మా బతుకులు చూడన్నా..!

మా బతుకులు చూడన్నా..! - Sakshi

  • కట్టుకోనాకి గుడ్డ లేదు

  •  వండుకోనాకి పొయ్యిలేదు

  •  ఆకలితో ఉన్నా ఏలూ పట్టించుకోట్లేదు

  •  తమ కష్టాలను జగన్‌కు వివరించిన హుదూద్ బాధితులు

  •  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధినేత ఆరవ రోజు పర్యటన

  • సాక్షి,విశాఖపట్నం : ‘అన్నం తింటాం డగా గంగమ్మ వచ్చి ఆ కంచాన్ని, ఇంట్లోని సామాల్ని పట్టుకుపోనాది. పానాలు అరచేతిలో  ఎట్టుకుని కట్టుబట్టల్తో పరిగెత్తేసినాం..ఇల్లు కూలిపోనాది. ఆళ్లు, ఈళ్లు వచ్చి బియ్యం ఇస్తాన్నారు. గ్యాస్ బండలు కొట్టుకుపోనాయి.  నీళ్లు వచ్చేశాయి.. పిల్లా పాపలతో వీధిన పడ్డాం..తినడానికి తిండేకాదు, తాగడానికి నీరు, కట్టుకోనాకి గుడ్డ లేదు..మా బతుకులు ఇలా ఉన్నా పట్టించుకోనాకి ఏలూ రానేదు. నువ్వే వచ్చినావ్..చూడన్నా మా బతుకులు’ అంటూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తమ కష్టాలు చెప్పుకున్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతా ల్లో ఆరవ రోజైన ఆదివారం జగన్ పర్యటన భీమునిపట్నంలో జరిగింది. జనం పడుతున్న బాధలను పేరు పేరునా అడిగితెలుసుకున్న ఆయన తా ను అండగా ఉండి, న్యాయం జరిగేలా పోరాడతానని  భరోసా ఇచ్చారు.

     

    ఉదయం 10గంటలకు భీమునిపట్నం చేరుకున్న జగన్‌కు తాను మాట్లాడలేనని, శబ్దం వినలేనని (మూగ, చెవిటి) అయినా పింఛన్ రావడం లేదని వాడమదుల అప్పారావు సైగలతో తన గోడు చెప్పుకున్నాడు. సూరి బాబు అనే వృద్ధుడిని పలకరించి ‘బాగున్నావా తాతా’ అంటూ జగన్ అప్యాయంగా మాట్లాడారు. ‘జీవితంలో ఏన్నడూ ఇంతటి ప్రకృతి విపత్తును చూ డలేదు బాబూ’అని సూరిబాబు బోరుమన్నాడు. కడుపుకట్టుకుని, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు దెబ్డతిందని, దానికి 13ఏళ్లుగా తలుపులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న తమను తుపాను కోలుకోలేని దెబ్బతీసిందని రాకోతులక్ష్మి కన్నీరు పెట్టుకుంది. ‘పోలియోతో కాలు పనిచేయకపోయినా పింఛన్ ఇవ్వడంలేదన్నా. ఇల్లు కూలి పోయింది. అమ్మను, నన్ను చెల్లి చిన్నమ్మలు కూలిపని చేసి పోషిస్తోంది.’ అంటూ మరో ఇంటి వద్ద అరిసివిల్లి రమణ తన దీనస్థితిని తెలి పారు. పాప కు పాలు కూడా దొరకడం లేదని బర్రి నరసాయమ్మ చెప్పింది. ఇలా ప్రతి చోటా జనం జగన్‌కు తమ ఇక్కట్లను ఏకరవుపెట్టారు. కొట్టుకువచ్చిన మరపడవలను, వలలను జగన్ పరిశీలించారు. భీమునిపట్నంలోని తోటవీధి, గడ్డవీధి, బోయవీధిలో అన్ని ఇళ్లను పరిశీ లించారు. సెయింట్ ఆన్స్ స్కూల్ గ్రౌండ్ తుపానుకు పూర్తిగా దెబ్బతిందని స్కూల్ ఉపాధ్యాయులు చూపించారు. జామ్యా మసీదుకు వెళ్లి ముస్లింలతో జగన్ మాట్లాడారు. తమ ఇళ్లకు వచ్చి  కష్టాలు చూడన్నా అంటూ చిన్నబజార్ కొంకివీధికి చెందిన ప్రజలు జగన్‌ను కోరారు. రాజేంద్రనగర్, తగరపువలస వాసులు కూడా ఇదే విధంగా పట్టుబట్టారు. వారి సమస్యలను జగన్ ఓపిగ్గా విన్నారు. న్యాయం జరిగేంత వరకూ ప్రభుత్వంపై పోరాడతానని, ధైర్యంగా ఉండమని చెప్పారు.

