‘వైకుంఠ’ దర్శనం కోసం టీటీడీ పై ఒత్తిడి

‘వైకుంఠ’ దర్శనం కోసం  టీటీడీ పై ఒత్తిడి


భారీసంఖ్యలో ప్రజాప్రతినిధులు, ప్రముఖుల రాకపై టీటీడీకి సందేశం

అన్నిటిలోనూ కత్తెరవేయాలని భావిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు

బస, దర్శన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ

వీఐపీల కోసం 4 వేల గదులు బ్లాక్ చేయాలని నిర్ణయం


 

తిరుమల: 2015 కొత్త సంవత్సరం ప్రారంభం, వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకే రోజు రానున్నాయి. అతిముఖ్యమైన ఆ రోజు న తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడి నుంచి ప్రముఖుల వరకు ఎదురు చూస్తున్నారు. దీనివల్ల ఏకాదశి దర్శనం కోసం టీటీడీపై ఒత్తిడి రె ట్టింపు స్థాయిలో ఉంది. పరిమిత సంఖ్యలోనే వీఐపీ దర్శనాలు అమలు చేసి, ఎక్కువ సమ యం సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.



వైకుంఠ దర్శనానికి పోటెత్తనున్న వీఐపీలు



వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఈసారి మాత్రం కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి జనవరి 1వ తేదీన రావడం వల్ల స్వామిని దర్శించుకుని, ఉత్తర ద్వారంలో ప్రదక్షిణ చేసేందుకు భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉందని ఇప్పటికే టీటీడీ అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో భాగం గా ఇప్పటికే వేల సంఖ్యలో లేఖలు, ఫ్యాక్స్ ఉత్తర్వులు, సెల్‌ఫోన్ ఆదేశాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు, మరో 20 మంది ఎంపీలు, 150 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 మంది న్యాయవిభాగం నుంచి వైకుంఠ దర్శనం కోసం టీటీడీకి సమాచారం అందింది. వీఐపీలతోపాటు వారి బంధుగణాలు కూడా వేల సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.



వీఐపీ దర్శనాల్లో భారీగా కోత



ఈసారి కొత్త సంవత్సరం, ఏకాదశి ఒకే రోజు రావటం వల్ల సామాన్య భక్తులు అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉన్నందున వీఐపీ దర్శనాల్లో భారీగా కోత వేయాలని టీటీడీ కొత్త ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక వీఐపీతోపాటు ముగ్గురికి మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అమల్లో కూడా అదే విధానం పాటించాలని సంకల్పించారు. ఎంత ఒత్తిడి చేసినా అదనపు టికెట్లు, గదులు ఇవ్వకూడదని నిర్ణయించారు.  ఇందుకోసం విధి విధానాలు రూపొందించారు.



 హోదాను బట్టి బస, దర్శనం



 తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శనం కల్పించేందుకు టీటీడీ సన్నద్ధమయింది. దర్శనానికి వచ్చే వీఐపీల జాబితా సిద్ధం చేసేందుకు జేఈవో శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారుల బృందం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటి జాబితాలో రాజ్యాంగ పరిధిలో హోదా కలిగిన వారు, రెండో జాబితాలో ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌ఏసీలు, మూడో జాబితాలో అధికారులు, ఇతరులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్టేట్ ఆఫీసర్ వీ.దేవేంద్రరెడ్డి, డెప్యూటీ ఈవో వెంకటయ్య, ఓఎస్‌డీ దామోదరం సుమారు 50 మంది సిబ్బందితో కలసి గదులు కేటాయించనున్నారు. ఇందుకోసం ఈనెల 31వ తేదీన సుమారు 4 వేల గదులను బ్లాక్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top