తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం


పంచాంగ శ్రవణం

తిరుమల:  శ్రీ హేమలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానం  నిర్వహించారు. వేకువజాము 3 గంటలకు సుప్రభాత సేవతోనే ఉగాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వైదిక పూజల తర్వాత ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర‍్వహించారు.



ఆస్థానం.. పర్వదినాల్లో ప్రత్యేకం

ఉగాది, శ్రీరామ నవమి, దీపావళి వంటి పర్వదినాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా తిరుమల ఆలయంలో ప్రత్యేకంగా ‘ఆస్థానం’ ఉత్సవాలను కన్నుల పండవలా  నిర్వహించడం ఆనవాయితీ.



► ఈ తెలుగు పండుగ ఉగాది రోజున తొలివేకువలోనే  శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప, విష్వక్సేనులవారికి వేర్వేరుగా ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి , పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదించారు.



► తర్వాత ఆరు నూతన పట్టువస్త్రాలతో ఊరేగింపు నిర్వహించారు. వాటిలో నాలుగు నూతన వస్త్రాలను గర్భాలయ మూలమూర్తికి.. కిరీటం, నందక ఖడ్గం, మాల, ఉత్తరీయంగా సమర్పించారు. అనంతరం మరో రెండు పట్టువస్త్రాల్లో మలయప్ప, విష్వక్సేనులవారికి సమర్పించారు.



► అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగానే శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్తాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేసారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర  ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపించారు.

‘‘ ఓ స్వామీ!! వేంకటాచలపతి. ముక్కోటి నమస్కారాలు. ఈ నూతన సంవత్సరంలో మరింత దయాతరంగులై భక్తుల పాపాలు పొగొడతారు. సకల సంపదలు కలిగిస్తారు. శుభ పరంపరలు గుప్పిస్తారు. మీ అనుగ్రహం చేత మీ కనుసన్నల్లో మెలిగే నవగ్రహదేవతుల అందరూ తమ భక్తుల్ని కాపాడతారు. రక్షిస్తారు. దేశమంతా సస్యశ్యామలమై వర్థిల్లుతుంది. అందుకే స్వామీ! ఈ సంవత్సరం లక్షలాది మంది భక్తులు మీ దర్శనం కోసం అర్రులుచూస్తూ తిరుమలయాత్ర చేస్తారు.  మీ భక్తులు సర్వవేళల్లో, సర్వదేశాల్లో రక్షింప బడతారు.’’ అంటూ సిద్దాంతి పంచాంగ శ్రవణం చేస్తుండగా స్వామివారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు.



ఇలా ఆస్థానంలో  ఆగమోక్తంగా   వైదిక ఆచారాలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయంగార్లు, అర్చకులు, ఆలయ అధికారులకు ప్రత్యేకంగా శఠారీ మర్యాదలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top