రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాలి

రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాలి - Sakshi


మహానాడు వేదికగా చంద్రబాబు పిలుపు

 

హైదరాబాద్: రెండు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయడమే తెలుగుదేశం పార్టీ విధానమని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేసి మూడు రోజుల పాటు జరిగే పార్టీ 34 వ మహానాడును ప్రారంభించారు. అనంతరం వేదిక నుంచి అధ్యక్షోపన్యాసం చేశారు. సమన్యాయమంటే రెండు కళ్ల సిద్ధాంతమని ఎగతాళి చేశారనీ, విమర్శకులకు ఇదే తమ సమాధానమంటూ... వేదికపై కుడివైపున కాకతీయ తోరణం, ఎడమవైపున అమరావతి స్థూపాన్ని చూపించారు. టీడీపీ చేసిన అభివృద్ధితోనే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉందని, దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. అధికార, ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శించుకోవచ్చు కానీ ప్రభుత్వాలు మాత్రం సహకరించుకోవాలన్నారు. ఎప్పడు ఢిల్లీ వెళ్లినా రెండు తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడతానని చెప్పారు.



విద్వేషాల వల్ల ఎవరికీ ఏ ప్రయోజనం లేదన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. సమస్యలను కూర్చుని పరిష్కరించుకుందామని, అవసరమైతే కేంద్రం సాయం కూడా తీసుకుందామని సూచించారు. టీఆర్‌ఎస్ ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, టీడీపీ నాయకులను బజారులో పశువుల్లా కొంటోందని ధ్వజమెత్తారు. ఒకరిద్దరు నేతలు పార్టీ నుంచి బైటకు పోయినా మరింతమంది నేతలను తయారు చేయటంతోపాటు బలీహ నపడకుండా చూశామని చెప్పారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చే అంశంపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. జెండా, గుర్తు విషయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

 

అవినీతి కాంగ్రెస్



 రాష్ట్రంలో పదేళ్ల పాటు అవినీతి పాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో మిలాఖత్ కావడం ద్వారా టీడీపీని దెబ్బతీయాలని విఫలయత్నం చేసిందని ఆరోపించారు. రాజధాని విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని సూస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూశామన్నారు. 2022 నాటికి దేశంలోనే టాప్3 స్థానంలో ఏపీని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ఆయన చెప్పారు. టీడీపీకి 54 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటే అందరి సహకారంవల్లే సాధ్యమైందని కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ప్రసంగిస్తూ చెప్పారు. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రమాద బీమాను చూసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు.

 

నియమావళిలో మార్పులు



టీడీపీకి జాతీయస్థాయి గుర్తింపు కోసం ప్రయత్నించాలని నిర్ణయించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించుకోవడానికి వీలుగా పార్టీ నియమావళిలో పలు సవరణలను మహానాడు వేదికగా ప్రతిపాదించారు.

 

మహానాడు సమావేశాలకు సాక్షి మీడియా గ్రూపును అనుమతించలేదు. సాక్షి మీడియా గ్రూపు ప్రతినిధులను అనుమతించరాదని స్వయంగా చంద్రబాబే ఆదేశాలివ్వడంతో మహానాడును కవర్ చేయడానికి వచ్చిన ఇతర మీడియా ప్రతినిధులను కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించి, ‘సాక్షి’ కాదని తెలుసుకున్నాకే అనుమతించారు. అయినప్పటికీ పాఠకులకోసం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరించి ఈ కథనాన్ని అందిస్తున్నాం.

 

 అట్టహాసంగా మహానాడు

 

హైదరాబాద్/ చేవెళ్ల/ మొయినాబాద్: టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. గండిపేట సమీపంలోని తెలుగు విజయం ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాతీర్చిదిద్దారు.



పోలీసులతో బాలయ్య వాగ్వాదం



 చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కారును ప్రాంగణం బయట పోలీసులు ఆపేసి, అక్కడి నుంచి నడిచి వెళ్లాలనడంతో ఆయన ఆగ్రహించారు. ‘నన్నే ఆపుతారా...?’ అంటూ పోలీసులను లెక్కచేయకుండా మహానాడు వేదిక ప్రధాన ద్వారం వరకూ తన కారులోనే వెళ్లారు.



 ఆకర్షించిన ఎన్టీఆర్ పెళ్లి పత్రిక



 మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వివాహ శుఖలేఖను ప్రతినిధులంతా ఆసక్తిగా తిలకించారు. 1942 మే 2వ తేదీ రాత్రి 3.23 గంటలకు కొమరవోలు గ్రామంలో ఎన్టీఆర్‌తో తన కూతురి వివాహానికి రావాలంటూ బసవతారకం తండ్రి కాట్ర చెంచయ్య ఆ శుభలేఖను ముద్రించారు. మహానాడులో  ఏపీ రాష్ట్ర గీతాన్నే ఆలపించిన వైనం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చేరువలో నిర్వహిస్తున్న మహానాడులో ‘మా తెలుగు తల్లికి...’ అంటూ ఏపీ రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆలపించారు. దాంతో టీటీడీపీ క్యాడర్ ఆగ్రహించింది.



మీడియా ఇక్కట్లు..



మహానాడు కవరేజికి హాజరైన మీడియా ప్రతినిధులను పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువురు విలేకరులు ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా గ్యాలరీలో పార్టీ నాయకులే కూర్చోవటంతో తాము గంటల తరబడి నిల్చుండి నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సైతం కెమెరాలను ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా కేవలం పార్టీ తరఫునే రికార్డు చేసి టీవీలకు ఔట్‌పుట్ ఇచ్చారు. ప్రధాన గేటు వద్ద విలేకరులకు జారీ చేసిన గుర్తింపు కార్డులను నమ్మకుండా తిరిగి ఐడీ కార్డులను చూపాలనడాన్ని విలేకరులు వ్యతిరేకించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top