రెండేళ్ల లీజు కట్టాల్సిందే


  • వీబీఎం కళాశాలకు షాక్

  •  కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీర్మానం

  • విజయవాడ సెంట్రల్ : వీబీఎం కళాశాల రెండేళ్ల లీజు కట్టాల్సిందేనని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది. నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం కమిటీ సమావేశమైంది. గత సమావేశంలో వాయిదాపడ్డ వీబీఎం కళాశాల లీజు వ్యవహారంపై వాడీవేడిగా చర్చ సాగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్‌లోని 20,148 చ.అ స్థలాన్ని కళాశాల నిర్వహణ కోసం 2009 జూలై 1న కార్పొరేషన్ నుంచి కళాశాల యాజమాన్యం లీజుకు తీసుకుంది. నెలకు రూ.1,30,280 అద్దె ఇచ్చే ఒప్పందంపై లీజు ఖరారైంది.



    కళాశాల నిర్వహణకు అనువైన వసతులు లేవని పలుమార్లు లేఖలు రాసినప్పటికీ అధికారులు స్పందించలేదన్నది కళాశాల యాజమాన్యం వాదన. ఈ క్రమంలో నవంబర్ 2011 వరకు కళాశాలను నిర్వహించలేదని, రూ.18 లక్షల సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించుకున్నామన్నారు. 2011 తర్వాత వినియోగంలోకి వచ్చింది కాబట్టి అప్పటినుంచే లీజు మొదలైనట్లు పరిగణించాల్సిందిగా యాజమాన్యం కోరింది. స్టాండింగ్ కమిటీ నో చెప్పింది. రెండేళ్ల అద్దె కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత అద్దెపై ముప్పై మూడున్నర శాతం పెంచుతూ తీర్మానం చేసింది.

     

    మరిన్ని తీర్మానాలు


    రాజగోపాలాచారి మర్కెట్‌లో ఐదో నెంబర్ షాపు లీజు వ్యవహారంపై ఇంజినీర్ల బృందం పరిశీలించిన తర్వాత నిర్ణయం వెల్లడించాలని మేయర్ పేర్కొన్నారు.

     

    హౌసింగ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) కార్యాలయం ఏర్పాటుకు బందరు రోడ్డులో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్థలాన్ని అడ్వాన్స్ లేకుండా లీజుకు  ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో పెరిగిన అద్దెల దృష్ట్యా అడుగుకు రూ.35 అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు.

     

    సీవీఆర్ కాంప్లెక్స్  సమీపంలోని డ్వాక్వా షాపు లీజును ఖరారు చేశారు. షాపు ముందు ఏర్పాటు చేసిన బడ్డీకొట్టు నుంచి అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు.

     

    ఉద్యోగుల మెడికల్ బిల్స్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన అంశాలకు ఆమోదముద్ర వేశారు.

     

    స్టాండింగ్ కమిటీ సభ్యులు జి.కనకదుర్గ, ఎస్.సరిత, ఎన్.బాలస్వామి, జి.నరసింహారావు, ఎ.రవికుమార్, అదనపు కమిషనర్ ఆర్.ఎం.జె.నాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్, ఎస్‌ఈ టి.మోజెస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

     

    లీజులో అవకతవకలు జరిగాయి : పుణ్యశీల




    వీబీఎం కళాశాల లీజు వ్యవహారంలో స్టాండింగ్ కమిటీ అవకతవకలకు పాల్పడిందని వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత బండి నాగేంద్ర పుణ్యశీల ఆరోపించారు. కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే రెండేళ్లపాటు అద్దె కట్టలేదన్నారు. మరమ్మతుల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేశారన్నారు. రూ.18 లక్షల ఖర్చులో సుమారు రూ.15 లక్షలకు కళాశాలకు మినహాయింపు ఇవ్వడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top