వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి


ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బీటీనాయుడు

 

పత్తికొండ టౌన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌వారి హయాంలో రెండువందల ఏళ్లు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్సీలుగా, కర్ణాటకలో ఎస్టీలుగా గుర్తించారన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాల్మీకులు విద్య, ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కోస్తాలోని ఐదు జిల్లాల్లో ఎస్టీలుగా, తెలంగాణ  ప్రాంతంలో బీసీలుగా, రాయలసీమ ప్రాంతంలో డీనోటిఫైడ్ ట్రైబ్‌లుగా గుర్తించారన్నారు.



ఒకే రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాలతో పూర్తిగా నష్టపోయారన్నారు. వాల్మీకులకు కులవృత్తి లేకపోవడంతో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకుని నేరాలకు పాల్పడి, కేసులలో ఇరుక్కుని కుటుంబాలు నాశనం చేసుకున్నారన్నారు. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల వేళ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీలు ఇచ్చి, తర్వాత విస్మరిస్తున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీజాబితాలో చేరుస్తామని తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపించాడన్నారు.



అలాగే రిటైర్డు ఐఏఎస్ చెల్లప్ప ఆధ్వర్యంలో కమిటీని నియమించారన్నారు. ఈ విషయమై వాల్మీకి సంఘాల నాయకులతో కలసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ సమస్య విన్నవించామన్నారు. సీఎం చంద్రబాబు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయంపై సానుకూలంగా స్పందించాడన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ మైరాముడు, బీసీసంక్షేమసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు, వాల్మీకిసంఘం నాయకులు ఆస్పరి రవిచంద్ర, బీటీ గోవిందు, హోసూరు రామాంజినేయులు, దస్తగిరి నాయుడు, మునిస్వామి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top