రైతులకు భరోసా ఏదీ ?


సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ప్రభుత్వంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వల్ల రైతాంగం నష్టపోతోందని జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తొలి ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి ప్రశ్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా అది కూడా ప్రకాశం జిల్లాకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు అవకాశం లభించింది. వీరిద్దరూ రైతు సమస్యలపై ఎలుగెత్తి వైఎస్సార్ కాంగ్రెస్ రైతుపక్షపాతి అని నిరూపించారు. విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వ సన్నద్ధత ఎంతని వ్యవసాయ శాఖ మంత్రిని నిలదీశారు.



 మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ జరుగుతున్నట్లు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన క థనాలను ప్రస్తావించారు. ఇక్కడి నుంచే నకిలీ విత్తనాలు దేశం నలుమూలలకు వెళ్తున్నాయని పత్రికల్లో వచ్చినా అధికారులు స్పందించలేదన్నారు.



 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నుంచి సీడ్ విడదీసి కిలో 20 నుంచి 30 రూపాయలకు కొనుగోలు చేసి ఐదు వందల గ్రాముల ప్యాకెట్‌ను మార్కెట్‌లో నాలుగు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు. అక్రమార్కులపై నామమాత్రపు కేసులు పెట్టడం వల్ల వారు కొద్దిపాటి జరిమానాలతో బయటకు వస్తున్నారని, వారిపై పకడ్బందీగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.



 జిల్లాలో పొగాకు, మొక్కజొన్న, సజ్జలు, శనగల పంట కోసం ఎకరానికి పెరిగిన ధరల నేపథ్యంలో 20 వేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని, పంట చేతికి వచ్చే సమయానికి పూత రాకపోతేగానీ రైతుకు అవి నకిలీ విత్తనాలు అని తెలియడం లేదని వారు వివరించారు. ఎక్కువ పెట్టుబడి, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విత్తనాలను సేకరించడంలోనూ, జిల్లాలకు పంపించే సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందని వారు విమర్శించారు. నకిలీ విత్తనాలు లక్షలాది ఎకరాల్లో వేయడం వల్ల వేలాదిమంది రైతులు నష్టపోతున్నారన్నారు.



 కోల్డ్ స్టోరేజిలో ఉన్న విత్తనాలను అధికారులే రైతులకు అంటగడుతున్నారని, సంవత్సరం దాటిన తర్వాత శుద్ధి చేయకుండా ఇవ్వడం వల్ల రైతు నష్టపోతున్నాడన్నారు.  గుంటూరు, ప్రకాశం జిల్లా పత్తి, మిర్చి, శనగ తదితర విత్తనాలు ఎన్ని టన్నులు సేకరించారు, జిల్లా కేంద్రానికి ఎంత చేరిందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ పంటను వేశారని, అయితే శనగకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల లక్షల క్వింటాళ్లు కోల్డ్‌స్టోరేజి గోడౌన్లలో మూలుగుతున్నాయని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.



 రైతులకు అవగాహన కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ పేరుతో మొక్కుబడి కార్యక్రమాలు చేయడం వల్ల మీడియాలో ఫొటోల కోసం తప్ప ఉపయోగం లేదని వారు విమర్శించారు. శనగ రైతుల సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి సమాధానమిస్తూ తమను రైతు సంఘం నాయకులు వచ్చి కలిశారని, టన్నుకు 3,800 రూపాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top