొయలు ఒలకబోస్తాయి. బొమ్మలు గీయడంతోపాటు తెలుగు అక్షరాలను రాయడంలోనూ సరికొత్త శైలిని సృష్టించారు. ఇందుకు నిదర్శనమే బాపు ఫాంట్. దాదాపు అన్ని తెలుగు పత్రికలు బాపు చిత్రాలను ప్రచురించాయి.

 

 ‘సాక్షి’తో సినీ ప్రస్థానం


 1967లో ‘సాక్షి’ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా బాపు అడుగుపెట్టారు. ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, వంశవృక్షం, సుందరాకాండ, రాంబంటు, పెళ్లికొడుకు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామరాజ్యం చిత్రాలు ఆయనకు ఎనలేని పేరు తెచ్చిపెట్టాయి. చిరంజీవి నటించిన మనవూరి పాండవులు, మంత్రిగారి వియ్యంకుడు సినిమాలకు బాపు దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు నటించిన భక్తకన్నప్ప సినిమా దర్శకుడు కూడా బాపూనే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

 

 అవార్డులు.. మరెన్నో రివార్డులు


 బాపును వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో బాపును సత్కరించింది. రెండు నేషనల్ ఫిల్మ్, ఐదు నంది, రెండు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడి పురస్కారాలను బాపు అందుకున్నారు. 2012లో జీవన సాఫల్య పురస్కారం పొందారు.  

 

 మెప్పించే గీత .. నొప్పించని హేళన

 అందరినీ మెప్పించే గీత.. ఎవరిని నొప్పించని హేళన మేళవింపు బాపు. విశేష ప్రతిభాపాటవాలతో జిల్లాకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టిన బాపు లేరంటే నమ్మడం కొంచెం కష్టమే.  

 

 ప్రముఖుల నివాళి

 బాపు మృతికి జిల్లాలోని పలువురు నివాళుల ర్పించారు. వైఎస్సార్ సీపీ  జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని, టీడీపీ జిల్లా అధ్య క్షురాలు తోట సీతారామలక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, కళాకారులు గరికపాటి కాళిదాసు, గొర్తి మురళీకృష్ణ, నంది అవార్డు గ్రహీత ఖాజావలి, వైఎంహెచ్‌ఏ అధ్యక్షుడు వేణుగోపాల్ లునాని, రామకృష్ణ ఆర్ట్స్ ప్రతినిధి పెదపాటి రామకృష్ణ తదితరులు బాపు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

 

 నరసాపురంతో విడదీయరాని బంధం

 నరసాపురం (రాయపేట): తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కొంటె బొమ్మల బాపునకు నరసాపురంతో ఎనలేని అనుబంధం ఉంది. నరసాపురంలో తల్లి సూర్యకాంతమ్మ సోదరుడు నిడుమోలు వెంకటశివరావు ఇంట జన్మించిన బాపు బాల్యం ఇక్కడే గడిచింది. గోదావరి అందాలు, కోనసీమ సోయగాలను తనదైన శైలిలో తెరకెక్కించిన బాపు బాల్యంలో అక్షరాలు దిద్దింది నరసాపురం టేలర్ హైస్కూల్‌లో. మూ డేళ్లపాటు ఆయన ఇక్కడ చదువుకున్నారు. అనంతరం మద్రాస్ వెళ్లిన ఆయన న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

 

 పుట్టుకతోనే చిత్రకళ అబ్బింది

 బాపు ఇకలేరనే విషయం తట్టుకోలేకపోతున్నా. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను మరువలేకపోతున్నా. బాపు నాకు వరుసకు బావ అవుతారు. మా ఇంట్లోనే పుట్టారు. బాపుకు చిత్రలేఖనం పుట్టుకతోనే అబ్బింది. బాల్యంలోనే బొమ్మలు గీయడంపై ఆసక్తిని కనబర్చారు. చిన్నతనంలో అద్భుతమైన చిత్రాలు గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జాతీయ నాయకులు, కుటుంబ సభ్యుల చిత్రాలు లిఖించి అందరికీ బహుమతిగా ఇచ్చేవారు. నా కుమార్తె వివాహ పత్రికపై బాపు గీసిన చిత్రాలు ఎప్పటికీ మా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్‌లు చేసిన సందర్భాల్లో బాపు ఇక్కడికి వచ్చి మాతో గడిపేవారు.  

