వ్యాట్‌కు నిరసన

వ్యాట్‌కు నిరసన - Sakshi


విజయవాడ : పొరుగు రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ పిలుపు మేరకు సోమవారం పెట్రోలు బంకుల బంద్ పాటిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో అన్ని పెట్రోలు బంక్‌లను మూసివేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ తొలి హెచ్చరికగా బంకులన్నింటినీ 24 గంటలపాటు బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ ఆందోళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 220 పెట్రోలు బంకులను మూసివేసి, వాటి యజమానులు నిరసనలో పాల్గొంటారు. సోమవారం రోజంతా పెట్రోలు, డీజిల్ విక్రయాలు, కొనుగోళ్లు నిలిపివేయనున్నారు. జిల్లాలో రోజుకు 12 లక్షల లీటర్ల డీజిల్, సుమారు 10 లక్షల లీటర్లు పెట్రోలు విక్రయాలు జరుగుతాయి.



పెట్రోలియం కంపెనీల నుంచి డీలర్లు రోజుకు పెట్రోలు, డీజిల్ కలిపి రోజుకు 30 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తారని అంచనా. విక్రయాలు, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు అన్నింటిని బంకుల యజమానులు ఒక్కరోజు నిలిపివేస్తారు. ఈ ఆందోళనలో జిల్లాలో అన్ని పెట్రోలు బంకుల యజమానులు పాల్గొంటున్నారని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ జిల్లా అధ్యక్షుడు చుంచు నరసింహారావు తెలిపారు. న్యాయమైన తమ ఆందోళనకు సహకరించాలని జిల్లా ప్రజలను కోరారు.

 

 సమ్మెకు కారణాలు ఇవీ..

 రాష్ట్ర ప్రభుత్వం ఆరు మాసాల క్రితం పెట్రోలు, డీజిల్ విక్రయాలపై 4 శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకిం చారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ప్రభుత్వం రాష్ట్రంలో 4 శాతం వ్యాట్ విధించడం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్నాటక వెళ్లి లారీ యజమానులు డీజిల్‌ను కొనుగోలు చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ విక్రయాలు 40 శాతం పడిపోయాయి.



మరోవైపు పెట్రోలు బంకులపై ఇటీవల కాలంలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది చేస్తున్న దాడులను ఆపాలని డీలర్లు కోరుతున్నారు. మామూళ్లకోసం అగ్నిమాపక సిబ్బంది తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఫారం-ఎఫ్, ఫారం-వీ లెసైన్సులను రద్దు చేయాలని పెట్రోలు డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. రవాణా వాహనాలకు సంబంధించి ఆయిల్ ట్యాం కర్లకు వచ్చే కిరాయిపై కూడా ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌ను ఎత్తివేయాలని పెట్రోలు డీలర్లు విజ్ఞప్తిచేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top