తప్పు చేసి ఉంటే.. సారీ

తప్పు చేసి ఉంటే.. సారీ - Sakshi


శాసనసభ విలువలు పెంచే విషయంలో ప్రతిష్టకు పోము

స్పీకర్ మనసును గాయపరచి ఉంటే వాటిని వెనక్కు తీసుకుంటాం

భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగనివ్వం

సభాహక్కుల ఉల్లంఘనపై జరిగిన చర్చలో విపక్ష నేత జగన్ స్పష్టీకరణ

తప్పు జరిగి ఉంటే ఒప్పుకునే హుందాతనం మాకుంది

కానీ కుతూహలమ్మ కంటతడి పెట్టినా చంద్రబాబు నాడు చలించలేదు


 

హైదరాబాద్: శాసనసభ విలువలను పెంచే విషయంలో తాము ఏమాత్రం ప్రతిష్టకు పోము అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సభాపతి స్థానానికున్న గౌరవాన్ని కాపాడేందుకు ఓ మెట్టు దిగేందుకూ వెనకాడబోమని చెప్పింది. ఉద్వేగంలో తమ సభ్యులు స్పీకర్‌పై పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమాపణ కోరుతున్నట్టు పార్టీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. దీన్ని తాము నామోషీగా భావించడం లేదన్నారు. తప్పు జరిగి ఉంటే, ఒప్పుకునే హుందాతనం తమకుందన్నారు. తమ సభ్యుల మాటలు స్పీకర్ మనసును గాయపరచి ఉంటే వాటిని వెనక్కు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు తమ వైపు నుంచి మున్ముందు జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో స్పీకర్ వైఖరినీ ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై నిలదీస్తామన్నారు. అదే పనిగా అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇవ్వడాన్ని, వారిచేత విపక్షాన్ని తిట్టించే చర్యలను సభలో ప్రస్తావిస్తావన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ప్రతిపక్షానికి ఉండే హక్కని గుర్తు చేశారు. ఆరోజు సభ జరిగిన తీరునూ ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజా గళాన్ని విన్పించే ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించారు. స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రాజీపడబోమన్నారు.



ఈ నెల 19వ తేదీన శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చకు విపక్షం పట్టుబట్టింది. ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ మైక్‌ను స్పీకర్ కట్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సభాపతి పోడియాన్ని చుట్టుముట్టారు. భావోద్వేగంతో న్యాయం కోసం ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల నుంచి పరుష పదజాలం వచ్చిందని, అవి స్పీకర్‌ను అవమానించేలా ఉన్నాయని, వారి హావభావాలు సభా గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గురువారం శాసనసభలో సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ మూడు గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా జగన్ తమ పార్టీ సభ్యుల తరఫున బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పలువురు తమ వివరణ ఇచ్చారు. ఆవేశంలో మాట జారితే క్షమించమని స్పీకర్‌ను కోరారు.

 

చర్యలకు అధికార పక్షం పట్టు



క్షమాపణతో వివాదాన్ని ముగించేందుకు ప్రతిపక్షం ప్రయత్నించినా... అధికార పక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. తొమ్మిది మంది సభ్యులపై చర్య తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పట్టుబట్టారు. వాళ్లు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం లేదని, ఇదంతా నటనే అంటూ వారు ఆరోపించారు. దీనిపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గతంలో కరణం బలరాంను సస్పెండ్ చేసిన విధంగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలన్నారు. ఈ దశలో జగన్ వారి వాదనకు దీటుగా బదులిచ్చారు.



బాబు ఏనాడైనా తప్పును ఒప్పుకున్నారా?



తప్పును ఒప్పుకోవడం హుందాతనమని, ఆ సంప్రదాయం గతంలో ఏనాడైనా చంద్రబాబు పాటించారా? అని విపక్ష నేత ప్రశ్నించారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న కుతూహలమ్మ ఏడుస్తూ వెళ్లిన చీకటి రోజుల మాటేంటని నిలదీశారు. ‘నిండు సభలో అప్పటి స్పీకర్ కుతూహలమ్మ చంద్రబాబు అన్న మాటలకు కంటతడిపెట్టారు. బాబు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. తెలుగుదేశం సభ్యులు కౌరవుల్లా వ్యవహరించారని కుతూహలమ్మ కన్నీరు మున్నీరైనా కనీసం ‘సారీ’ చెప్పలేదు. ఇదే చంద్రబాబు సభాపతిని రౌడీ స్పీకర్ అని వ్యాఖ్యానించారు. అప్పుడైనా సారీ చెప్పారా? లేదే! ఆ సంస్కారం టీడీపీకి ఏనాడూ లేదు. కానీ మేము తప్పు చేసి ఉంటే క్షమించమని అడుగుతున్నాం. అది మా సంస్కారం’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చేసిన వాదనపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ మహిళకు జరిగిన అవమానాన్ని వక్రీకరించడం భావ్యం కాదన్నారు. కుతూహలమ్మ ఆవేదన వ్యక్తం చేయడానికి సంబంధించిన వార్తను ప్రతిపక్ష నేత చదివి విన్పించారు. తాము జరిగినదానికి క్షమాపణ చెప్పినా, ఇంకా  సభా సమయాన్ని వృధా చేయడం ఎందుకని ప్రశ్నించారు.



