పీబీసీకి ఏటా అన్యాయమే

పీబీసీకి ఏటా అన్యాయమే - Sakshi


అనంతపురం కలెక్టర్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ  

పులివెందుల :
పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలోని రైతులకు ప్రతి ఏడాదీ అన్యాయమే జరుగుతోందని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగు నీటిని పూర్తి స్థాయిలో కోటా మేరకు సరఫరా చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు లేఖ రాశారు. (తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని కోటా మేరకు అనంతపురం అధికారులు పీబీసీకి విడుదల చేస్తారు) ఈ సందర్భంగా ఆయన పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన పలు విషయాలను లేఖలో పొందుపరిచారు.



సీబీఆర్, పీబీసీకి నీరు విడుదలయ్యే ప్రాంతాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్ కెనాల్‌కు చివరి భాగంలో ఉన్నాయని, పీబీసీ ద్వారా 55,579 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. అయితే ఐదేళ్లుగా సాగు నీరు అరకొరగా సరఫరా చేస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు సంప్రదాయ పంటలను పండించడం మాని, పండ్ల తోటలను సాగు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీరు అడుగంటి చీనీ చెట్లు ఎండిపోయాయన్నారు.



దీంతో తాగునీటికి కూడా కొరత ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలోని సాగు, తాగునీటికి 2015-16 సంవత్సరానికి 3.23టీఎంసీలు కేటాయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కేటాయించిన నీరు మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు రావాల్సి ఉందన్నారు. మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు 98 కిలోమీటర్లు నీరు పారే సమయంలో ఆవిరి, ఇంకిపోవడం వల్ల దాదాపు 45 శాతం నీటిని నష్టపోతున్నామని వివరించారు.

 

పీబీసీకి కేటాయించిన నీటిని ఇతర ప్రాంతాల ప్రజలు ఆక్రమంగా వాడటం వల్ల నియోజకవర్గంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ప్రవాహ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విడతల వారీగా కాకుండా నీటిని ఒకేసారి వదలాలని తాను గతంలోనే కోరానన్నారు. సీబీఆర్‌కు సంబంధించి ప్రతి ఏడాది తాగునీటి అవసరాలకు 1.73 టీఎంసీల స్థిర జలాలు కేటాయించాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన దృష్ట్యా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.



మిడ్ పెన్నార్ వద్ద 1.82 టీఎంసీల నీటిని విడుదల చేస్తే సీబీఆర్‌కు వచ్చేసరికి ఒక టీఎంసీ మాత్రమే చేరుతోందన్నారు. తుంపెర్ డీప్‌కట్ వద్ద సీబీఆర్ ప్రవేశం దగ్గర నీటి ప్రవాహ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. వాటర్ రీడింగ్ స్కేలు క్రాస్‌గా ఉండటం వల్ల 20 శాతం నీటిని నష్టపోతున్నామన్నారు. అందువల్ల మిడ్ పెన్నార్ నుంచి 4.97 టీఎంసీల నీటిని సీబీఆర్, పీబీసీలకు విడుదల చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top