మాచర్ల టీడీపీలో ఆధిపత్య పోరు !

మాచర్ల టీడీపీలో ఆధిపత్య పోరు ! - Sakshi


పట్టణ మున్సిపాల్టీలో యుద్ధవాతావరణం

కత్తులు దూసుకుంటున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు

మాట వినని అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయింపు

 


అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నతాధికారులకు శాపంగా మారాయి. జిల్లాలోని మాచర్ల మున్సిపాల్టీలో ఉద్యోగం అంటేనే అధికారులు హడలిపోతున్నారు. మా కొద్దు బాబోయ్ మాచర్ల అంటూ పరారవుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య  వైరానికి అధికారులు బలవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో జైలు ఊసలు లెక్కిస్తున్నారు. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులు ఉన్నా ప్రజల గొంతు తడవని దుస్థితి నెలకొనడం ఇక్కడి దారుణాలకు దర్పణం పడుతోంది.  టీడీపీ నేతలే అభివృద్ధి నిరోధకులుగా మారారని మాచర్ల పట్టణం కోడై కూస్తోంది.

 

సాక్షి, గుంటూరు : మాచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య నెలకొన్న అంతర్యుద్ధానికి ఇప్పటికే అనేక మంది అధికారులు అన్యాయానికి గురయ్యారు. మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిజేస్తున్నారు.  ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ముగ్గురు కమిషనర్‌లు, ఒక డీఈఈపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం ఇక్కడి దారుణ పరిస్థితిని కళ్లకు కడుతోంది.



రెండు గ్రూపులుగా కౌన్సిలర్లు...

మాచర్లలో జరిగిన ఉప ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలైన మధుబాబు, చలమారెడ్డిలను ఇన్‌చార్జిలుగా నియమిస్తూ టీడీపీ నిర్ణయించింది. దీంతో ఇద్దరు ఇన్‌చార్జిలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ మున్సిపల్ కౌన్సిలర్లను రెండు గ్రూపులుగా చీల్చేశారు. అంతటితో ఆగకుండా తమ ప్రతాపాన్ని మున్సిపల్ అధికారులపై చూపుతూ వస్తున్నారు. రెండేళ్ళ వ్యవధిలో మున్సిపాలిటీకి ఐదుగురు కమిషనర్‌లు మారడం ఇక్కడి దారుణ పరిస్థితిని తెలియజేస్తోంది.  కమిషనర్‌ను నియమించడం ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. మున్సిపాల్టీలో రూ. 4 కోట్లకు పైగా నిధులున్నా అభివృద్ధికి అధికారపార్టీ నేతలే అడ్డంకిగా మారారు.



కేసులు నమోదైన అధికారులు వీరే..

కయ్యానికి కాలు దువ్వుతున్న చైర్మన్, వైస్‌చైర్మన్ వర్గాలు తమ మాట వినని అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాత కమిషనర్‌గా ఉన్న మురళీకృష్ణను బదిలీ చేయించిన చైర్మన్ వర్గం అజయ్‌కిషోర్‌కు పోస్టింగ్ వేయించారు. ఆయన చైర్మన్ వర్గానికి కొమ్ముకాస్తున్నారనే కోపంతో వైస్ చైర్మన్ వర్గం ఆయనపై ఓ ఎస్సీ కౌన్సిలర్ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. దీంతో కమిషనర్ అజయ్‌కిషోర్ జైలుపాలై అక్కడ నుంచి వెళ్లిపోయారు. తమకు అనుకూలంగా వ్యవహరించే కమిషనర్‌ను జైలుకు పంపారనే కక్షతో ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న డీఈ సీతారామారావుపై చైర్మన్ వర్గం ఎస్సీ మహిళతో ఫిర్యాదు చేయించారు.



ఆయనపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం వైస్ చైర్మన్ వర్గం డీఈ కొండారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి ఆయన్నూ బదిలీ చేయించారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు చైర్మన్ వర్గం సైతం కమిషనర్ శ్రీనివాసులుపై శానిటరీ వర్కర్ చేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి సాగనంపారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారి ప్రభాకర్ ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో వైపు  అధికారపార్టీ నేతల వేధింపులు తాళలేక ఏడాది కిందట మేనేజర్ మురళీ బదిలీపై వెళ్ళడంతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. దీంతో ఆ పోస్టుకు ఎవరూ రాక ఇప్పటికీ ఖాళీగానే ఉంది. పోస్టింగ్‌ల కోసం ఎదురుచేసే అధికారులు సైతం మాచర్ల మున్సిపాలిటీకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top