 - నిడుమోలు రామచంద్రరావు, న్యాయవాది, బాపు బంధువు, నరసాపురం

 

 ఆయన్ను సన్మానించుకోవడం మా అదృష్టం

 ఏలూరు : సినీ దర్శకుడు బాపును సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఏలూరు గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్‌గుప్త అన్నారు. బాపు మృతి కళారంగానికి తీరని లోటని చెప్పారు. కళారంగంలో విశేష సేవలందించిన బాపు, రమణను తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1999లో ఏలూరు సీఆర్‌ఆర్ కళాశాలలో సన్మానించామని గుర్తు చేసుకున్నారు. ఇద్దరినీ ఒకే వేదికపై సత్కరించిన సంఘటన తమ కళ్ల ముందు ఇప్పటికీ కదలాడుతోందన్నారు. కళామతల్లికి వారి సేవలు అనిర్వచనీయమని కొనియాడారు.

 

 కళారంగానికి తీరని లోటు

 ఏలూరు సిటీ : ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, దర్శకుడు, పద్మశ్రీ బాపు అస్తమయం సినీ, సాహిత్య, కళారంగాలకు తీరనిలోటు అని ఏపీ లైబ్రరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు, ఎల్.వెంకటేశ్వరరావు సంతాపాన్ని తెలిపారు. ఆరు నంది, రెండు ఫిలింఫేర్, రఘుపతి వెంకయ్య అవార్డులు అందుకున్న మహానీయుడు బాపు అని నివాళులర్పించారు.

 

 బాపూ రమణీయం

 బాపు ప్రస్తావన వస్తే ముళ్లపూడి వెంకటరమణను తెలుగు ప్రజలు కచ్చితంగా తలచుకుంటారు.  బాపు తన ప్రాణానికి ప్రాణం ముళ్లపూడి వెంకటరమణ అని చెప్పేవారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన వెంకటరమణ 2011లో మరణించగా, తన ప్రాణం అప్పుడే పోరుుందని బాపు వ్యాఖ్యానించారు. అంతటి స్నేహం వారిద్దరిదీ. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలతోపాటు వెంకటరమణ రాసిన ‘బుడుగు’ పుస్తకం బాపు వేసిన బొమ్మలతో సంపూర్ణత సాధించింది. అందుకే వీరిద్దరి జంటను బాపురమణలుగా పేర్కొంటారు. వీరిద్దరి పేరిట వెలువరించిన ‘బాపూరమణీయం’ పుస్తకం తెలుగు పాఠకుల మదిని దోచిందంటే అతిశయోక్తి లేదు.

 

 ఆరుద్ర ఏమన్నారంటే...

 ‘కొంటె బొమ్మల బాపు

 కొన్ని తరముల సేపు

 గుండెల్ని ఊయలలూపు

 ఓ కూనలమ్మా’ అంటూ

 ఆరుద్ర ఏనాడో పద్యాభిషేకం చేశారు.

 

 బాపు బొమ్మలు కదిలేవి

 ‘బాపు వంటి బొమ్మ బ్రహమదేవుడు కూడ

 ప్రాణమిచ్చి భువికి పంపగలడె

 వాని గీతలోని వైభవ జ్యోతికి

 ఇంకిపోదు తైలమెన్నడేని’ అంటూ బాపు ఔన్నత్యాన్ని తణుకు పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత రసరాజు పద్యం కట్టారు. బాపు ఏ బొమ్మ గీసినా కదులుతూ ఉండేవని.. చిత్రాలలో కళకు ప్రాణమిచ్చేవారని.. సహజత్వానికి దగ్గరకు బొమ్మలు గీయడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. బాపు పూర్వీకులు ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో ఉండేవారని చెప్పారు. తాను రాసిన పలు రచనలు, సీరియల్స్‌కు బాపు బొమ్మలు గీశారన్నారు. బాపు మృతి కళారంగానికి తీరని లోటని సంతాపం తెలిపారు.      

 

 ‘ఆమ్యామ్యా’ ఆయన సృష్టే

 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : బాపు మరణం కళారంగానికి తీరని లోటని.. ఆయన శైలి విశ్వవ్యాప్తమైందని సినీ నృత్య దర్శకుడు కేవీ సత్యనారాయణ సంతాపం తెలి పారు. లంచానికి పర్యాయ పదంగా బాపు సృష్టించిన ‘ఆమ్యామ్యా’ ఇప్పటికీ తెలుగు నోళ్లలో నానుతుండటం ఆయన చతురతకు నిదర్శనమన్నారు. హిందూ యువజన సంఘం బాపు మృతికి సంతాపం తెలిపింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘ ప్రతిని ధులు వేణుగోపాల్ లునాని, మోదుగు కృష్ణారావు, శలా వెంకట సత్యనారాయణ, కేబీవీ రమేష్, సీహెచ్ నరసింహరావు తదితరులు సంతాపం తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top