వాదన వినకుండానే శిక్షిస్తారా..?



హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టిన తీరుపై వైఎస్సార్‌సీపీ ఆరంభంలోనే అభ్యంతరం తెలిపింది. పార్టీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని శాసనసభ నిబంధనావళిని ఉటంకిస్తూ వాటిని సవివరంగా తెలిపారు. వాటిని పాటించకుండానే  అధికార పార్టీ సభ్యులు నోటీసు ఇవ్వడం, దాన్ని వెంటనే చర్చకు చేపట్టడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ పార్టీ సభ్యులనుద్దేశించి ఇదే సభలో మంత్రులు.. ‘ఏంట్రా... అంతుచూస్తాం...’ అంటూ అనేక వ్యాఖ్యలు చేశారని, వీటికి సంబంధించి తామిచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసులన్నీ స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.  పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై రూలింగ్ ఇవ్వాలని సభాపతిని ఆయన కోరారు. తాము ఇప్పటికే ఉల్లంఘనకు సంబంధించిన సీడీలు, అవసరమైన ఆధారాలు స్పీకర్‌కు ఇచ్చామని, మంత్రి యనమల సమర్థించుకున్నారు.



భయపడి మాత్రం సారీ చెప్పడం లేదు



సస్పెండ్ చేస్తారనో లేదా ఉరి తీస్తారనో భయపడి మాత్రం తాము సారీ చెప్పడం లేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్పీకర్ స్థానంపై గౌరవంతోనే తాము సారీ చెబుతున్నామన్నారు.చంద్రబాబుకు లేని సంస్కారం తమ నేతకు ఉండటం, తమకు గర్వంగా ఉందన్నారు. తాము ఉద్దేశపూర్వకంగా స్పీకర్‌ను నొప్పించలేదని మరో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. స్పీకర్ తండ్రితో సమానమని, ఇంట్లో ఒకరికే ప్రాధాన్యం ఇస్తే, మరొకరిలో ఆవేశం సహజమని, ఆ రోజు ఘటన కూడా అలాంటిదేనని ఆర్.కె.రోజా అన్నారు. జరిగినదానికి చింతిస్తున్నట్టు చెప్పారు. తాము నిజాయితీతో జరిగింది ఒప్పుకున్నామని, స్పీకర్ ఏ చర్య తీసుకున్నా అంగీకరిస్తామని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రతిసారీ దివంగత  వైఎస్‌ను ప్రస్తావించడం, విమర్శలు చేయడం తగదన్నారు.

 

విపక్ష నేత మాటలు ఉపశమనం కలిగించాయి: స్పీకర్



ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తన సభ్యుల పక్షాన క్షమాపణ కోరడం ఉపశమనం కలిగించిందని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్షే లేదన్నారు. అందరూ తప్పులు చేస్తారని, వాటిని గుర్తించడం, సరిదిద్దుకోవడం ద్వారానే వ్యక్తిత్వం పెరుగుతుందని చెప్పారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇరు పక్షాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచించారు. సభ జరుగుతున్న తీరుపై తనకు అసంతృప్తిగా ఉందన్నారు. సభ నిర్వహణ కష్టంగా ఉందని చెప్పారు. విలువైన ప్రజా సమస్యలు చర్చకు రాలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో అధికార పక్షానికే ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. విపక్షం ప్రశ్న వేస్తే, అందుకు జవాబు చెప్పడానికే ఈ సమయం పడుతోందని వివరణ ఇచ్చారు. ప్రజల రక్షణ, అభ్యున్నతి విషయంలో సభా నాయకుడు, ప్రతిపక్ష నేత సమష్టి బాధ్యత వహించాలని చెప్పారు. సభలో సమస్యలపై ఎవరెంత పటిష్టంగా మాట్లాడుతున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదన్నారు. విపక్షం లేకపోతే, వాళ్లు చర్చల్లో పాల్గొనకపోతే ప్రభుత్వానికి నష్టమని అభిప్రాయపడ్డారు. తన కార్యాలయం కార్యదర్శిపైనా ఆరోపణలు తగవని విపక్షానికి సూచించారు. వాళ్లు ఏదైనా తప్పు చేస్తే తన దృష్టికి తేవాలన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే ప్రతిపక్ష నిర్ణయాన్ని స్పీకర్ స్వాగతించారు. తాను ఏవైనా పొరపాట్లు చేస్తున్నానా? అనేది తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశమే అన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు పేర్కొంటూ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top