దేశం తగలడిపోతోంది..!


తెలుగుదేశం పార్టీ నేతల్లో అసంతృప్తులు ఇంకా చల్లారలేదు. ‘అభ్యర్థి ఎవరైనా ఫర్వాలేదు గెలుపు కోసం పని చేస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు తమకు నచ్చినవారిని తీసుకొచ్చారంటూ మూతి ముడుచుకుంటున్నారు. ఇటీవల యలమంచిలిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నేతలు నేడు కనిపించకపోవడం పట్ల నేతల్లో విస్మయం వ్యక్తమవుతుంది. ఇందుకు మునగపాకలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశమే వేదికగా నిలుస్తోంది.

 

 యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి సుందరపు విజయ్‌కుమార్‌కు టిక్కెట్ దక్కని విషయం తెలిసిందే. పెందుర్తి ఎమ్మెల్యేగా పని చేసి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన పంచకర్ల రమేష్‌బాబుకు యలమంచిలి టిక్కెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో బుధవారం మునగపాకలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపి పప్పల చలపతిరావు మినహా ఇతర పెద్దనేతలు ఎవరూ రాలేదు.

 

 పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఆడారి తులసీరావు, లాలం భాస్కరరావు, గొంతిన నాగేశ్వరరావుతోపాటుతాజా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కన్నబాబు సైతం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. పంచకర్లను పరిచయం చేస్తూ నిర్వహించిన మొట్టమొదటి సభకే సీనియర్లు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. వలస వచ్చిన పంచకర్లకు సీటు ఇవ్వడం ఇష్టం లేక సీనియర్లు రాలేదా...లేకుంటే సుందరపు ఎపిసోడ్ ఖరారయ్యేవరకు తమకెందుకులే అని ఊరుకున్నారో తెలియదు కాని మునగపాక సభకు ప్రముఖులు ముఖం చాటేశారు.

 

 ఫలించని బుజ్జగింపులు...

 యలమంచిలి, న్యూస్‌లైన్: యలమంచిలి నియోజకవర్గ దేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడి చివరకు రెబెల్‌గా బరిలో దిగాలని నిర్ణయించుకున్న సుందరపు విజయ్‌కుమార్‌ను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం చేసిన యత్నాలు ఫలిం చలేదు. తనకు టికెట్ కేటాయించాలంటూ  ఆయన మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో అధినేత చంద్రబాబునాయుడు నుంచి పిలుపువచ్చింది. ఆయన నచ్చజెప్పినా విజయ్‌కుమార్ వినలేదని తెలిసింది. యలమంచిలిలో నిరాహారదీక్ష చేపట్టిన సుందరపు విజయ్‌కుమార్ బుధవారం దీక్షను విరమించారు. అనంతరం తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని  ప్రకటించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top