బాబుకు పవరు.. జాబుకు ఎసరు


సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘జాబు’ కావాలంటే ‘బాబు’ రావాలని ప్రచారం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊరించారు. గంపెడాశలతో ఓటేసి చంద్రబాబును అధికారంలోకి తెస్తే ఇప్పుడు కొత్త జాబులు రావడం మాట దేవుడెరుగు.. ఉన్న జాబులే ఊడబీకేశారని రోడ్డునపడ్డ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

 

 విభజన తరువాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఇందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఎక్కడబడితే అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, బ్యానర్లు, గోడలపై రాతలు గుప్పించారు. ప్రసంగాలతో హోరెత్తించారు. తీరా ఈ ఏడాది కాలంలో జిల్లాలో కొత్తగా ఉద్యోగాలేవీ  కల్పించ లేకపోయారు. ఉన్న ఉద్యోగాలు మాత్రం లేకుండా చేసి తమ కుటుంబాలను రోడ్డు పాల్జేశారని తొలగింపునకు గురైన ఉద్యోగులు మండిపడుతున్నారు.

 

 చిరుద్యోగులతో చెలగాటం..

 జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 వేల మంది పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో అత్యధికంగా వైద్య ఆరోగ్యశాఖలో 6 వేల మంది పైబడి ఉన్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థలో వెయ్యి మంది పైమాటే. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 400 మంది, వ్యవసాయశాఖలో 200 మంది, ఖజానా శాఖలో 100 మంది, రెవెన్యూ శాఖలో 78 మంది, మత్స్య, ఇరిగేషన్ తదితర శాఖలు..ఇలా దాదాపు అన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులతోనే నెట్టుకువస్తున్నారు. రోస్టర్ పాయింట్ సరిగా లేదనే సాకుతో జిల్లాలో 227 మంది అంగన్‌వాడీలను ప్రభుత్వం తొలగించింది.

 

 దీనిపై ఉద్యోగులు పట్టువీడని విక్రమార్కుల మాదిరి నెల రోజులు ఆందోళనతో పాటు కోర్టుకు వెళ్లి ఉద్యోగాలను తిరిగి తెచ్చుకున్నారు. గృహనిర్మాణ శాఖలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న 147 మందిని ప్రభుత్వం తొలగించింది. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగాలనైనా ఉంచుతారో, ఇంటికి పంపించేస్తారో తెలియని అయోమయం ఉద్యోగులను వెంటాడుతోంది. జిల్లాలో ఇంత మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలనే కుట్రకు తెరతీసి చంద్రబాబు సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం జాబులు ఇవ్వలేకపోయింది. ఉద్యోగుల తొలగింపు విషయంలో జిల్లాలోని వామపక్షాలు, ఇతర ఉద్యోగ సంఘాలు సమన్వయంతో ముందుకు కదిలేందుకు సిద్ధమవుతున్నాయి.

 

 ఏ కొలువుకూ లేని భరోసా..

 ఎన్నికల హామీలను విస్మరించి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న వారిని తొలగిస్తామని సర్కార్  చెప్పుకుంటూ వస్తోంది. ఉద్యోగ సంఘాల ఆందోళనల ఫలితంగా తొలగించిన ఉద్యోగులను తొలుత గత డిసెంబరు వరకు కొనసాగించారు. గడువు ముగిసిపోయి రోడ్డున పడతామని ఉద్యోగులు రోడ్డెక్కడంతో మరోసారి గత మార్చి, తాజాగా సెప్టెంబరు వరకు పొడిగింపునిచ్చారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్‌లు, చెక్‌పోస్టులు, రైతు బజార్‌లలో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న సెక్యురిటీ గార్డులను పర్మనెంట్ చేస్తామని చెబుతూ వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 ఇప్పుడు ఆ ఉద్యోగాలకైనా భరోసా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్న ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అయోమయం కొనసాగుతుండగా ఉపాధి కార్యాలయాల్లో ఈ ఏడాదిలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో ఎందరికి ఉద్యోగాలు కల్పించారంటే వారి వద్ద సమాధానం లేదు. 2014 డిసెంబర్ నాటికి 81,264 మంది నిరుద్యోగ యువత జిల్లా ఉపాధి కార్యాలయంలో పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 3,900 మంది పైమాటే. మరోవైపు సర్కార్ ఉన్న ఉద్యోగులను తొలగించే కుట్రలు చేస్తూ మరోపక్క కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు.

 

 అన్యాయంగా రోడ్డున పడేశారు..

 తొమ్మిది సంవత్సరాలుగా గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బడ్జెట్ లేదని విధుల నుంచి తొలగించి అన్యాయంగా రోడ్డున పడేశారు. వివిధశాఖలలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించేందుకు ఇచ్చిన జీవోలను మాకు వర్తింప చేయాలి. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలి

 - ఐ.చినబాబు, జిల్లా అధ్యక్షుడు, గృహనిర్మాణ సంస్థ

 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top