మంత్రులు x క్యాడర్‌

కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయం - Sakshi

- కాకినాడ అభ్యర్థుల ఎంపికలో మంత్రుల ఏకపక్ష వైఖరి

రెబెల్‌ అభ్యర్థులను నిలపడంపై బీజేపీ గుర్రు

ముద్రగడ దీక్ష నేపథ్యంలో కాపుల నుంచి అందని సహకారం

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపట్ల వివిధ వర్గాల్లో వ్యతిరేకత 

 

కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతిక కారణాలు చూపించి ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. నోటిఫికేషన్‌ జారీ అయిన తరువాత ఎన్నికలు నిలుపుదల చేసే అవకాశాలు లేవని బుధవారం హైకోర్టు తీర్పునివ్వడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఇక అభ్యర్థుల ఎంపికలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావులు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) అభిప్రాయాలకు ప్రాతినిథ్యం ఇవ్వలేదు. మేయరు అభ్యర్థిగా జ్యోతుల ఇందిరను మొదటి నుంచి ఎమ్మెల్యే వనమాడి ప్రతిపాదిస్తున్నారు.



ఇందుకు అనుగుణంగా 40వ డివిజన్‌లో ఆమె ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే మంత్రి యనమల రామకృష్ణుడు వర్గానికి చెందిన సుంకర శివప్రసన్నకు (భర్త తిరుమలకుమార్‌) సీటు ఖరారు చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన జ్యోతిల ఇందిరకు ఆ డివిజన్‌ కాకుండా మరో డివిజన్‌ కేటాయించడంతో ఆమె పోటీ నుంచి విరమించుకున్నారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కొండబాబుకు ముగ్గురు మంత్రులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలో ఆ వర్గానికి 20 వేల వరకు ఓట్లున్నాయి.



వారంతా తమ సామాజికవర్గ నాయకుడైన ఎమ్మెల్యే కొండబాబుకు ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచార కార్యక్రమంలో కూడా ఆయన అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించి ఆ తరువాత మూడు డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా రెబల్స్‌గా బరిలో నిలిచారు. దీనిపై బీజేపీ నేతలు స్థానిక టీడీపీ నేతల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. మంత్రులను సంప్రదించేందుకు కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ఇన్‌చార్జి, విశాఖ రూరల్‌ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రయత్నించినా వారెవరూ స్పందించకపోవడంతో ఆ పార్టీ జాతీయ అ«ధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 

చంటిబాబు రాజీనామాతో...

పార్టీ ఆపద సమయంలో మెట్ట కేంద్రమైన జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ను నిలబెట్టిన ఏలేరు ప్రాజెక్టు చైర్మన్‌ జ్యోతుల చంటిబాబుకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా, అతనిపై పోటీ చేసిన వరసకు చిన్నాన్న అయిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌ను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ జ్యోతుల చంటిబాబు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఓ వైపు ఎమ్మెల్యే కొండబాబు, మరో వైపు మెట్ట ప్రాంతానికి చెందిన చంటిబాబులకు జరిగిన పరాభవాలు ఆ పార్టీ క్యాడర్‌ జీర్ణించుకోలేకపోతోంది.



టీడీపీ ఆవిర్భావం నుంచి ఇంత వరకూ కాకినాడ కార్పొరేషన్‌ మేయరు పీఠం ఆ పార్టీకి దక్కలేదు. గతంలో పార్టీకి మంచి ఊపున్నప్పుడే టీడీపీ మేయరు దక్కించుకోలేకపోయింది. అప్పటినుంచి కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ కార్పొరేషన్‌ను ఏలుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ దఫా కూడా తమకు పరాభవం తప్పదనే భావంలోనే క్యాడర్‌ ఉంది. ఈ సెంటిమెంట్‌ భయం వారిని వెన్నాడుతోంది. ఈ పరిణామాలన్నీ టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది.

 

కాపు సెగ.. దళితుల నిరసనలు..

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాపు సామాజికవర్గం కీలకంగా ఉంది. జిల్లాకు చెందిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా, 24 రోజులుగా గృహనిర్బంధంలో ఉంచడంపై ఆ సామాజికవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. వీరు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డిలు దళితుల పట్ల వ్యవహరించిన తీరు ఆ సామాజిక వర్గంలో చర్చనీయాంశమైంది. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని గతంలో సీఎం వ్యాఖ్యలు చేయగా... ఎస్సీలు శుభ్రంగా ఉండరు.. చదువుకోరని తాజాగా మంత్రి ఆది చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ నంద్యాలలో ఆయన అభిమానిపై చేసిన వీరంగం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో యువతలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top