మృత్యుంజయుడు: నవ్వుతూ బయటకొచ్చాడు!

మృత్యుంజయుడు: చిన్నారి చందు సేఫ్ - Sakshi


వినుకొండ‌: బోరు బావిలో పడ్డ చిన్నారి చంద్రశేఖర్ మృత్యుంజయుడయ్యాడు. జోరుగా వాన కురిసినా బావి నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చేసిన యత్నాలు ఫలించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి దాదాపు 2:45 నిమిషాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిన్నారిని బయటకు తీశాయి.



సుమారు 13 అడుగుల లోతులో పడ్డ బాలుడిని 11 గంటలకు పైగా శ్రమించి బోరు బావికి సమాంతరంగా 25 అడుగుల మేరకు గుంత తవ్వారు. బాలుడి కదలికలను గుర్తించామని, అతడు పిలిస్తే పలుకుతున్నాడని ఆక్సిజన్ అందిస్తున్నామని ఓవైపు అధికారులు తెలపగా.. మరోవైపు రెస్క్యూ సిబ్బంది (ఎన్డీఆర్ఎఫ్) సమాంతరంగా తవ్విన గుంత నుంచి బాలుడిని బావి నుంచి పైకి తీయగానే ఘటనా స్థలంలో బాలుడి తల్లితండ్రులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.


నవ్వుతూ తిరిగొచ్చాడు..

చిన్నారి చందును బోరు బావి నుంచి బయటకు తీయగానే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంచిన వైద్య బృందం 108 అంబులెన్సులో ప్రాథమిక చికిత్స అందించారు. చిన్నారికి ఎలాంటి సమస్య లేదని, బావి నుంచి బయటకు వచ్చేటప్పుడు చందు నవ్వుతూ కనిపించడం గమనార్హం.


అసలేమైందంటే..

ఉమ్మడివరానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషల ఏకైక కుమారుడు చంద్రశేఖర్‌ మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలసి పశువుల పాక వద్దకు వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. కుమారుడి కోసం చాలాసేపు వెతికిన ఆమెకు చివరకు సమీపంలోని బోరుబావిలో పడ్డట్లు గుర్తించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని చురుకుగా పనులు ప్రారంభించింది. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుండగా మధ్యలో రాళ్లు ఎదురైనా, వర్షం కురిసినా ఎన్డీఆర్ఎఫ్ బృందం 11 గంటలకు పైగా తీవ్రంగా శ్రమించి చిన్నారి చంద్రశేఖర్‌ను ప్రాణాలతో కాపడటంతో అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top