సవాలక్షసందేహాలు

సవాలక్షసందేహాలు - Sakshi

  • స్పష్టత లేని రుణమాఫీ ప్రకటన

  •  రూ.లక్షన్నర మాఫీకి ఆధార్ లింకు

  •  అర్హులైన రైతులెవరో తెలియని అధికారులు

  •  అయోమయంలో డ్వాక్రా సంఘాలు

  • రుణమాఫీపై ఎట్టకేలకు ప్రభుత్వం నోరు మెదిపింది. రైతుకు రూ.లక్షన్నర, డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. రైతులు, డ్వాక్రా సంఘాల్లో మరింత గందరగోళం నెలకొంది. సవా‘లక్ష’ సందేహాలను సృష్టిస్తోంది. త్వరగా మాఫీ చేయకపోతే సీజన్ ముగిసిపోతుంది. కొత్త రుణాలకు దారి మూసుకుపోతుంది. ఇవేవీ స్పష్టం చేయకపోవడమే చంద్రబాబు చాణక్యం. ప్రభుత్వంపై మండిపడుతోంది రైతాంగం.

     

    విశాఖ రూరల్: తాంబూలాలిచ్చేసాం.. తన్నుకు చావండన్నట్టుంది ప్రభుత్వ తీరు. రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించేసి చేతులు దులిపేసుకుం ది. అందుకు అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాలు విషయాన్ని విస్మరించింది. నిధుల సమీకరిం చా క రుణ మాఫీ జరుగుతుందని చె ప్పిన ప్రభుత్వం ఎప్పట్లోగా అమలవుతుందో చెప్పలేదు. రుణ మాఫీ జరిగితే తప్ప ఖరీఫ్‌కు కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాల్లేవు. ఈలోగా సీజన్ ముగిసి పోతుంది. దీనివల్ల రైతు లు మేలు జరగకపోగా మరింత నష్టం జరుగుతుంది.

         

    రుణ మాఫీపై ప్రభుత్వ ప్రకటనలు మినహా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు, విధివిధానాలు రా లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో రూ.లక్షన్నరలోపు రుణాలు ఎంతమంది పొందారన్న సమాచారం అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. రుణమాఫీ వల్ల ఎందరికి లబ్ధి చేకూరుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాష్ర్ట స్థాయిలో బ్యాంకర్ల నుంచి తీసుకున్న సమాచారాన్ని కూడా జిల్లా అధికారులకు అందించడం లేదు. దీంతో రుణమాఫీపై వారు నోరు మెదపడం లేదు.

     

    అనేక అనుమానాలు



    రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణాలు, ప్రతి డ్వాక్రా సంఘానికి రూ.లక్ష వరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందులో స్పష్టత లేకపోవడంతో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబంలో ఒకరికా లేదా కుటుంబం మొత్తం మీద రూ.లక్షన్నర వరకు మాఫీ జరుగుతుందా అన్న గందరగోళం నెలకొంది.

         

    జిల్లాలో గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి రూ.1040 కోట్ల రుణాలు అందించారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణ లక్ష్యంగా కాగా 1,32,375 మందికి రూ.640 కోట్ల రుణాలు అందజేశారు. గత రబీ సీజన్‌లో రూ.200 కోట్ల లక్ష్యానికి 14,548 మంది రైతులకు రూ.104 కోట్ల రుణాలు మంజూరు చేశారు.

         

    గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్ల వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్ల వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణా మాఫీ మొత్తంగా రూ.1040 కోట్లు కూడా రద్దవుతాయని రైతులు భావించారు.

         

    {పస్తుతం రూ.లక్షన్నర అని మెలిక పెట్టి, ఇందుకు ఆధార్ లింక్ పెట్టాలన్న నిర్ణయం ఇబ్బందికరంగా మారే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఎప్పటికి చేస్తారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. ఈలోగా కొత్త రుణాల మాటేమిటో కూడా చెప్పలేదు. ఎర్రచందనం అమ్మకాలు, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు సమీకరించుకొనేలాగా ఖరీఫ్ పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈలోగా కొత్త రుణాలు అందించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

     

    డ్వాక్రా రుణాల పరిస్థితి అంతే



    జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లున్నాయి. జీవీఎంసీ పరిధిలో 18,500 మహిళా స్వయం సహాయ సంఘాలు రూ.260 కోట్లు మేర చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పరిధిలో 37,634 మహిళా సంఘాలు బ్యాంకులకు రూ.593 కోట్లు బకాయి పడ్డాయి. ఇందులో రూ.లక్షలోపు రుణాలు పొందిన సంఘాలు కేవలం 9758 ఉన్నాయి. మిగిలిన సంఘాలు మాత్రం రుణాలు చెల్లించాల్సి ఉంటుంది.

         

    ఎన్నికలకు ముందు చంద్రబాబు రుణ మాఫీ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలు రుణాలు చెల్లించలేదు. తాజాగా కేవలం రూ.లక్షలోపు రుణం తీసుకున్న సంఘానికే రుణాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో మిగిలిన సంఘాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రుణాలు చెల్లించని సంఘాలకు నోటీసులు జారీ చేసేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. పాత రుణాలు చెల్లించేంత వరకు కొత్తవి మంజూరు చేసేది లేదని తేల్చి చెప్పాయి.

         

    ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాస్తవానికి జూన్ నెలాఖరు నాటికే రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 3 వేల సంఘాలకు రూ.24 కోట్ల రుణాలు అందించారు. రుణాల మాఫీ ఎంత ఆలస్యమైతే మహిళలకు కొత్త రుణాల మంజూరుకు కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది.

     

     హామీలిచ్చేముందు తెలీదా

     బకాయిలు చెల్లించి కొత్తరుణాలు తీసుకోవాలని మం త్రులు చెప్పడం విడ్డూరం. పుస్తెలతాడు తాకట్టు పెట్టి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయాం. అప్పుల గురించి తెలుసుకోకుండానే చంద్రబాబు హామీ ఇచ్చారా?

     - రేవడి రాజు, మార్టూరు, అచ్యుతాపురం

     

     వైఎస్ చేసి చూపించారు

     రుణమాఫీ కొత్త విధానమేమీ కాదు. గతంలో వైఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. చంద్రబాబు అన్నమాట ప్రకారం మాఫీ చేయాలి. అంతేతప్ప అప్పు తీర్చేసి కొత్త అప్పులు తీసుకోమనడం సమంజసం కాదు.

     -ఏడిద మూదయ్య, మార్టూరు, అచ్యుతాపురం  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top