సామాజిక హోదా కోసం ఉద్యమిద్దాం

సామాజిక హోదా కోసం ఉద్యమిద్దాం


అనంతపురం టవర్‌క్లాక్ :

 అగ్రవర్ణాలతో సమానంగా సామాజిక హోదా కోసం ఐక్యతగా ఉద్యమిం చాలని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. లలిత కళాపరిషత్‌లో ఆదివారం నిర్వహించిన వడ్డెర్ల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కార్యక్రమానికి వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవళ్ల మురళి అధ్యక్షత వహించారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మె ల్యే అబ్దుల్‌ఘని, పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథి, మేయరు స్వరూప  హాజరయ్యారు. అంతకుముందు వడ్డెర్లు లలిత కళాపరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.



సభలో కాలవ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కారణంగానే ఆయా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా గుర్తించి వడ్డెర్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారన్నారు. వడ్డెర్లు, వాల్మీకులను ఎస్టీలుగా గుర్తింపుపై తమ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వాల్మీకులను, వడ్డెర్లను ఎస్టీలుగా గుర్తించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిథ్యం లేకపోవడం భాదకరమన్నారు.  వచ్చే ఎన్నికల్లో వడ్డెర్లను ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడతామని చెప్పారు.ఎంపీ నిమ్మలకిష్టప్ప మాట్లాడుతూ  వడ్డెర్లు ప్రజల్లోకి వెళ్లి నాయకత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయంగా ఎదగాలన్నారు.



వడ్డెర్లను ఎస్టీలుగా గుర్తించడానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో వడ్డెర్లకు ఎంఎల్‌సీ స్థానం ఇవ్వడం ఖాయమన్నారు.   వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు, కోశాధికారి చెన్నయ్య మాట్లాడుతూ  వడ్డెర్లను ఎస్టీలుగా గుర్తించి ఆర్థికంగా ఎదగడానికి ఫెడరేషన్లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు దేవళ్ల మురళి మాట్లాడుతూ న్యాయమైన వడ్డెర్ల కోర్కెలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించి భవిష్యత్ తరాల పిల్లలకు మేలు చేయాలని కోరారు.  అనంతరం కాలవ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పార్థపారథిలను సన్మానించారు.



సమావేశంలో కార్పొరేటర్ సరళ, వడ్డెర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, జిల్లా ప్రధాన కార్యద ర్శి క్రిష్ణమూర్తి, గౌరవఅధ్యక్షులు బసప్ప, రమణలు, అధికార ప్రతినిధి వెంకటాద్రి,  ఉపాధ్యక్షులు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి చల్లా రామాంజనేయులు, కదిరి నారాయణ, నగర నాయకులు మళ్లికార్జున, యువజన సంఘం నాయకులు మారుతిప్రసాద్, వడ్డెర్లు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top