ఉన్న జాబు పాయె!


డీఎస్సీ మినహా మరే ఉద్యోగాలకు విడుదల కాని నోటిఫికేషన్

రోజు రోజుకూ పెరుగుతున్న నిరుద్యోగులు

ఇంటింటికీ ఉద్యోగ హామీ అటకెక్కినట్లే

నిరుద్యోగ భృతి ఊసేలేని వైనం

నమ్మించి మోసం చేశారని బాబుపై నిరుద్యోగుల మండిపాటు


 

ఏరుదాటేదాక ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత అక్షరాల చంద్రబాబుకు అతికినట్లు సరి పోతుందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ప్రజల నెత్తిన హమీల వర్షం కురిపించి.. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊరూ వాడా ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంటే కిమ్మనడం లేదని వాపోతున్నారు. ఉద్యోగాలు రాని యువకులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు ఇపుడు ఆ ఊసెత్తక పోవడం ఆందోళన కలిగించే పరిణామం.





పెరుగుతున్న నిరుద్యోగులు

జిల్లాలో రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక పక్క చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఎంప్లాయిమెంట్ కేంద్రంలో సుమారు 75 వేల మంది నిరుద్యోగులు పేరు నమోదు చేసుకున్నారు. పేరు నమోదు చేసుకోని వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఉంటుంది. వీరందరూ చంద్రబాబుపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. ఆయన గెలిచి అధికారంలోకి వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని గంపెడాశతో ఎదురు చూశారు.



ఒకవేళ ఉద్యోగం రాకున్నా నిరుద్యోగ భృతి వస్తుందని భావించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ మినహా మరో ఉద్యోగానికి ప్రకటన వెలువడని పరిస్థితి నెలకొంది. పైగా హౌసింగ్‌లో వర్క్ ఇన్స్‌క్టర్లుగా పనిచేస్తున్న వారితో పాటు ఆదర్శ రైతులను తొలగించారు. కొన్ని శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులనూ తొలగించారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితిలో పని చేస్తున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top