కామాంధుడి పైశాచికత్వం

కామాంధుడి పైశాచికత్వం - Sakshi


ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి

ప్రాణాపాయ స్థితిలో ఐదేళ్ల చిన్నారి

నిందితుడికి కొమ్ముకాస్తున్న ‘తమ్ముళ్లు’!




 కాకినాడ క్రైం : ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులపై ఓ కామాంధుడు పైశాచికత్వం ప్రదర్శించాడు. ఆ కామాంధుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మృగాడి పైశాచికత్వాన్ని గమనించి అతడి బారి నుంచి తప్పించుకున్న మరో ఏడేళ్ల చిన్నారి జరిగిన ఉదంతాన్ని చెబుతున్న తీరుతో ఆ చిన్నారుల కుటుంబసభ్యులతో పాటు వైద్యులు, సిబ్బంది కళ్లు చెమర్చాయి. కామాంధుడు విరుచుకుపడిన తీరును ఆమె వర్ణిస్తుంటే వారు కన్నీటి పర్యంతమయ్యారు.



చిన్నారులపై పైశాచికంగా దాడి చేసిన నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందినవాడు కావడంతో అతడిని రక్షించేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం నిందితుడి పక్షాన మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల సూచనలతో పోలీసులు కూడా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన కృపారావును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన 35 ఏళ్ల బడి కృపారావు సముద్రంపై చేపల వేట సాగిస్తుంటాడు.



అతడికి తొలుత వివాహమైంది. భార్య చనిపోవడంతో మరో వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలున్నారు. అతడు తరచూ కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలోని అతడి తోడల్లుడు ఉమ్మిడి అమ్మోరి ఇంటికి వచ్చి వెళ్తూ అక్కడున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. శనివారం రాత్రి ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఐదు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను మభ్యపెట్టి తన వెంట సరుగుడు తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.



అతడి చేష్టలకు ఐదేళ్ల చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలోని గైనిక్ విభాగంలో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. తమను వదిలేయమని ప్రాధేయపడినా ఆ కామాంధుడు విడిచి పెట్టలేదంటూ ఏడేళ్ల చిన్నారి చెబుతున్న తీరు కలచివేస్తోంది. ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు కూడా రెక్కాడితేగాని డొక్కాడని వారే. సముద్రంపై చేపలు వేటాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సంఘటనపై తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కృపారావు పరారీలో ఉన్నాడు. ఎస్సై వినయ్ ప్రతాప్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత చిన్నారుల నుంచి వివరాలు సేకరించారు.

 

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం విడిచిపెట్టని కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వైద్యులు, సిబ్బంది సైతం డిమాండ్ చేస్తున్నారు. పైశాచికంగా దాడికి పాల్పడి ఐదేళ్ల చిన్నారిని ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన కృపారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top