కేసీఆర్‌ను చూసి బుద్ధితెచ్చుకో బాబు

కేసీఆర్‌ను చూసి బుద్ధితెచ్చుకో బాబు - Sakshi


రుణమాఫీ చేయకుండా తప్పించుకుంటున్న బాబు



ఒంగోలు టౌన్ : రైతుల రుణమాఫీ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పించుకు తిరుగుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు ధ్వజమెత్తారు. సింగపూర్, జపాన్ అంటూ విదేశీ పర్యటనలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఆదివారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 8వ తేదీ గుంటూరులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తూ రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారన్నారు.



రుణాలు మాఫీ చేయకపోగా కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిటీల పేరుతో కొంతకాలం కాలయాపన చేశారని, ఆ తరువాత రైతుల అర్హతపై విచారణలు, పునర్విచారణల పేరుతో రుణమాఫీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. స్మార్ట్ సిటీ, మహానగరాలు, వినోద నగరాలంటూ జపం చేస్తున్న చంద్రబాబు కోటి మంది రైతుల రుణ మాఫీ గురించి చర్యలు తీసుకోవడం లేదన్నారు.



కేసీఆర్‌ను చూసి బుద్ధితెచ్చుకో..

రుణమాఫీ విషయంలో తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని వంగల సుబ్బారావు సూచించారు. తెలంగాణ  ప్రభుత్వం 39 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.17 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తాజాగా 8 వేల కోట్ల రూపాయల రుణాలు తిరిగి ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికల మ్యానిఫెస్టోలో కోటి 81 లక్షల మంది రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించినప్పటికీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు.



ప్రస్తుత ఖరీఫ్‌కు సంబంధించి రూ.30 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. 12 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఒక్కరు కూడా రుణాలకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే కరువు మండలాలను ప్రకటించలేదని, ఒక్క అనంతపురం జిల్లాలోనే 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే  రైతాంగ పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.



1న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు

రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ డిసెంబర్ 1వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వంగల సుబ్బారావు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ శనగల కొనుగోళ్లు కేవలం వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావు ప్రారంభోత్సవానికే పరిమితమైనాయని విమర్శించారు. పత్తి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటా రూ.4050 కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top