జలగండం

జలగండం

  • వర్షాభావ పరిస్థితుల్లో ‘అథః’పాతాళానికి చేరిన గంగ

  •  52 మండలాల్లో ప్రమాదకర స్థితికి చేరిన భూగర్భ జలమట్టం!

  •  ఇప్పటికే 65 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయిన దుస్థితి

  •  1,468 గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న వైనం

  •  నెలకు 0.85 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేస్తున్న జనం

  •  వేసవిలో తాగునీటికి ఇక్కట్లు తప్పవని అధికారుల ఆందోళన

  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. వర్షాకాలంలోనే ఇలా ఉంటే వేసవి వచ్చేనాటికి నీటి ఎద్దడి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే జనం భయపడుతున్నారు. జిల్లా సగటు వర్షపాతం 918.1 మిల్లీమీటర్లు. పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుం ది. ఐదేళ్లుగా నైరుతి రుతుపవనాల ప్రభావం బలహీనంగా ఉండడం వల్ల సగటు వర్షపాతం నమోదు కాలేదు.



    ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తూర్పు మండలాల్లో కాస్తోకూస్తోనైనా వర్షం కురుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి సగటున 439.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. కేవలం 271.4 మిమీల మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో సాగు, తాగునీటి కోసం 90 శాతం మంది ప్రజలు భూగర్భ జలాలపైనే ఆధారపడతారు.



    మన జిల్లాలో 2.85 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తాగునీటి, సాగునీటి బోరు బావుల నుంచి ప్రతి నెలా సగటున 0.85 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేస్తున్నారు. కానీ.. వర్షం ఆ మేరకు కురకపోవడం లేదు.  ఇది భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని రీతిలో 17.68 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోవడం గమనార్హం.

     

    52 మండలాల్లో ఆందోళనకరం



    భూగర్భజలమట్టం 52 మండలాల్లో ఆందోళన కలిగించే రీతిలో పడిపోయింది. మదనపల్లె డివిజన్‌లోని 31 మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏ ఒక్క మండలంలోనూ 25 మీటర్ల కన్నా తక్కువ లోతులో భూగర్భజలాలు లభించకపోవడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో భూగర్భజలమట్టం ఏకంగా 33.78 మీటర్లకు పడిపోయింది. తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో భూగర్భజలమట్టం ప్రమాదకర స్థితికి చేరుకుంది.



    ఈ నియోజకవర్గాల్లో 1200 అడుగుల లోతుకు బోరు బావిన తవ్వితేగానీ నీళ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పు మండలాల్లో సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మాత్రమే భూగర్భజలాలు ఆశించిన రీతిలో అందుబాటులో ఉన్నాయి. భూగర్భజలమట్టం అథఃపాతాళానికి చేరడంతో ఫ్లోరైడ్ భూతం వికటాట్టహాసం చేస్తోంది. పశ్చిమ మండలాలతోపాటు తూర్పు ప్రాంతంలోని 11 మండలాలపై ఫ్లోరైడ్ భూతం పంజా విసురుతోందని అధికారిక గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి.

     

    వేసవిని తలపిస్తున్న నీటి ఎద్దడి



    జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల వందలాది మంచినీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలో 1,468 గ్రామాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మరో 242 గ్రామాల్లో వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. మరో వెయ్యికిపైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.



    వర్షాభావ పరిస్థితుల రాజ్యమేలుతుండడం.. ప్రతి నెలా సగటున 0.85 మీటర్ల మేర భూగర్భజలాలు తోడేస్తుండడం వల్ల జిల్లాలో భూగర్భజలాలు 17.68 మీటర్లకు పడిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 65 వేలకుపైగా సాగు, తాగునీటి బోరు బావులు ఎండిపోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇదే రీతిలో నెలకొంటే మార్చి నాటికి 22.78 మీటర్లకు భూగర్భజలమట్టం పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.



    అదే జరిగితే మరో లక్షకుపైగా బోరు బావులు ఎండిపోయే అవకాశం ఉందని.. 50 శాతానికిపైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వేసవిలో గుక్కెడు తాగునీటి కోసం వేలాది గ్రామాల్లో యుద్ధాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top