అమానుషం


 ముక్కుపచ్చలారని చిన్నారి. అమ్మానాన్నలతో కలిసి ఆరుబయట ఆదమరిచి నిద్రపోతోంది. ఎక్కడనుంచి వచ్చిందో ఓ మానవమృగం. గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దుర్మార్గుని కామదాహానికి బలై గ్రామ శివారులో రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు అప్పగించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో నాలుగురోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పసికందు గురువారం కన్నుమూసింది. కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల హృదయ వేదన వర్ణనాతీతంగా మారింది.

 

 రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్ : అభంశుభం తెలియని చిన్నారిపై మానవ మృగం దాడి చేసింది. మూడున్నరేళ్లు వయసున్న ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టింది. కామాంధుడి చేతిలో బలైంది. చివరకు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా.. కర్నూలు జిల్లాకు చెందిన శివాజీ ఇరవై సంవత్సరాల క్రితం చిత్తూరుకు వలసవెళ్లి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అక్కడ మంగ అనే మహిళను వివాహం చేసుకుని అక్కడే ఉండేవారు.

 

  వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఐదు నెలల క్రితం రైల్వేకోడూరు పట్టణ సమీపంలో ఉన్న మైసూరువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌కు వచ్చారు. ఇక్కడ విజయ్‌రాజ్ అనే పాత ఇనుప సామాన్ల వ్యాపారుడి దగ్గర పని కుదుర్చుకుని శాంతినగర్‌లో నివాసం ఉండేవారు. కాగా ఈనెల 11వ తేదీ రాత్రి చిన్నారి తన తల్లిదండ్రులతో కలసి ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా వేకువజామున 5 గంటలకు అదృశ్యమయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 అదే రోజు సాయంత్రం చిన్నారిని పొరుగు గ్రామం శివార్లలో గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి లైంగిక దాడికి గురైందని గుర్తించి ఆ రోజు రాత్రి తిరుపతిలోని మెటర్నిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మెటర్నిటీలో వైద్య పరీక్షలు నిర్వహించి 12వ తేదీ మధ్యాహ్నం రుయాలోని చిన్న పిల్లల ఆస్పత్రికి తరలించారు. చిన్నారి న్యూరోజెనిక్ షాక్‌కు గురికావడంతో పాటు తీవ్రంగా ఆందోళన చెందడంతో మెరుగైన వైద్యం కోసం ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. వైద్యం పొందుతూ గురువారం మృతి చెందింది. చిన్నారి మృతితో ఆమె తల్లిదండ్రులు రుయా మార్చురీ వద్ద చేసిన ఆర్తనాదాలు అందరినీ కలచివేశాయి.

 

  ఈ విషయమై ఎస్‌ఐ రామచంద్రను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ ఘటనపై ఈనెల 12వ తేది పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, గురువారం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు శాంతినగర్‌కు షేక్ చాన్‌బాషాను అనుమానిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఈ విషయంపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యుడు సిద్దవరం మురళీధర్‌రెడ్డి జరిగిన సంఘటనపై విచారిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top