ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సర్కారు


* ‘రాజధాని - రైతు’ చర్చావేదికలో ధ్వజమెత్తిన అన్నదాతలు

* ప్రజాభిప్రాయం తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి

* చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలి

* విజయవాడ, గుంటూరు నగరాల్లో ఖాళీగా ఉన్న భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

* భూములిచ్చేందుకు తుళ్లూరు మండల రైతులు సిద్ధంగా ఉన్నారన్న నేతలు
  సాక్షి, గుంటూరు: ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయం సేకరించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని పలువురు వక్తలు, రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలోగల ఒక కల్యాణమండపంలో గురువారం ‘రాజధాని-రైతు’ అంశంపై ఫ్యాక్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జంప కృష్ణకిషోర్ నేతృత్వంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, ప్రముఖులు, రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

 

 ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో రైతులను గందరగోళంలోకినెట్టి భూసమీకరణ జరపాలని చూడడం సమంజసం కాదని, రాజధానిగా మారిన తరువాత వచ్చే ఇబ్బందులు ముందుగానే గ్రహించి చర్యలు చేపట్టాలని, అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం కల్పించేలా ముఖ్య కార్యాలయాలు, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా చూడాలని ఈ సందర్భంగా తీర్మానించారు. రాజధాని ఎన్ని ఎకరాల్లో నిర్మాణం అవుతుందో, రైతులకు ఎలాంటి ప్యాకేజీలు ఇస్తారో వెల్లడించాలనీ, చట్టాలు చేసిన తరువాత మాత్రమే భూ సమీకరణ జరపాలని తీర్మానించారు. ఒకవైపు విద్యుత్ కాలుష్యం, మరోవైపు రాజధాని కాలుష్యం కృష్ణా నదిలో కలిస్తే పర్యావరణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.

 

 విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఖాళీగా ఉన్న భవనాల్లో ప్రభుత్వం నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజధాని నిర్మించేలా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఎక్కువ మంది రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఉండటంతో అనుకూలంగా రైతులు అభిప్రాయం వెల్లడించినప్పుడల్లా కొంతసేపు గందరగోళం నెలకొంది.  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి కలుగజేసుకొని చర్చావేదికలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పవచ్చని, వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలకు దిగవద్దంటూ సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం, భూ సమీకరణపై రైతుల్లో అనేక అపోహలు, అనుమానాలు, సందేహాలు ఉన్నాయని చెప్పారు. భూమిని సమీకరించాల్సి వస్తే వాటిని కోల్పోయేవారితోపాటు, రైతు కూలీలు, చేతివృత్తుల వారికి కూడా నష్టం జరగకుండా ఉండేందుకు 2012లో భూసేకరణచట్టం తయారు చేసి 2014 జనవరి 1 నుంచి అమలులోకి తెచ్చారని చెప్పారు. రాజధాని అవసరం ఎంత ఉందో, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

భూములిచ్చేందుకు రైతులు సిద్ధం

 రైతులకు, భూములకు గతంలో ఉన్న అనుబంధం ఇప్పుడు కనిపించడం లేదని, చాలామంది వ్యవసాయాన్ని వదిలిపెట్టేందుకు, రాజధాని నిర్మాణానికి సుముఖంగా ఉన్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. తుళ్ళూరు మండలంలో పంటలు పండక అనేకమంది రైతులు అప్పుల పాలయ్యారని, ఈ నేపథ్యంలో రాజధానికి భూములు ఇచ్చేందుకు అనేక గ్రామాల ప్రజలు అంగీకారం తెలిపారని తుళ్ళూరు మండల రైతు సంఘ నాయకుడు పువ్వాడ సుధాకర్ చెప్పారు. మరో రైతు నాయకుడు జొన్నలగడ్డ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తాము రాజధానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ప్రభుత్వం ఏ మేరకు ప్రతిఫలం అందిస్తుందో తెలుసుకునేందుకు ఇలాంటి చర్చావేదికలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పలువురు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, పలు చేతి వృత్తుల వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.  

 

రాజధాని తరలిస్తే గ్రామం తరఫున రూ.25 కోట్లు ఇస్తాం

ఇక్కడ సింగపూర్ వంటి నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అటువంటిది ఏమీ వద్దు. రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే మా గ్రామం తరఫున రూ. 25 కోట్లు చంద్రబాబుకు ఇస్తాం. మేము ఇక్కడ పది రకాల పంటలు పండిస్తున్నాం. హాయిగా జీవిస్తున్నాం. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ బలవంతంగా భూములు లాక్కొని రాజధాని నిర్మించాలంటే మా శవాలమీద కట్టుకోమనండి.     

 - బత్తుల జయలక్ష్మి,

 మహిళా రైతు, నిడమర్రు

 

భూసమీకరణపై మంత్రులు తలోమాట: శివాజీ

 మంత్రులు భూసమీకరణపై తలా ఒక మాట మాట్లాడుతున్నారని, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదని ముఖ్య అతిథి, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేసి రైతుల భూమిని సమీకరించేందుకు చూస్తున్నారని విమర్శించారు.  విజయవాడ, గుంటూరు జిల్లాల్లో 10 లక్షల అడుగుల భవనాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి నడపవచ్చని సూచించారు. విజయవాడ నగరాన్ని రాజధాని చేస్తామంటూ చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదని, కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని రైతు సంఘం నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన భూమిగా పేరొందిన భూములను రాజధానికి తీసుకోవడం సరికాదన్నారు. అభిప్రాయం చెప్పేందుకు సీఎం వద్దకు వెళుతున్న రైతులను బస్సుల్లో నుంచి దింపడం, ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టడం మంచిది కాదని డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ కొలనుకొండ శివాజీ మండిపడ్డారు.  కొందరు మంత్రులు కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరన్నట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top