'మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అలసత్వం వహిస్తే తుని తరహా ఘటనలు పునరావృతం అవుతాయని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి (వీఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు. సోమవారం కర్నూలులోని వీఆర్‌పీఎస్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వాల్మీకులను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.



'తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పని చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా కులాలకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఆందోళన బాట పట్టారన్నారు. ఉద్యమాలు హింసాత్మకంగా మారకముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టానుసారం హామీలు ఇచ్చి నేడు అనేక సమస్యలు ఉన్నాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారని' ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విషయంలో కాలయాపన చేస్తే రాయలసీమలోని వాల్మీకులంతా ఏకమై తుని ఘటనను పునరావృతం చేస్తామని సుభాష్ హెచ్చరించారు. రాజకీయ కుట్రతోనే 1956లో వాల్మీకులను ఎస్‌టీ రిజర్వేషన్ నుంచి బీసీలోకి మార్చారని ఆరోపించారు. సమావేశంలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, జిల్లా కార్యదర్శి బోయ గోపి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top