డైస్ వెరీ నైస్


సాక్షి కడప :

 గదులు చాలక చెట్ల కింద చదువులు....బాల, బాలికలకు విడిగా లేని మరుగుదొడ్లు.. ప్రహరీలు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన పాఠశాలలు..... ప్రయోగశాలలు.... కంప్యూటర్ల సౌకర్యాల్లేక వెనుకబడుతున్న విద్యార్థులు.. ఇలాంటి సమస్యలను అధిగమించి ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చుకునేందుకు ఓ మంచి అవకాశం జిల్లా ముంగిటకు వచ్చింది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘డైస్ కార్యక్రమం ద్వారా సరైన వివరాలను కేంద్ర మానవ వనరుల శాఖకు అందజేస్తే అందుకు తగ్గట్టు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.



 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దాని కోసం ఏటా కోట్లాది రూపాయలను సర్కారు ఖర్చు చేస్తోంది. పాఠశాలల వారీగా వివరాల సేకరణ కోసం ‘డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(డైస్) అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏటా అక్టోబరు, నవంబరు మాసాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఈ పక్రియ జరుగుతోంది.



 వివరాల సేకరణ, నమోదు

 జిల్లాలోని ప్రతి పాఠశాలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించడం ‘డైస్’ ప్రధాన లక్ష్యం. 2014-15 విద్యా సంవత్సరానికిగానూ ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు విడుదల చేయడం కోసం డైస్ ప్రక్రియను జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతోపాటు అన్ని రకాల అవసరాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి జిల్లాకు పంపనున్నారు.



సర్వశిక్షా అభియాన్, విద్యా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పక్రియను చేపట్టారు. పాఠశాలల వారీగా వివరాల సేకరణ, వాటి నమోదుపై అవగాహన కల్పించడం కోసం జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన అధికారులు జిల్లా స్థాయిలో మండల విద్యా శాఖాధికారులకు, స్ట్రాంగ్ టీచర్లకు శిక్షణ అందించారు. పాఠశాలల వారీగా వివరాల సేకరణ కోసం మండలస్థాయిలో ఉపాధ్యాయులను నియమించారు. వీరు ప్రాథమికంగా పాఠశాలల వివరాలను జిల్లాస్థాయి అధికారులకు తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ పక్రియ పూర్తయ్యింది.



ఎంఈవోలు ఆయా మండలాలవారీగా పాఠశాలల హెడ్మాస్టర్లకు అవగాహన సదస్సులు నిర్వహించి డైస్ విధివిధానాలను తెలియజేస్తారు. పాఠశాలల వివరాల సేకరణ కోసం ప్రత్యేక పత్రాన్ని రూపొందించారు. వాటిని హెడ్మాస్టర్లకు పంపిణీ చేస్తారు. ఆ పత్రంలో అడిగిన వివరాలను హెడ్మాస్టర్లు సేకరించి ఎంఈవోలకు అందజేస్తారు. ఆ వివరాలను ఎంఈవోలు సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే తయారు చేసిన పత్రాలను ఆయా ఎమ్మార్సీలకు పంపించారు. అక్కడ సంబంధిత హెడ్మాస్టర్లకు అందజేసి అక్కడి నుంచి పాఠశాలలకు సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని తెలుసుకోనున్నారు.



 మండలస్థాయిలో పరిశీలన :

 పాఠశాలల వారీగా హెడ్మాస్టర్లు అందించే వివరాలను ఆయా మండల స్థాయిలో టీచర్లు పునఃపరిశీలన చేస్తారు. ఆ విధంగా సమగ్ర వివరాల సేకరణ పూర్తయిన తర్వాత పాఠశాలల వారీ సమాచారాన్ని కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం సర్వశిక్షా అభియాన్ జిల్లా కేంద్రంలో ఎంఐఎస్ సమన్వయకర్తలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా  వివరాలను మళ్లీ  కంప్యూటరీకరిస్తారు. ఈ పక్రియంతా పూర్తి కావడానికి దాదాపు 20రోజులవరకు పడుతుంది. వివరాలను సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టుకు, అక్కడి నుంచి కేంద్ర మానవ వనరుల శాఖకు పంపుతారు. ఈ వివరాల ఆధారంగా పాఠశాలలకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

 

 పాఠశాలల్లో ‘డైస్' ద్వారా

 సేకరించే వివరాలు


 

  పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య

  ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సంఖ్య

  ఉపాధ్యాయుల సంఖ్య

  తరగతి గదుల సంఖ్య

  మరుగుదొడ్ల సంఖ్య

  తాగునీటి వసతి

  వంట షెడ్డు

  ఏకరూప దుస్తులు

  మధ్యాహ్న భోజన పథకం, గదులు

  కంప్యూటర్ల సంఖ్య

  ప్రహరీ గోడ

  ప్రయోగశాల

  క్రీడా మైదానం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top