     

    భీమునిపట్నంలో విద్యార్థులు, ఉపాధ్యాయు లు చేస్తున్న  శ్రమదానం కార్యక్రమాన్ని జగన్ పరిశీలించారు. వారితో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా తాను క్షేత్రస్థాయికి వస్తేనే ప్రజలకు ఏం కావాలో తెలుస్తుందని, బాధితులను పట్టించుకోని ప్రభుత్వం తాను రావడం వల్ల పట్టించుకుంటుందనే ఆశతోనే తిరగుతున్నానని చెప్పారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గళం విప్పడంతోపాటు క్షేత్ర స్థాయిలో బాగా వస్తున్నారని, మీ లాంటి వాళ్ల అవసరం ప్రజలకు ఉందని జగన్‌తో విజయనగరం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అధ్యాపకుడు ఆనందకుమార్ అన్నారు. జిల్లాలో ఆరు రోజుల పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లాలో తుపాను బాధి తులను పరా మర్శించేందుకు జగన్ బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్‌నాధ్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తలు కర్రి సీతారామ్, కోలా గరువులు,  చొక్కాకుల వెంకట్రావ్, వంశీకృష్ణయాదవ్, పార్టీ నేతలు అదిప్‌రాజు, కొయ్యప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు, జాన్‌వెస్లి, ప్రసాదరెడ్డి , పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

     

    భీమునిపట్నంలో తుపాను బాధితులను పరామర్శించిన జగన్ ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పారు. వారితో గంటల తరబడి మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకుని కర్తవ్యాన్ని వివరించారు. తోటవీధి, గడ్డడవీధి, బోయవీధిలో ప్రజలతో మమేకమయ్యారు.. ఈ సమయంలో జగన్ వారితో ఏమన్నారంటే... మీరు నేను ప్రతిపక్షంలో ఉన్నాం..అయినా ఎంతో కొంత చేతనయిన సాయం చేస్తాం. ఎంత చేసినా అది తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వానికి ఉండవు. ప్రజలకు నిజంగా సాయం చేయాలనే చిత్తశుద్ధి వాళ్లకు ఉంటే లక్ష కోట్ల రూపాయల బడ్డెట్ ఉంది. పార్టీ తరపున నేనూ సాయం చేస్తాను. ప్రభుత్వం నుంచి సాయం అందేలా గట్టి ప్రయత్నం చేద్దాం. మనమందరం కలిసి న్యాయం కోసం   వచ్చే నెల 5వ తేదీన ధర్నాలు చేద్దాం. అంత వరకూ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చేయడానికి అవకాశం ఇద్దాం. గట్టిగా నిలదీయకపోతే ఏమీ చేయరు.

     

    చేద్దామంటే బయట పనిలేదు. కూరగాయలు రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం 25 నుంచి 50 కేజీలు ఇస్తోంది. అంటే యాభై రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు టీవీల ముందు కూర్చొని చాలా చేసేశామని చెబుతున్నారు. నిజానికి ఆ బియ్యం కూడా స్వచ్ఛంద సంస్థలే ఇస్తున్నాయి. ప్రభుత్వం దగ్గర మానవత్వం తగ్గిపోయి మన్నల్ని పట్టించుకోవడం లేదు.

     నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలి. వీధి వీధిలో చిన్న నష్టం జరిగిన వాళ్ల పేర్లు కూడా పరిహారం జాబితాలో ఉండాలి. వదర వచ్చినప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ నష్టం జరుగుతుంది.

     

     మా అవస్థలు పట్టించుకోలేదు

     మమ్మల్ని పట్టించుకోమంటే ‘మీరు చచ్చిపోలేదుగా, చెట్లు, ఇళ్లేగా పోయాయి. మీరుపోతే వచ్చిండెవాళ్లం’ అని కౌన్సిలరు దారుణంగా మాట్లాడుతున్నాడు. మా అవస్థలు పట్టించుకునే వాళ్లే కరువయ్యారన్నా.

     - ఎస్‌కె సలీం, భీమునిపట్నం, గడ్డవీధి

     

     నువ్వే ఆదుకోవాలి


     ‘‘బాబూ నా పిల్లలకు తండ్రి లేడు. ఉన్న పాక కూలిపోయింది. నాన్న గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నా కూతురు మంగ మెదడుకు ఆపరేషన్ చేయించాను. నేను పెద్దాపరేషన్, మెడకు ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి.’’

     - చెట్టి ఎల్లాయమ్మ, తోటవీధి, భీమునిపట్నం

     

     రేసన్‌కార్డు పోనాది

     ఇల్లు మొత్తం పడిపోనాది. బుక్కులు, రేసన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ కొట్టుకుపోనాయి. బియ్యం ఇవ్వాలంటే రేషన్ కార్డు సూపించమంటున్నారు. గంగలో కలిసిపోయిందాన్ని ఏడ నుంచి తేవాలా..

     - వాసుపల్లి సీతమ్మ, తోటవీధి, భీమునిపట్నం

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top