జాబు లేదు.. భృతి లేదు

జాబు లేదు.. భృతి లేదు


‘మేం అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతి కల్పిస్తాం’, ..‘జాబు రావాలంటే బాబు రావాలిఅంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వారి ఊసే పట్టించుకోలేదు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికి..వీధులపాలు చేశారు. చంద్రబాబు హామీలు నమ్మి ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూసిన వేలాది మంది యువత సర్కారు వైఖరిపై రగిలిపోతున్నారు. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్న ఉపాధి కోల్పోయి పూటగడవని కుటుంబాలు ఆందోళనబాట పడుతున్నాయి.

 

* జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 60 వేల మంది నిరుద్యోగులు

* వాస్తవ సంఖ్య అంతకు నాలుగింతలు...

* ఉన్న ఉపాధీ కోల్పోయి వీధిన పడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు

* ఉపాధి కోసం యువత ఎదురుచూపులు

* అమలు కాని సీఎం హామీలు

* ఊసేలేని నిరుద్యోగ భృతి


 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. జాబు రావాలంటే బాబు రావాలి అని ఎన్నికల ముందు ప్రకటనలతో హడావిడి చేశారు. చంద్రబాబునాయుడు కూడా ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానంటూ హామీల వర్షం కురిపించారు. చంద్రబాబునాయుడి పాలన వచ్చి ఏడాది అయిన తర్వాత చూసుకుంటే కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది.



అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు. జిల్లాలో సుమారు 1040 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బాబు నిర్ణయంతో రోడ్డున పడ్డారు. వచ్చీరావడంతోనే గ్రామాల్లో ఉన్న ఆదర్శ రైతులను తీసేశారు.



వ్యవసాయ విస్తరణ అధికారులను తొలగించారు. అలాగే ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్‌లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీలేవంటూ మిమ్మల్ని భరించలేమని అవుట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా  లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5 వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు.

 

వైద్యవిధాన పరిషత్‌లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంక్షేమ హాస్టల్స్‌లో అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టులో పనిచేస్తున్న కుక్‌లు, ఇతర సిబ్బందిని టె ర్మినేట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. స్కూల్స్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను తొలిగించి వారి స్థానంలో ఉన్న  టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.



జిల్లాలో ఒంగోలు, కందుకూరుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాలకు వేలాది మంది నిరుద్యోగులు హాజరవుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగాలకు కూడా ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్లు  హాజరవుతున్నారంటే నిరుద్యోగ తీవ్రత ఎంత ఉందో అర్థమవుతోంది. అనేక మంది నిరుద్యోగులు ఫైళ్లు పట్టుకొని బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలాంటి మహానగరాలల్లోని కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు.

 

నిరుద్యోగులు 60 వేలేనట!

జిల్లాలో నేటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 60 వేలమందికిపైగా నిరుద్యోగులున్నారు.  ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకాలు సన్నగిల్లడంతో ఉపాధి కార్యాలయాల్లో నమోదు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  వాస్తవానికి  జిల్లా ఉపాధి కార్యాలయాల్లో  పేర్లు నమోదు చేసుకున్న వారి కంటే కనీసం మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంటారని అంచనా. గతంలో 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని విధిగా  జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ  పేర్లు నమోదు చేసుకునేవారు.



ఇప్పుడు పూర్తిగా మానివేశారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ  కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లు రావడం లేదు. ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, నియామకాలు జరుగుతాయన్న నమ్మకం లేదు. స్కూల్ అసిస్టెంట్లను ఎస్‌జీటీలోకి అనుమతించాలనే విషయమై తేల్చకుండా డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. ఈ విషయమై అభ్యర్థులు కోర్టుకెళతారన్న విషయం తెలిసి కూడా కావాలనే డీఎస్సీ పరీక్ష నిర్వహించారనే ప్రచారం ఉంది.

 

నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మేనిఫెస్టోలో ఐదో వాగ్దానంగా టీడీపీ అధినేత చంద్రబాబు పొందుపరిచారు. జిల్లాలో అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా ఈ ఏడాది కాలానికి గాను రూ.144 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే సీఎం ఎత్తడం లేదు.

 

బాబు వస్తే జాబు పోయింది

నేను ఆదర్శ రైతును. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులందరినీ తొలగించారు. దీంతో ద్వారా మేము రోడ్డున పడ్డాం. అప్పుల పాలయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు పాలనలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది.

- వెన్నపూస మాలకొండయ్య, పీసీపల్లి

 

ఉన్న ఉద్యోగం తీసేశారు

నేను ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాణ్ణి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన త ర్వాత ఉద్యోగం తీసేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి అధికారం లోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాదాపు ఏడుగురిని తొలగించారు.                           

- బాబూరావు, చీరాల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top